త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KRMB | నేడు జలసౌధలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటి కేటాయింపులపై చర్చ..!

P

Telangana | Published On May 12, 2026, 6.30 am IST

KRMB | నేడు జలసౌధలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటి కేటాయింపులపై చర్చ..!
Advertisement

KRMB | హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ కీలక సమావేశం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, శ్రీశైలం-నాగార్జునసాగర్‌ జలాల కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొననున్నారు. జూలై వరకు రెండు రాష్ట్రాలకు అవసరమైన తాగునీటి పరిమాణంపై సమీక్షించి తుది ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం మే నెలాఖరు వరకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ సర్కారు కోరుతోంది.

ఈ మేరకు ఏపీ ఈఎన్‌సీ గత నెల 29న బోర్డుకు లేఖ రాశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం జూలై వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 13 టీఎంసీల నీటిని కేటాయించాలని మే 2న బోర్డును కోరింది. ఇప్పటికే ఏపీ తన వాటాకు మించి మంచి నీటిని వినియోగించుకుందని, ఇకపై అదనపు కేటాయింపులు విడుదల చేయొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అవసరాలు, శ్రీశైలం-సాగర్‌లో ప్రస్తుత నీటి లభ్యతను పరిశీలించిన అనంతరం త్రిసభ్య కమిటీ తమ సిఫారసులను కృష్ణా బోర్డుకు అందజేయనుంది. కమిటీ నివేదిక ఆధారంగా నీటి కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, కృష్ణా బోర్డు 21వ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement