త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | దేశ‌మంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుత‌లే

KTR | దేశమంతా తిరుగుతూ ‘ఛాత్రోంకీ గూంజ్’ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ జాడ దొర్కుత‌లేద‌ని.. ఆయ‌న‌కు తెలంగాణ‌లో అడుగుపెట్టే ధైర్యం లేదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Oct 25, 2026, 7.06 pm IST

KTR | దేశ‌మంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుత‌లే
Advertisement
  • ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌పై స‌మాధానం చెప్పే బాధ్య‌త ఆయ‌న‌దే
  • బీజేపీ ప్ర‌జ‌ల‌ను విభ‌జిస్తే.. కాంగ్రెస్ వారిని దోచుకుంటుంది
  • రేవంత్ రాహుల్‌కు ఏటీఎం కార్డులా ప‌ని చేస్తుండు
  • తెలంగాణ భ‌వ‌న్‌లో రేవంత్‌, రాహుల్‌పై కేటీఆర్ తీవ్ర‌ విమ‌ర్శ‌లు

KTR | త్రినేత్ర న్యూస్‌: దేశమంతా తిరుగుతూ ‘ఛాత్రోంకీ గూంజ్’ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ జాడ దొర్కుత‌లేద‌ని.. ఆయ‌న‌కు తెలంగాణ‌లో అడుగుపెట్టే ధైర్యం లేదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌పై స‌మాధానం చెప్పే బాధ్య‌త ఆయ‌న‌పై ఉంద‌ని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీకి ఏటీఎం కార్డులా ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మైనారిటీ సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. ఆదివారం తెలంగాణ భ‌వన్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నాయ‌కుడు జిబ్రాన్ షరీఫ్ చేరికతో బీఆర్ఎస్‌కు మరింత బలం వ‌చ్చింద‌న్నారు.

రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంగా మారింది. 420 హామీలిచ్చి ప్రజలకు ముఖం చాటేశారు. వెయ్యి రోజులైనా హామీల అమలు ఏది? రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయిండు. తమకు ముట్టే సొమ్ముల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్న‌డు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదు. రేవంత్ రెడ్డి పాలనలో వరుస స్కామ్‌లు.. ప్రశ్నిస్తే తిట్లు, అక్రమ కేసులతో బెదిరిస్తున్నారు.

2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణను తిరిగి నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారు.

టీ స్టాల్ ద‌గ్గ‌ర కూసుండిచ్చిన హామీలు ఏమైన‌య్‌?

ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో టీ స్టాల్ వద్ద కూర్చొని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలి. వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు.

మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అందులో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదు? రైతులకు ఎకరానికి రూ.10,000కు బదులుగా రూ.15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ హామీని కూడా అమలు చేయలేకపోతోంది. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి, విమర్శలకు తిట్లతో బదులిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల హక్కు కూడా.

రూ.1,000 కోట్ల డీల్‌పై వివ‌రాలు వెల్ల‌డించాల్సిందే

రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్న ఐదు ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చేసిండు. అమెరికాలో నివసిస్తున్న మరో తమ్ముడికి సంబంధించినదిగా పేర్కొంటున్న రూ.1,000 కోట్ల డీల్‌పై సమగ్ర వివరాలు వెల్లడించాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్‌లో కరెంటు కోతలు, నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో జనరేటర్లు తప్పనిసరిగా ఉండే పరిస్థితులు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్, తాగునీరు సహా మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసింది. మతం పేరుతో రాజకీయాలు చేయకుండా, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పదేళ్లపాటు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించాం. హైదరాబాద్ నగరం గంగా-యమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచేలా మత సామరస్యాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది.

హైదరాబాద్ ప్రజలు తమ ప్రభుత్వ పనితీరును గుర్తించి బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారు. జిల్లాల్లోని అమాయక రైతులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ప్రయోగించడం, అరెస్టులతో భయపెట్టడం వంటి రాజకీయ ధోరణులు ప్రజాస్వామ్యానికి మంచివి కావు. బీజేపీ పాలనలోనూ ఇలాంటి ధోరణులే కొనసాగుతున్నాయి.

దేశంలో మతతత్వ రాజకీయాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరిపోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొనే రాజకీయ సత్తా కాంగ్రెస్‌కు లేదు. ప్రజల సమస్యలపై పోరాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తిగా బీఆర్ఎస్ నిలుస్తుంది. రాబోయే ఏడాదిన్నర కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement