త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

KCR | తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

G

Telangana | Published On Jul 31, 2026, 7.33 am IST

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషీ విఫలం కావడం పట్ల మనోవేదన వ్యక్తంచేశారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు.

పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు వత్తిల్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయన్నారు. పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులైవున్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా వుండాలని అధినేత సూచించారు. ఆయ‌న‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడు: హ‌రీశ్ రావు

ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింద‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో అంతా ఎదురుచూశామ‌ని, కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంద‌ని చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతార‌ని వెల్ల‌డించారు.

ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోట‌ని చెప్పారు. వ్యక్తిగతంగా త‌నకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయాన‌ని తెలిపారు. పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాని అన్నారు.

ఆత్మ‌కు శాంతి చేకూరాలి: సంతోష్‌ కుమార్‌

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత పెద్ది సుద‌ర్భ‌న్ రెడ్డి మృతిప‌ట్ల మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌నతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుద‌ర్శ‌న్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement