త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ రెడ్డికి రోషం లేదు.. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు : కేటీఆర్

ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ఆరు నెలల్లోనే పీఆర్సీ అన్నారు. రెండున్నరేళ్లు అయింది. పీఆర్సీ లేదు, డీఏ లేదు.. ఐఆర్ లేదు.. ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని కేటీఆర్ విమర్శించారు.

J

Telangana | Published On Jun 2, 2026, 6.22 pm IST

KTR | రేవంత్ రెడ్డికి రోషం లేదు.. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు : కేటీఆర్
Advertisement
  • రైతు బంధు బంద్ అయింది
  • రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది
  • కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ తిరిగి రావాలే
  • తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకుపోతున్నరు
  • 2028 డిసెంబర్‌లో కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్

"సిఫాయిల తిరుగుబాటు విఫలం అయిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది".. అంటూ ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు కేసీఆర్ స్వయంగా కలం పట్టుకొని రాసిన పాటను ఈసందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

KTR | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని.. పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక మిగిలింది 18 నెలలే అని.. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని చూసి కూర్చున్న కుక్క కూడా లేచి సెల్యూట్ కొట్టదన్నారు. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఒకటే మాట వినపడుతుంది. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని, చేతగాని, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి.. ఇవన్నీ నేను కాదు అనేది.. రైతుల దగ్గరికి పోతే మీరు మైకు పెడితే రైతులు మాట్లాడే భాష వింటే రోషం ఉన్నోడు అయితే హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోవాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన కేటీఆర్ ఉద్యమ కాలం నాటి పలు ఘట్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ముష్కరుల పాలయిన పుష్కర తెలంగాణ

దేశపతి శ్రీనివాస్.. పుష్కర తెలంగాణ అన్నారు కానీ ఆ పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలయిందని కేటీఆర్ అన్నారు. పుష్కలంగా ఉన్న తెలంగాణ నిష్పల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని దేశపతి చెబుతుంటే బాధేస్తోందని కేటీఆర్ వాపోయారు.

కేసీఆర్ మీద సినిమా తీస్తా అని డైరెక్టర్ ఫోన్ చేస్తే..

2018లో నాకు ఒక సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి కేసీఆర్ మీద ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాం, ఆయన పోరాటం, జీవితం మీద సినిమా తీయాలి అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అని, కేసీఆర్ గారిని అడిగి చెప్తా అన్నా. అదే విషయం కేసీఆర్‌కి చెప్తే.. ఇంకో సంవత్సరం పూర్తయితే కాళేశ్వరం పూర్తయితది. ఆ తర్వాత చేద్దాం అని చెప్పు అని చెప్తే.. అదే విషయం డైరెక్టర్‌కి చెప్తే.. కాళేశ్వరం కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. వాటితో నాకు పని లేదు. నాకు స్ఫూర్తి ఏంటంటే.. అన్ని ప్రతికూలతలను ఛేదిస్తూ మిషన్ ఇంపాజిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించారు. నా దృష్టిలో జూన్ 2, 2024 అతి పెద్ద విజయం కేసీఆర్‌ది అన్నారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు సీఎం అనే పదవి చిన్నది. కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే నేడు తెలంగాణ ఎక్కడిది సార్ అంటూ ఆ డైరెక్టర్ చెప్పారు.. అంటూ కేటీఆర్ ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు.

14 ఏళ్ల అలుపెరగని పోరాటానిక ఫలించిన రోజు ఇది

తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఎవ్వరు పడితే వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నరు కానీ.. ఆరోజు పడ్డ కష్టం, ఆరోజు చేసిన త్యాగం, అమరవీరుల బలిదానాలు లేకపోతే నేడు తెలంగాణ ఉండేది కాదు.. ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు. అందుకే కుట్రలను ఛేదించి, కుతంత్రాలను అధిగమించి, దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి, ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైన రోజు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. 14 ఏళ్ల అలుపెరగని పోరాటం ఫలించిన రోజు ఇది.. అని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చడో.. ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత..నేను ఎంచుకున్న మార్గాన్ని తప్పుకోను.. ఎత్తిన జెండా దించను. దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అని ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నరా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సింహ గర్జన చేసిన రోజు.. మే 17, 2001 ఆ రోజు కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాట..ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం. కానీ నేను గనుక తప్పుకుంటే ఈ ఉద్యమం నుంచి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకు ఇస్తున్నా.. అన్న ధీరోధాత్తుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.

సింహం తన కథ తానే చెప్పాలి

పదవీ త్యాగాలు కాదు.. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు కేసీఆర్. వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావద్దు అంటే.. సింహం తన కథ తానే చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి.. కేసీఆర్ చెప్పడం కాదు.. గులాబీ సైనికులు.. చెల్లె.. తమ్ముడు.. అన్న.. ఇలా అందరూ చెప్పాలి. మిలియన్ మార్చ్, సాగర హారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంటా వార్పు, ఒక దీక్షా దివస్.. అన్నింటి ఫలితంగా విజయ్ దివాస్.. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా పోరాటాలు జరిగాయన్నారు.

2028 డిసెంబర్‌లో కేసీఆర్ మళ్లీ సీఎం

14 ఏళ్లు పోరాడి చివరకు రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణను ఉద్యమ నాయకుడికే కట్టబెట్టారు. ఇదే రోజు కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2028 డిసెంబర్ లో తిరిగి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలంగాణ ప్రజలే చెబుతున్నారన్నారు. 2014 లో ఒంటరిగానే గెలిచాం, 2018లో ఒంటరిగానే గెలిచాం.. 2023 లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేసినా 1.8 శాతం తేడాతో మాత్రమే గెలిచింది. మూడో సారి కూడా కేసీఆర్ గెలిచే పరిస్థితి ఉండే కానీ విష ప్రచారాల వల్ల వారు ఆనాడు ఓటమి పాలయ్యారన్నారు.

తెలంగాణను మళ్లీ 25 ఏళ్లు వెనక్కి నెట్టింది

అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్.. ఇవాళ తెలంగాణను మళ్లీ 25 ఏళ్లు వెనక్కి నెట్టే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. గ్యారెంటీల గారడీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారి చేస్తున్నాడు. వడ్డించిన విస్తరిలా పెట్టిన పొయ్యి, కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతుల్లో పెడితే కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నాడు. 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. రైతులు మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఎదిగిన తెలంగాణలో ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. పారిశ్రామికవేత్తలు తమిళనాడు, గుజరాత్, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. మిగిలింది 18 నెలలే. చివరి సంవత్సరం రేవంత్ రెడ్డిని చూసి కూర్చున్న కుక్క కూడా లేచి సెల్యూట్ కొట్టదు. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఒకటే మాట వినపడుతుంది. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని, చేతగాని, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి... ఇవన్నీ నేను కాదు అనేది.. రైతుల దగ్గరికి పోతే మీరు మైకు పెడితే రైతులు మాట్లాడే భాష వింటే రోషం ఉన్నోడు అయితే హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోవాలన్నారు.

మళ్లీ అశోక్ నగర్‌కి వచ్చే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా?

తెలంగాణలోని తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్ లో రోడ్డు మీద కూర్చోబెట్టి ఇద్దరి ఉద్యోగాలు ఊడగొట్టండి.. కేసీఆర్, కేటీఆర్‌ది. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ. ఇవాళ ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ. అశోక్ నగర్ కు వచ్చేందుకు మొహం చెల్లడం లేదా? ఎక్కడ పోయినవు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న సన్నాసి రాహుల్ గాంధీ. రెండున్నరేళ్లు అయింది ఇఫ్పటి వరకు నాలుగు వేల ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇవ్వలేదు కదా. సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్ముందా? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తవా రేవంత్ రెడ్డి? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ఉద్యోగులకు వెన్నుపోటు

ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ఆరు నెలల్లోనే పీఆర్సీ అన్నారు. రెండున్నరేళ్లు అయింది. పీఆర్సీ లేదు, డీఏ లేదు.. ఐఆర్ లేదు.. ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందన్నారు. వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే.. ఇవాళ గురుకులాల్లో అమాయక విద్యార్థుల మరణ మృదంగం మోగుతోంది. నేను బడిపిల్లలకే కాదు.. ఇంటర్మీడియెట్ పిల్లలకు కూడా భోజనం పెడుతా అంటున్నాడు. ముందు బతికున్న పిల్లలను కాపాడు. కొత్తగా చేయాల్సిందేం లేదు. ఉన్నది కాపాడితే చాలన్నారు. ఒక్క ఇటుక కూడా పేర్చకుండా, ఒక కాలువ తవ్వకుండా, చెరువు తవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా నాలుగు లక్షల కోట్ల అప్పును నెత్తి మీద రుద్దిండు. రైతు బంధు బంద్ అయింది కానీ.. రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది. టింగ్ టింగ్ మని రాహుల్ గాంధీ ఖాతా మార్మోగుతోందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ తిరిగి రావాలే

తెలంగాణ ముక్తకంఠంతో కోరుతోంది ఒక్కటే.. కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ తిరిగి రావాలే.. అందుకే అధికారం కోసం కాదు మన పోరాటం, అధికారం కోసం ఆరాటం ఏం లేదు కానీ.. కష్టపడి సాధించిన తెలంగాణ, పదవీ త్యాగాలతో పాటు.. ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణ ఇవాళ భ్రష్టులు పాలిస్తుంటే, ముష్కరుల పాలవుతుంటే.. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకుపోతుంటే.. చూస్తూ ఏ తెలంగాణ తమ్ముడు, చెల్లి ఊరుకోరు. అందుకే అందరం ముక్తకంఠంతో పునరంకితం అవుదాం. అందరం ప్రతిజ్ఞ చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.

"సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన, ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి, సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్థిల్లింది. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలయినారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ముప్పు పొంచి ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా, తెలంగాణ అమర వీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం.. మన తెలంగాణను రక్షించుకుందాం.. అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనసా వాచా కర్మనా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్."

Advertisement
Advertisement