త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | సీఎం సొంత జిల్లాలోనే నీటి కష్టాలు.. గుంటనక్కకు, రేవంత్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?: కవిత ఫైర్

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, కేవలం సిద్ధిపేటకే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్యే మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలపై కీలక డిమాండ్లు చేశారు.

J

Telangana | Published On Feb 10, 2026, 7.07 pm IST

Kalvakuntla Kavitha | సీఎం సొంత జిల్లాలోనే నీటి కష్టాలు.. గుంటనక్కకు, రేవంత్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?: కవిత ఫైర్
Advertisement
  • మహబూబ్‌నగర్‌లో రెండు మూడు రోజులకోసారి నీళ్లు
  • మున్సిపాలిటీల్లో గుట్టలుగా చెత్త
  • సిద్ధిపేటకే నిధులు ఎందుకు?
  • మిగితా మున్సిపాలిటీల మాటేంటి?
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్

Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోనే నీటి కష్టాలు ఉన్నాయి. రెండు, మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. 30 ఏళ్ల కింద ఉన్న సిటీ బస్సులు ఇప్పుడు లేవు.. అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం సిద్ధిపేట మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరు చేయడంపై కవిత అనుమానం వ్యక్తం చేశారు.

సిద్ధిపేటకే ఎందుకు?

"కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా పనులు మాత్రం వారికే (సిద్ధిపేట) అవుతాయి. ఇది చాలా వెరైటీగా ఉంది. ముఖ్యమంత్రికి, అక్కడి ఎమ్మెల్యేకు (గుంటనక్క అని సంబోధిస్తూ) ఉన్న సంబంధం ఏంటో, దీని వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు తెలియాలి," అంటూ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలు లేని సిద్ధిపేటకు నిధులు ఇచ్చి, ఎన్నికలు జరగాల్సిన మిగతా మున్సిపాలిటీలను విస్మరించడం దారుణమని మండిపడ్డారు.

మున్సిపాలిటీల దుస్థితి

సీఎం సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో ప్రభుత్వ పాఠశాలలు కేవలం ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే సెంటర్లుగా మారాయి. బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు లేరు. ప్రతి మున్సిపాలిటీలో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. సీఎం సొంత నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్లులో నడిరోడ్డుపై చెత్త ఉన్నా పట్టించుకునే నాధుడే లేడు.. అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ డిమాండ్లు - కాంగ్రెస్ హామీలు

ఫిబ్రవరి 26 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలపై జాగృతి పలు డిమాండ్లు చేసింది. ఈ బడ్జెట్ కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకునేదిగా ఉండాలని స్పష్టం చేసింది.

రైతులకు, కౌలు రైతులకు కలిపి రూ.25,000 కోట్లు, రైతు కూలీలకు రూ.10,000 కోట్లు కేటాయించాలి. రుణమాఫీ 100 శాతం పూర్తి చేయాలి. ఇప్పటికీ 50 శాతం మందికి రుణమాఫీ కాలేదని, దీనిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా రూ. 25,000 కోట్లు కేటాయించాలి. బకాయి ఉన్న రూ.11,000 కోట్లను వన్-టైమ్ సెటిల్మెంట్ కింద విడుదల చేయాలి. వృద్ధులు, వితంతువుల పెన్షన్ల కోసం రూ.35,000 కోట్లు కేటాయించాలి. అమరవీరుల కుటుంబాలకు రూ.25,000 పెన్షన్ హామీని నెరవేర్చాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలి. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లను కాకుండా ఆర్టీసీ సిబ్బందినే నియమించాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రూ.20,000 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలి.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా, స్థానిక సమస్యలపై పోరాడే మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పట్టణ ప్రజలకు, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు జాగృతి విజ్ఞప్తి చేసింది.

https://x.com/TJagruthi/status/2021117888086884537

Advertisement
Advertisement