త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shambipur Raju | ఇదేనా అమ‌రుల‌కిచ్చే గౌర‌వం?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Shambipur Raju | తెలంగాణను సాధించిన అమరవీరుల త్యాగాలను మరచిపోయే ప్రభుత్వాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరవీరుల స్థూపాల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jun 2, 2026, 5.40 pm IST

Shambipur Raju | ఇదేనా అమ‌రుల‌కిచ్చే గౌర‌వం?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Advertisement
  • దుండిగ‌ల్ అమ‌రుల స్థూపాన్ని ప‌ట్టించుకోలేదు
  • స్వ‌యంగా నీళ్ల‌తో శుభ్రం చేశాం
  • కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డం సిగ్గుచేటు
  • అమ‌రులను మరిస్తే చ‌రిత్ర క్ష‌మించ‌దు
  • ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆగ్ర‌హం

Shambipur Raju | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణను సాధించిన అమరవీరుల త్యాగాలను మరచిపోయే ప్రభుత్వాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరవీరుల స్థూపాల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వయంగా దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని ఉద్యమకారులతో కలిసి నీళ్లతో శుభ్రం చేసి పుష్పాంజలి ఘటించారు.

ఇంకెప్పుడు ప‌ట్టించుకుంటారు?

అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా పట్టించుకోకపోతే మరెప్పుడు పట్టించుకుంటారు? ఇది అమరవీరులను, ఉద్యమకారులను అవమానపరచడమే. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరం. అత్యంత పవిత్రమైన రోజున కూడా అమరవీరుల స్థూపాన్ని అధికారులు పట్టించుకోలేదు. అందుకే ఉద్యమకారులతో కలిసి స్వయంగా స్థూపాన్ని నీటితో శుభ్రం చేసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించాం అని ఆయ‌న తెలిపారు.

ఇదేనా మీరిచ్చే గౌర‌వం?

రాష్ట్రం సిద్ధించ‌డానికి వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజునే అమరవీరుల స్మారక స్థూపం నిర్లక్ష్యానికి గురికావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గౌరవం? అని శంభీపూర్ రాజు ప్రశ్నించారు.

అమరవీరుల స్థూపాల సంరక్షణను విస్మరించడం అంటే కేవలం ఒక నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మండిపడ్డారు.

Advertisement
Advertisement