త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కోల్ స్కామ్‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పండి

KTR | సింగరేణి సంస్థలో రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి ప్రకటించిన నిల్వల్లో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Jun 5, 2026, 4.15 pm IST

KTR | కోల్ స్కామ్‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పండి
Advertisement
  • 40ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు క్షేత్ర‌స్థాయిలో మాయం
  • కాంగ్రెస్ పాల‌న‌లో కుంభ‌కోణాల‌కు కేంద్ర‌బిందువుగా సింగ‌రేణి
  • కేంద్రం స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది
  • కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ‌

KTR | సింగరేణి సంస్థలో రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి ప్రకటించిన నిల్వల్లో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేంద్రబిందువుగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సింగరేణిలో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పలు అనుమానాలకు కారణమవుతోందన్నారు.

40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడ?

సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైన వివరాల ప్రకారం ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్‌లో 8 లక్షల టన్నులు, రామగుండం-1లో 6 లక్షల టన్నులు, రామగుండం-2లో 4 లక్షల టన్నులు, భూపాలపల్లిలో 5.40 లక్షల టన్నులు, ఇల్లందులో 3.50 లక్షల టన్నులు, సత్తుపల్లిలో 2 లక్షల టన్నులు సహా మొత్తం సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఆయా కోల్ స్టాక్ యార్డుల వద్ద ఈ బొగ్గు నిల్వలు కనిపించకపోవడం వల్ల రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. బొగ్గు నిల్వలపై కోల్ సెస్, ఆదాయపు పన్ను చెల్లించినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిల్వలు లేకపోవడం వెనుక ఎవరి పాత్ర ఉందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.

తనిఖీలు ఎందుకు జరగలేదు?

ఏప్రిల్ నెలలో బొగ్గు నిల్వలను తనిఖీ చేయాల్సిన కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారుల బృందాలు గనులను సందర్శించలేదని, కాగ్ అధికారులు కూడా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ కుంభకోణాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కేటీఆర్, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఆయా గనుల వద్దకు పంపి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే సింగరేణిలో జరుగుతున్న భారీ అక్రమాల గుట్టు రట్టవుతుందని పేర్కొన్నారు.

నైని టెండర్ల స్కాంపై ప్రశ్నలు

ఇటీవల బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన నైని బొగ్గు గని టెండర్ల కుంభకోణంపై కూడా కేటీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన పేరుతో కొందరికి అనుకూలంగా టెండర్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసినప్పటికీ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 107 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లు, డీజిల్ కొనుగోళ్ల విధానం మార్పు, పేలుడు పదార్థాల కొనుగోళ్లలో అధిక చెల్లింపులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ నిర్వహణ కోసం సింగరేణి నిధులను వినియోగించిన వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు.

విచారణ లేకపోతే ఉద్యమం

సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆస్తిగా భావించే సింగరేణి సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement