Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి
Duddilla Sridhar Babu | సింగరేణి అక్రమాలపై కేటీఆర్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని.. లేదంటే బురద జల్లడం మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కౌంటరిచ్చారు.
- సింగరేణిని ప్రైవేటీకరణ వైపు నెట్టింది మీరే
- సింగరేణి సంపదను పెంచడం, పంచడమే మా లక్ష్యం
- సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసమే తెచ్చాం
- సింగరేణిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Duddilla Sridhar Babu | త్రినేత్ర న్యూస్: సింగరేణి అక్రమాలపై కేటీఆర్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని.. లేదంటే బురద జల్లడం మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కౌంటరిచ్చారు. రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని.. బీఆర్ఎస్ హయాంలో నైనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ప్రతి టన్నుకూ లెక్క ఉన్న ఈ వ్యవస్థలో బొగ్గు మాయమయ్యే అవకాశమే లేదని చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను సింగరేణి సంస్థ ప్రయోజనం కోసమే ప్రవేశపెట్టామన్నారు. ఇది ఏ ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించింది కాదని స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఆయన మాట్లాడారు. సింగరేణి సంపదను పెంచడం... ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. దుష్ప్రచారంతో దీన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
సింగరేణిలో ప్రస్తుతం తొమ్మిది గనుల నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోంది. గత పదేళ్లలో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సగటున సుమారు 4 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా అయింది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి 25 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేసింది. అందులో జీ-9 గ్రేడ్ బొగ్గు 1.20 మిలియన్ టన్నులు (12 లక్షల టన్నులు) మాత్రమే. దానిలోనూ 0.52 మిలియన్ టన్నులు తెలంగాణ జెన్కో విద్యుత్ కేంద్రాలకే సరఫరా అయింది.
కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు దక్కలేదు
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఇంధన సరఫరా ఒప్పందం మీ హయాంలో జరిగిందే. సింగరేణి భవిష్యత్తులో చేపట్టే కొత్త గనుల నుంచి పెరిగే ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని ఆ ఒప్పందం జరిగింది. మరి ఆ కొత్త గనులు ఎందుకు రాలేదు..? కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కీలకమైన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు సంస్థకు దక్కలేదు. ఫలితంగా ఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాన్ని సింగరేణి కోల్పోయింది.
దాదాపు 14 గనులు మూతపడటం కూడా ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపింది. దీనివల్ల 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి కోల్పోయింది వాస్తవం కాదా? రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించాం. మీ హయాంలో నైనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 2013లో మా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన తాడిచెర్ల బ్లాక్-2కు మైనింగ్ అనుమతులు తెచ్చాం. వేలం ద్వారా మణుగూరు పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కించాం. వీటితో రానున్న రోజుల్లో సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
137 ఏళ్ల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ నుంచి రవాణా, తూకం, తుది పంపిణీ వరకు ప్రతి దశను పర్యవేక్షించే సాంకేతికత ఆధారిత, బహుళ అంచెల వ్యవస్థ అమల్లో ఉంది. SAP/ERP అనుసంధానం, GPS/GPRS ద్వారా వాహనాల ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ తూకం, ఆకస్మిక తనిఖీలు, బూమ్ బారియర్లు, బొగ్గు నిల్వల క్రమానుగత పరిశీలన, బొగ్గు చోరీ నిరోధక (ACT) బృందాలు, నిరంతర నివారణాత్మక విజిలెన్స్ చర్యలు... ఇన్ని అంచెల నిఘా ఉంది. ప్రతి టన్నుకూ లెక్క ఉన్న ఈ వ్యవస్థలో బొగ్గు మాయమయ్యే అవకాశమే లేదు. ఆధారాలు ఉంటే బయటపెట్టండి. లేకుంటే సింగరేణి కార్మికుల, అధికారుల నిజాయితీపై బురద చల్లడం మానుకోండి.
సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను సింగరేణి సంస్థ ప్రయోజనం కోసం మాత్రమే ప్రవేశపెట్టాం. ఇది ఏ ఒక్కరి ప్రయోజనం కోసం ఉద్దేశించింది కాదు. కాంట్రాక్టు చేపట్టేవారికి తాము చేయబోయే పనిపై ముందే పూర్తి అవగాహన ఉండాలి. టెండర్ దక్కిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు జరగాలి... ఇదే ఈ నిబంధన ఉద్దేశం. గతంలో ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు అక్కడి భౌగోళిక పరిస్థితి, స్థానిక సాంఘిక అంశాలు, మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించకుండానే టెండర్లు వేసేవారు. టెండర్ దక్కి పని మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులకు ఇమడలేక పనులు ఆపేయడం, మధ్యలోనే వదిలేసి వెళ్లడం జరిగింది. నష్టపోయింది సింగరేణే. అందుకే ఈ నిబంధన ఆరోగ్యకరమైన పోటీకి, సమర్థంగా పనిచేయగలిగే వారికి అవకాశం కల్పించేదే.
ఇది సింగరేణికే ప్రత్యేకం కాదు. జీఎండీసీ-గుజరాత్, జీఐపీసీఎల్, ఎన్ఎండీసీ, కొన్ని సోలార్ ప్రాజెక్టులు, ఈపీసీ కాంట్రాక్టుల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. సింగరేణిలోనూ ఇది కొత్త కాదు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐ సలహా మేరకు 2018, 2021, 2023లో సి.హెచ్.పి.ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలోనూ సైట్ విజిట్ ను పొందుపరిచారు. ఈ నిబంధన ప్రవేశపెట్టిన తర్వాత కాంట్రాక్టు దక్కించుకున్నవారు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓవర్ బర్డెన్ తొలగింపును సజావుగా కొనసాగిస్తున్నారు.
2018, 2021, 2023 టెండర్లలో సరైనదైన నిబంధన ఇప్పుడు తప్పెలా అవుతుంది? అప్పుడు నోరు మెదపని వారు ఇప్పుడు ప్రశ్నించడం కేవలం రాజకీయమే. సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. సంస్థను మరింత బలోపేతం చేసి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. నిజానికి సింగరేణిని ప్రైవేటీకరణ వైపు నెట్టింది గత పాలకులే. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వకుండా, సంస్థకు కొత్త బ్లాకులు దక్కకుండా చేసి, తమ సన్నిహితులకు బ్లాకులు దక్కేలా చేసుకున్నారు.
ప్రజా ప్రభుత్వం ఒకే లక్ష్యంతో పనిచేస్తోంది. సింగరేణికి కొత్త బొగ్గు గనులను సాధిస్తున్నాం. భవిష్యత్తులోనూ మరిన్ని గనులను సాధించేందుకు కృషి చేస్తాం. బొగ్గు ఉత్పత్తితో పాటు కీలక ఖనిజాలు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో సింగరేణి విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నాం. గనులు పోగొట్టిన వారు ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారు. గనులు తెస్తున్న మేం సింగరేణిని కాపాడుతున్నాం.
గత పదేళ్ల BRS పాలనలో సింగరేణిని ఏటీఎమ్‌లా వాడుకొని, నాశనం చేసి.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో పారదర్శకత వస్తుంటే అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గత పదేళ్ల BRS పాలనలో టెండర్లలో జరిగిన దోపిడీ, కమీషన్ల సంస్కృతికి మేం అడ్డుకట్ట వేశాం. పారదర్శకత కోసం, టెండర్లను క్రమబద్ధీకరించడం వల్ల కొన్ని శక్తులకు కమీషన్లు ఆగిపోయి కడుపు మండుతోంది. అక్రమాలు జరిగాయని మాట్లాడే కేటీఆర్, ఆ పార్టీ నాయకుల వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలి, ఊహాజనిత ఆరోపణలతో రాజకీయం చేయడం తగదు.
గత పదేళ్లలో BRS చేసిన పాపాలను, విద్యుత్ సంస్థలకు బకాయిలు పెట్టిన తీరును కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్, ఆ పార్టీ నాయకులు మాపై బురదజల్లుతున్నారు. మేము వచ్చాక సింగరేణిని కాపాడి, ఆర్థిక క్రమశిక్షణలోకి తీసుకొస్తున్నాం. పదేళ్ల మీ కేసీఆర్ పాలనలో సింగరేణికి రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టి, సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టింది మీరు కాదా... విద్యుత్ సంస్థల పేరుతో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా? అప్పుడే మర్చిపోయారా? పదేళ్ల మీ కుటుంబ పాలనలో జరగని అవినీతి ఉందా..? కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ వరకు రూ. లక్ష కోట్ల కుంభకోణాలకు పాల్పడిన మీ నోటి వెంట 'అవినీతి' అనే మాట రావడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.
టెండర్లలో పారదర్శకత తెచ్చి, దోపిడీకి అడ్డుకట్ట వేస్తుంటే... ఎక్కడ మీ పదేళ్ల పాపాలు... అవినీతి బయట పడుతుందో అని డైవర్షన్ పాలిట్రిక్స్ చేసేందుకు మాపై విమర్శలు చేస్తున్నారనే అనే సంగతి అందరికి తెలుసు. ఉత్పత్తి తగ్గుదల గురించి మీరే మాట్లాడటం హాస్యాస్పదం. మీ హయాంలో చేసిన తప్పులు, నాసిరకం ప్లానింగ్ వల్ల సంస్థ ఇబ్బంది పడింది నిజం కాదా? లాభాల వాటా గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కార్మికులను ఏవిధంగా మోసం చేశారో అందరికీ తెలుసు. మాకు కార్మికుల సంక్షేమమే ముఖ్యం. వారికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాం. ఇందులో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత మీకు లేదు.
మేం వచ్చాక గనుల భద్రతకు, పర్యావరణ సమత్యులతకు ప్రాధాన్యం ఇస్తూ క్రమక్రమంగా ఉత్పత్తిని గాడిన పెడుతున్నాం. మీలాగా కాంట్రాక్టర్ల కోసం కమీషన్ల కోసం మేము గనులను గాలికి వదలలేదు. సింగరేణి తెలంగాణ ప్రజల గుండెకాయ. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదు. కానీ గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోదీ కాళ్ళ మీద పడిన చరిత్ర మీది కాదా? అప్పుడు మౌనంగా ఉండి బీజేపీకి పరోక్షంగా సహకరించింది మీరు కాదా?
అసలు బీజేపీతో రహస్య ఒప్పందాలు ఎవరికి ఉన్నాయో తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి... సింగరేణిని గతంలో కాపాడిన... ఇప్పుడు కాపాడుతున్న.. భవిష్యత్తులోనూ కాపాడబోయేది మేమే. యాదాద్రి ప్లాంటును కేవలం కమీషన్ల కోసం అతుకుల బొంతలా నిర్మించి, సాంకేతిక లోపాలతో మూలన పడేలా చేసింది మీరు కాదా...?? ఆ లోపాలను సరిదిద్దుతుంటే మాపై విమర్శలు చేస్తారా? ప్రణాళికాబద్ధంగా బొగ్గు ఉత్పత్తిని పెంచి.. విద్యుత్ కొరత లేకుండా ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తుంటే మాపై విమర్శలు చేస్తారా? అని శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?
అక్టోబర్ 15, 2026

Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
అక్టోబర్ 15, 2026

Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్
- ●IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?
- ●Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
- ●Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు
- ●CJI Surya Kant on Rahul Gandhi | "న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు": సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
- ●Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు

Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్

IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?

Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు



