త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | పెట్టుబ‌డుల‌న్నీ క‌ట్టుక‌థ‌లే: క‌విత‌

Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేన‌ని జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మండిప‌డ్డారు. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని విమ‌ర్శించారు. వాటిపై తాను చేసిన ప‌రిశోధ‌న‌ల్లో చాలా కంపెనీల గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు.

A

Telangana | Published On Feb 2, 2026, 3.03 pm IST

Kavitha | పెట్టుబ‌డుల‌న్నీ క‌ట్టుక‌థ‌లే: క‌విత‌
Advertisement

ఫేక్ ఎంవోయూల పేరుతో యువ‌త ఉద్య‌మించాలి
రాచరిక, నియంతృత్వ పోకడలను మార్చుకోకుంటే బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయి మోడీని కలిసిన సరే 30 వేల కోట్లు తేలేదు
గుంట‌న‌క్క‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ్యాచ్ ఫిక్స్‌
ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారించి తుది దశకు తెస్తారన్న నమ్మకం లేదు
జాగృతి తరఫున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం
విలేక‌రుల స‌మావేశంలో క‌విత‌

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌ : కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేన‌ని జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మండిప‌డ్డారు. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని విమ‌ర్శించారు. వాటిపై తాను చేసిన ప‌రిశోధ‌న‌ల్లో చాలా కంపెనీల గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూల పేరుతో తెలంగాణ యువత ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో క‌విత మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుల‌కు మూడు సార్లు వెళ్లార‌ని, హైద‌రాబాద్‌లోనే గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించార‌ని గుర్తు చేశారు. వీటి ద్వారా మనకు ల‌క్ష‌ల కోట్ల‌ రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని అన్నారు.

"మేము రీసెర్చ్ చేసి కంపెనీల వివరాలన్నింటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాం. కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలను తెలంగాణ యువత ఎక్స్ పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అగ్నిప్రమాదాలు జరిగినా, మహిళలపై దాడులు జరిగిన సరే సీఎం స్పందించరు. కానీ లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలు పేరుతో తెలంగాణ యువత వీటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే పెట్టుబడులు వచ్చి ఉంటే వాటి వివరాలు చెప్పండి. వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో కూడా చెప్పండి. తీసుకొచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది' అని క‌విత వ్యాఖ్యానించారు.

  • ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ లక్ష కోట్లు పెట్టుబడి అన్నారు. కానీ ఆ సంస్థ మొత్తం మార్కెట్ వ్యాల్యూయే 30 వేల కోట్లు. అది అమెరికాలో ఉన్న సంస్థ. ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఎలా పెట్టుబడులు పెడతారో రోడ్ మ్యాప్ లేదు.
  • ఏడీఐజీసీ సింగపూర్ గేట్ వే అనే సంస్థ డేటా సెంటర్ ద్వారా 67 వేల కోట్లు పెట్టుబడులు అన్నారు. కానీ ఆ సంస్థకు కనీసం వెబ్ సైట్ కూడా లేదు.
  • ఇన్ ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ అనే సంస్థ 70 వేల కోట్లు పెట్టుబడులు అని చెప్పారు. కానీ ఈ కంపెనీని గతేడాది మే లో మాత్రమే పెట్టారు. ఈ సంస్థ అమెరికాలో 90 వేల కోట్లు, బ్రెజిల్ ప్రభుత్వంతో 70 వేల కోట్లు ఎంవోయూ చేసుకున్నారు. అంటే ఈ సంస్థ కేవలం ఎంఓయూ ల కోసమే పెట్టారా? లేదంటే బ్యాంక్ లను మభ్య పెట్టే పనిచేస్తున్నారా? ప్రజలకు చెప్పాలి.
  • ఇక బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ సంస్థ 75 వేల కోట్లు పెట్టుబడి అన్నారు. అదే సంస్థకు చెందిన మరొక సంస్థ 25 వేల కోట్ల పెట్టుబడి అని చెప్పారు. కానీ ఈ సంస్థ మార్కెట్ వ్యాల్యూ కన్నా కూడా చాలా ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్పాయి.
  • ఇక కుందురూ జయవీర్ రెడ్డి గారి సంస్థ కూడా 5 వేల 6 వందల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఇది నిజమైన కంపెనీయేనా అనేది జయవీర్ రెడ్డి గారు చెప్పాల్సి ఉంది.
  • ఇక భరత్ గరుడ, 2100 కోట్లు, ఎస్ఎల్ఆర్, ఆర్సీటీ అనే సంస్థలు దాదాపు 2 వేలకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. కానీ ఆ సంస్థల ఫెడ్ ఆఫ్ క్యాపిటల్ పది లక్షలు కూడా లేదు. అదే విధంగా వారికి వెబ్ సైట్ కూడా లేదు.
  • ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ కథ మరీ విచిత్రం. ఆ సంస్థ 5 వందల కోట్ల పెట్టుబడి పెడతామని ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత కంపెనీ పెట్టారు.

హార్వ‌ర్డ్ ఫీజు ఎవ‌రు క‌ట్టారు

'ఇప్పుడు సీఎం గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ మీరు చేసిన కోర్సుకు ఫీజు సింగరేణి నుంచి కట్టారా లేదంటే ఎవరైనా బిజినెస్‌మెన్ మీ తరఫున ఫీజు కట్టారా? లేదంటే మిమ్మల్ని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్లే ఇన్వైట్ చేశారా? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి' అని క‌విత డిమాండ్ చేశారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మా అభ్య‌ర్థుల‌ను గెలిపించండి

'మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలని కేటీఆర్ గారు అంటున్నారు. అంటే కేసీఆర్ గారి లేబుల్ చూసి ఓటు వేయాలని కోరటం ఏంటీ? మంచోడైనా, చెడ్డోడైనా ఓటు వేయాలనటం మీ నితంతృత్వ, రాజరిక పోకడలకు నిదర్శనం. కులం, మతం, చుట్టమని లేదా పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయండి. పైసలు అడిగెటోడు కాకుండా ఆపతి, సంపతికి మనకు పనిచేసేటోళ్లను గెలిపించండి. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతాం. జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపాం. మేము మంచి అభ్యర్థులను పెట్టాం. వారికి ఓటు వేసి గెలిపించండి' అని క‌విత పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బీజేపీ మోసం చేసింది

'కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలను బీజేపీ ఘోరంగా మోసం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి కోడలు అయినా మనకు ఏమీ దక్కలేదు. ఇక ఎడ్యుకేషన్, వైద్యానికి మొత్తం 53 లక్షల కోట్ల బడ్జెట్ లో ఒక్క శాతం కూడా నిధులు కేటాయించలేదు. ఇది సరైన పద్దతి కాదు. దీనిపై యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. 12 ఏళ్లైనా సరే విభజన హామీలను అలాగే పెండింగ్ లో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాలకు సంబంధించి అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. అర్బన్ డెవలప్ మెంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్-2 కు నిధులు ఇవ్వలేదు. ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదు. విభజన హామీలైన ఉక్కు ఫ్యాక్టర్టీ, కోచ్ ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు. మెట్రో ఫేజ్ వన్ రిపోర్ట్ ను ప్రభుత్వం ఇవ్వకపోవటంతోనే నిధులు ఇవ్వలేదని కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తే నిధులు ఎలా ఇస్తారు? ముందు కేటాయింపులు జరపాలి కదా? మోడీ తనకు బడే భాయ్ అంటూ 30 సార్లు సీఎం ఢిల్లీ వెళ్లారు. కనీసం 30 వేల కోట్లు కూడా మనకు తీసుకురాలేదు. ఫెడరల్ స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. ఈ వైఖరిని మార్చుకోవాలి' అని క‌విత హిత‌వు ప‌లికారు.

అగ్నిప్ర‌మాదాల‌పై ప‌ట్టింపేలేదు

'సిటీలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు సిటీలో చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. రూబీ హోటల్, దక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్, గుల్జార్ హౌస్ లో అగ్నిప్రమాదాలు జరిగాయి. మొన్నటికి మొన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోయారు. మొత్తం అగ్నిప్రమాదాల్లో చాలా మంది చనిపోయారు. కానీ సీఎం కనీసం పరామర్శించలేదు. మొన్నటి ప్రమాదంలో తెలంగాణ వాళ్లు లేరు అంటున్నారు. కనీసం సీఎంగా ఉండి కన్‌స‌ర్న్‌ చూపించాలి కదా? సీఎం గారు పీఆర్ స్టంట్లు మానేసి సెల్లార్‌లో జరిగే బిజినెస్, పాత బిల్డింగ్‌ల‌ను మానిటర్ చేయాలి' అని క‌విత సూచించారు.

శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయి

'ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై ఆటాక్ జరిగితే కనీసం సీఎం స్పందించలేదు. ఆమె చనిపోయిన తర్వాత మాత్రం సీఎం నుంచి ట్వీట్ చేశారు. ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లకు వెపన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకుండా పోయింది. గత ఒక్క ఏడాదిలోనే 69 హత్యలు, 176 హత్యాయత్నాలు జరిగాయి. దీనికి తోడు గన్ కల్చర్ కూడా మన వద్ద మోపైంది. రెండు రోజుల క్రితం కోటిలో గన్ తో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దోచుకున్నారు. గతేడాది అయితే పోలీసుల మీదనే దాడులు జరిగాయి. అయినా సరే హోమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మేల్కొలేదు. ఇక నుంచి ఇలాంటి అనేక అంశాలపై మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తాం' అని క‌విత స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను మార్చాలి

'ఫిబ్రవరి 20 తర్వాత మా జనం బాట కార్యక్రమం కొనసాగుతుంది. బీఆర్ఎస్ రాజరిక పోకడలు అనుసరిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదు. ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా బీజేపీ తెలంగాణకు రూపాయి ఇవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పొలిటకల్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. యువత, మహిళలు, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ పెట్టుబడుల రాకెట్ ను మనం బయట పెట్టాల్సి ఉంది' అని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎన్నిక‌ల కోస‌మే ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ‌

'ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలి. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకే ఆయనను విచారణకు పిలిచారు. విచారణకు ఎవరినీ పిలిచినా సరే వెళ్లాల్సిందే. చట్టాలకు ఎవరూ అతీతం కాదు. నేను తప్పు చేయకపోయినా సరే ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే కూడా వెళ్తాను. కానీ కేటీఆర్ గారు మాత్రం కేసీఆర్ గారిని అసలు విచారణకే పిలవద్దు అని అంటున్నారు. ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ ను ఎవరు కాపాడలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణను తుది దశకు తేవాలి. అదే విధంగా కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. ఐతే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారని నాకు నమ్మకం లేదు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నారు. నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా ఎందుకు కేసు ముందుకు పడటం లేదు. సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్లుగా ఉంది పరిస్థితి' అని క‌విత దుయ్య‌బ‌ట్టారు.

Advertisement
Advertisement