త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మాది కేసీఆర్ జాతి.. నీది ట్రెయిట‌ర్ల జాతి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌..!

P

Telangana | Published On Feb 17, 2026, 5.27 pm IST

KTR | మాది కేసీఆర్ జాతి.. నీది ట్రెయిట‌ర్ల జాతి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌..!
Advertisement

KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో అధినేత కేసీఆర్ పుట్టిన‌రోజు కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి పేరు ప్ర‌స్తావించ‌కుండానే తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 'మ‌నం ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక కొంద‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మ‌న నేత‌ను తూల‌నాడుతున్నారు. జాతిపై, జాతి గౌర‌వంపై ఎవ‌రు ప‌డితే వాళ్లు మాట్లాడుతున్న‌రు. నేను వాళ్లంద‌రికీ ఒకే చెబుతున్నా. తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉక్కుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌర‌వం ఏంటో తెలుస్తుంది. స‌క‌లజ‌నులు స్వ‌రాష్ట్ర స‌మ‌రంలో తెగించి కొట్లాడుతున్న‌ప్పుడు.. ప్రాణాల‌కు తెగించి మ‌న నాయ‌కుడు నిరాహార దీక్ష చేస్తున్న‌ప్పుడు, స‌మైక్య‌వాదుల సంచులు మోసే స‌న్నాసుల‌కు జాతి తెలియ‌దు నీతి తెలియ‌దు గుర్తు పెట్టుకో' అంటూ మండిప‌డ్డారు.

జై తెలంగాణ అని నినాదం ఇచ్చేందుకే భ‌య‌ప‌డే వారికి ఏం తెలుస్త‌ది..

'లాఠీ దెబ్బ‌తిన్నోళ్ల‌కు, జైళ్ల‌కుపోయినోళ్ల‌కు, తుపాకుల‌కు ఎదురొడ్డి నిలిచిన జాతి, జాతి అస్థిత్వం అంటే ఏంటో తెలుస్తుంది. ఉద్య‌మ‌కారుల‌పైకి ఆరోజు తుపాకుల తీసుకొని దాడికి పోయిన ద్రోహుల‌కు జాతి, జాతి నిర్వ‌చ‌నం ఎట్ల తెలుస్త‌ది? ర‌క్తంలో పౌరుషం ఉంటే.. డీఎన్ఏ ఉద్య‌మం ఉంటే.. ఆత్మాభిమానం అనేది ఎక్క‌డ‌న్నా.. శ‌రీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏంటో.. జాతి చ‌రిత్ర ఏంటో తెలుస్త‌ది. జై తెలంగాణ అని నినాదం ఇచ్చేందుకే భ‌య‌ప‌డేవారికి, కిరాయి స‌ర్కారుకు, తెలంగాణ సోయి లేని స‌న్నాసుల‌కు తెలియ‌దు. అడుగుతున్న కొంత మంది.. ఏ జాతికి నువ్వు జాతిపిత‌.. ఏ జాతి అని మాట్లాడుతున్న‌రు.. వాడికి నేను చెబుతున్నా.. ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్న అల్పుడికి, అల్పుల‌కు చెబుతున్నా.. రాజ్య‌తంత్రం న‌డిపిన రాణిరుద్ర‌మ్మ జాతి మాది. జ‌ల్ జంగ‌ల్ జ‌మీన్ అని కొట్లాడిన కుమ్రంభీముడి జాతి మాది' అన్నారు.

రాష్ట్రం కోసం అసువులు బాసిన యువ‌కిశోరాల జాతి..

'అస్తిత్వం కోసం అమ‌రులైన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాతి మాది. కోట‌ల‌పై జెండా ఎగుర వేసిన బ‌హుజ‌న వీరుడు స‌ర్వాయి పాప‌న్న జాతిమాది. భూస్వాముల దోపిడీపై పోరాడిన జాతి మాది. గ‌డిలో బందూక్ ప‌ట్టి దేశ్‌ముఖ్‌ల‌ను త‌రిమికొట్టిన వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ జాతి మాది. సామాజిక విప్ల‌వ‌కారుడు భాగ్యారెడ్డి వ‌ర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటుపై తిరుగుబావుటా ఎగుర‌వేసి తుర్రేబాజ్‌ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడే మోసం చేస్తే ఉక్కుపాత‌రేస్తామ‌న్న కాళోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ అని చెప్పిన దాశ‌ర‌ధి జాతి మాది. 1952లో గైర్ ముల్కి గో బ్యాక్ అంటూ నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమ‌ర‌వీరుల జాతిమాది. 1969లో క‌ర్క‌శ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులుబాసిన యువ‌కిశోరాల జాతి మాది. మ‌లి ద‌శ ఉద్య‌మంలో ఢిల్లీ మెడ‌లు వంచిన తెలంగాణ జాతి మాది. అణువ‌ణువునా ఆత్మ‌గౌర‌వం తొణికిస‌లాటే జాతి మాది. నీతి ఉన్న.. తీరి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకు ఏం తెలుస్తుంద‌ని వాడిని అడుగుతున్న' అని అన్నారు.

ఢిల్లీకి స‌లాం కొట్టే సామంతులం కాదు..

'ఒక్క‌టి మాత్రం ప‌క్కా ఢిల్లీకి స‌లాం కొట్టి బ‌తికే సామంతులం కాదు. నిటారుగా నిల‌బ‌డ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమిపుత్రుల జాతిమాది. సామంతుల జాతి కాదు.. స్వ‌తంత‌రుల జాతి మాది. బానిస‌కొక బానిస జాతి కాదు. గిరిగీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతికాదు మాది. అధిష్ఠానం ఆడిస్తే ఆడిస్తే తోలుబొమ్మ‌ల జాతి కాదుమాది. తెగువ ఉన్న‌, పౌరుషం ఉన్న భూమిపుత్రుల జాతి మాది. ప‌రాయి వాళ్ల పంచ‌న చేరి కిరాయి బ‌తుకు బ‌తికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శ‌క్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది.. ఏ జాతికి జాతిప‌ది అని అడిగిన స‌న్నాసికి ఇవ‌న్నీ చెబుతున్నా. అయినా ఒక‌టి మాత్రం ప‌క్కా. తెలంగాణ‌లో రెండే జాతులున్న‌య్‌. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి.. మాది కేసీఆర్‌లాంటి ఫైట‌ర్ల జాతి. నీది ట్రెయిట‌ర్ల జాతి గుర్తు పెట్టుకో' అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్‌.

Advertisement
Advertisement