త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకున్న వ్య‌క్తికి బీఆర్ఎస్ టికెట్‌: కవిత‌

Kavitha | బీసీ రిజ‌ర్వేష‌న్లను (BC Reservations) అడ్డుకునేందుకు పిటిష‌న్ వేసిన బుట్టంగారి మాధ‌వ‌రెడ్డికి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత (Kavitha) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ కేసును బీఆర్ఎస్ వేయించిందా?, బీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమా? అని ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On Feb 6, 2026, 1.34 pm IST

Kavitha | బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకున్న వ్య‌క్తికి బీఆర్ఎస్ టికెట్‌: కవిత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీ రిజ‌ర్వేష‌న్లను (BC Reservations) అడ్డుకునేందుకు పిటిష‌న్ వేసిన బుట్టంగారి మాధ‌వ‌రెడ్డికి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత (Kavitha) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ కేసును బీఆర్ఎస్ వేయించిందా?, బీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమా? అని ప్ర‌శ్నించారు. మాధవ‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ (Congress) పరిస్థితి నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో అందరికీ ఒక పేజీ ఉంటే కేసీఆర్‌కి పుస్తకమే ఉంటుంద‌ని చెప్పారు. చరిత్రను ఎవరు చెరిపివేయలేర‌న్నారు. విమర్శలు చేసేప్పుడు ఒక లైన్ ఉంటుంద‌ని, సీఎం రేవంత్ అన్ని లైన్లు దాటి విమర్శలు చేశార‌ని మండిప‌డ్డారు. ఒక జాతిని విమర్శించటం అనేది ఎవరు కూడా హర్షించర‌ని చెప్పారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

`బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయి. రెండున్న‌రేండ్ల‌పాటు పోరాటం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశాం. కానీ బుట్టంగారి మాధవ్ రెడ్డి సహా మరొక వ్యక్తి దీనిపై పిటిషన్ వేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అంటే ఈ కేసును బీఆర్ఎస్ వేయించిందా?. బీసీల రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమా?. మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీశ్‌ రావుకి దగ్గర. ఆయ‌న‌ పర్సనల్ లాయర్ ఈ కేసు వేయించారు. అప్పుడు దీని వెనుక ఉన్నది హరీశ్ మాత్రమే అని అనుకున్నా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వడంతో దీని వెనుక బీఆర్ఎస్ మొత్తం ఉన్నట్లు అర్థమవుతున్న‌ది.

తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు?. బీఆర్ఎస్ అసలు బీసీల విషయంలో చిత్తశుద్దితో లేదు. పార్టీ పరంగా కూడా వాళ్లు మీటింగ్‌లో పెట్టలేదు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ పేరుతో మాత్రమే స‌మావేశాలు నిర్వ‌హించారు. జనగణన విషయంలో కూడా ముందు కన్‌ఫ్యూజ్ చేశారు. తర్వాత మళ్లీ జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అంతా రోడ్లపైకి వస్తే కానీ వాళ్ల స‌మావేశాలు కార్యరూపం దాల్చలేదు. అందుకే బీసీలంతా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని గమనించాల‌ని కోరుతున్నా.

బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియే. 2010 వరకు ఆయ‌న‌ మాతోనే ఉండేది. ఆ తర్వాత కమ్యూనిటీ తరఫున పోరాటాలు చేసుకుంటామని వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్‌తో కలిశారు. హరీశ్‌ రావు ఆయనను తప్పుదోవ పట్టించి కేసు వేయించారు. బీఆర్ఎస్ పార్టీ మాధవ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలి. బీసీల నోటికాడ ముద్దు లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి బీఆర్ఎస్ రాజముద్ర వేసినట్లుగా పార్టీ టికెట్ ఇచ్చింది.

ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లు ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీని నిజామాబాద్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా పంపారు. పార్టీ పరంగా లెటర్ ఇచ్చి మరి ఆయనను కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా వేసింది. నిజానికి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయనకు ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ చైర్మన్ పదవి కూడా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ని స్పీకర్ ప్రకటించిన ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావుల‌ను కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అంటే ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా హేళన చేస్తున్న‌ది. ప్రజలు ఎవరినీ నమ్మాలో, ఎవరిని నమ్మోద్దొ తెలియని పరిస్థితి నెలకొంది.

అందుకే మాలాంటి సంస్థలు ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే గాంధీని ఇన్‌చార్జ్‌గా తీసివేయాలి. ఇప్పుడైనా ఎమ్మెల్యే గాంధీపై స్పీకర్ అనర్హత వేటు వేయాలి.

బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పింది. కానీ గత రెండు బడ్జెట్ల‌లో కలిపి రూ.7వేల కోట్లు కూడా కేటాయించలేదు. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పుడు బీసీ సబ్‌ప్లాన్‌పై కసరత్తు చేయాలి. బీసీ సబ్‌ప్లాన్ సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సవరించుకోవడానికి ఈ బడ్జెట్ మంచి అవకాశం. ఆ తర్వాత ఒక్క బడ్జెట్ మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చే బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేసిందన్న కారణంతో వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కానీ కాంగ్రెస్ కూడా వారికి న్యాయం చేయడం లేదు.

ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి కోసం మేము కరీంనగర్‌లో భూపోరాటం చేశాం. ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెడుతున్నాం. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు హాజరుకావాలని కోరుతున్నా.

ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయన్నది ప్రజలు గమనించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను ఎలా మోసం చేశాయో చూశాం. బీజేపీ గురించి మాట్లాడుకోవటం కూడా వృథా. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో మేము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాం. మాలానే ప్రశ్నించే సీపీఎం, న్యూ డెమాక్రసీ సహా ప్రశ్నించే స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా.

ఉద్యమంలో మనందరికీ ఒక పేజీ ఉంటే, కేసీఆర్‌కి పుస్తకమే ఉంటుంది. చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. కేసీఆర్‌కి, రేవంత్ రెడ్డికి కూడా చరిత్ర ఉంది. కానీ రేవంత్ రెడ్డి అది మంచి చరిత్రనా, కాదా అని అర్థం చేసుకోవాలి. నేను కేసీఆర్‌కి మద్దతుగా మాట్లాడటం లేదు. రాజకీయంగా ఆయన విధానాలను విభేదిస్తా. అయితే తెలంగాణలో మర్యాదపూర్వకమైన రాజకీయాలు ఉండాలని నేను కోరుకుంటున్నా. విమర్శలు చేసేప్పుడు ఒక లైన్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అన్ని లైన్లు దాటి విమర్శలు చేశారు. ఒక జాతిని విమర్శించటం అనేది ఎవరు కూడా హర్షించరు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. డీఎస్పీగా ఉన్న ఆయనకు డిమోషన్ ఇచ్చారంటే ఏమైనా ఆధారాలు దొరికాయోమో?. ఐతే గతంలో కూడా చాలా మందికి తప్పుదారిలో ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలు ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారు. ఎప్పుడు తుది దశకు తెస్తారో చెప్పాలి.` అని క‌విత అన్నారు.

https://x.com/RaoKavitha/status/2019646418626257329

Advertisement
Advertisement