త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Pensions | కొత్త పెన్షన్లు.. లేనట్టేనా? 

New Pensions | కొత్త చేయూత పెన్షన్లు ఇక లేనట్టేనా? ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నదా? అంటే.. రెండున్నరేండ్లుగా పించన్లపై కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సాగదీస్తున్న వైఖరి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

S

Telangana | Published On Jun 29, 2026, 7.30 pm IST

New Pensions | కొత్త పెన్షన్లు.. లేనట్టేనా? 
Advertisement
  • ఏరివేతలతోనే.. సాగదీత
  • రెండున్నరేండ్ల నుంచి తొలగింపులతోనే కాలయాపన
  • ఇప్పటికే 1,87,550 పెన్షన్లు కట్ 
  • జూన్ 2నే కొత్త పెన్షన్లు ఇస్తామని ప్ర‌క‌టించిన‌ మంత్రి వివేక్ 
  • నెల దాటినా ఊసే లేని వైనం
New Pensions | త్రినేత్ర.న్యూస్: కొత్త చేయూత పెన్షన్లు ఇక లేనట్టేనా? ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నదా? అంటే.. రెండున్నరేండ్లుగా పించన్లపై కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సాగదీస్తున్న వైఖరి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. గత 30 నెలలుగా ఏరివేతల పేరుతోనే కాలయాపన చేసి.. సర్కారు 1,87,550 పెన్షన్లను కట్ చేసింది. ఇక కొత్త లబ్ధిదారులకు జూన్ 2 నుంచే పెన్షన్లు ఇస్తామని ఊదరగొట్టినా.. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

రూ.4000 ఇస్తామని హామీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 'చేయూత' (గతంలో ఆసరా)పెన్షన్లపై ఎన్నికల సమయంలో  హామీల వర్షం కురిపించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ వర్కర్లు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఇస్తున్న పెన్షన్‌ను నెలకు రూ.2,016 నుంచి 4,000 కు రెట్టింపు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. దివ్యాంగులకు అందజేసే పెన్షన్‌ను నెలకు 4,016 నుంచి 6,000 లకు పెంచుతామని ప్రకటించింది. కానీ...హామీని నెరవేరుస్తామంటూ...  ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు క్షేత్రస్థాయిలో పదే పదే చెబుతున్నప్పటికీ.. రెండున్నరేండ్లుగా ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదని స్ఫష్టం అవుతున్నది.

ఏరివేతలు..తొలగింపులు 

2024-2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 43,15,981 లబ్ధిదారులు పెన్షన్లు అందుకునేవారు. ప్రభుత్వం ఏరివేత కార్యక్రమంల చేపట్టిన తర్వాత ఆ సంఖ్య ఈ ఏడాది మే 1 నాటికి 41,48, 431కి తగ్గింది. అంటే దాదాపుగా 1,67,550 పెన్షన్లను కట్ చేశారు. అయితే మరోమారు తొలగింపు ప్రక్రియలో భాగంగా మే, జూన్ నెలల్లో 20వేలకు పైగా లబ్ధిదారులను తొలగించారు. జూన్ నెలలో కేవలం 41,20,000 మందికి మాత్రమే పెన్షన్ అందజేశారు. దీంతో మొత్తంగా 1,87, 550 పెన్షన్లను కట్ చేసినట్టైంది.

గ్రామాల్లో భారీగా  తొలగింపు 

పోస్టాఫీసు ఖాతాల ద్వారా పెన్షన్ పొందుతున్న 19 లక్షల మందిలో ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 16 లక్షల మంది సర్వే పూర్తి చేసింది. వారిలో 93,624 మంది అనర్హులుగా తేలారు. 40,751 మంది మరణించగా.. 41,689 మంది ఆచూకీ తెలియరాలేదు. 11 వేల మంది ఆధార్ చెల్లడం లేదు. 3475 మంది వలస వెళ్లారు. మే, జూన్ నెలలో జరిగిన ఏరివేతలో ...అధికారులు గ్రామాల్లోనే 1,70,000 మంది పెన్షన్లు తొలగిస్తూ జాబితా సిద్ధం చేశారు. కానీ వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని వారు తిరిగి దరఖాస్తు పెట్టుకోవడంతో కొంతమందిని తిరిగి లబ్ధిదారులుగా చేర్చారు. చనిపోయిన వారు, అందుబాటులో లేని వారు, వలస వెళ్లినా అడ్రస్ లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ట్యాక్స్ పేయర్స్ ను ఈ పెన్షన్ జాబితా నుంచి తొలగించారు.

ఇవ్వాల్సి వస్తే..

దివ్యాంగులకు, వితంతువులకు 30 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం.. పెన్షన్లు ఇస్తామని పదే పదే చెబుతూ వస్తున్నది. కానీ ఆ దిశగా అడుగు పడిన సందర్భం లేదు. ప్రస్తుతం పెన్షన్లు అందుకుంటున్న 41,48,431 మందికి గాను కేవలం 19 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే స్క్రూటినీ చేశారు. ఇంకా డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్న లబ్ధిదారుల అర్హతను కూడా తేల్చాల్సి ఉంది. మళ్లీ మున్సిపల్ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తే తప్ప.. ప్రభుత్వం.. చేయూత పెన్షన్లపై ఏ హామీ ఇచ్చే పరిస్థితిలో లేదు. గ్రామాల్లో పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారే కానీ.. సచివాలయం లో ఈ పెన్షన్లపై ఇప్పటివరకైతే ఎలాంటి కార్యాచరణనూ సిద్ధం చేయలేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే..ఇప్పటికే తొలగించిన 1,80,000 పెన్షన్ల స్థానంలో .. దివ్యాంగులకు, వితంతువులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement