త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చండి.. ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వేయండి : ఎంపీ వ‌ద్దిరాజు

MP Vaddiraju | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఖాళీగా ఉన్న ప్ర‌తి పోస్టును భ‌ర్తీ చేయాల‌న్నారు.

S

Telangana | Published On Aug 27, 2026, 8.02 pm IST

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్ల‌ను నెర‌వేర్చండి.. ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వేయండి : ఎంపీ వ‌ద్దిరాజు
Advertisement

ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలి
రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ మొత్తాలను అందజేయాలి

MP Vaddiraju | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఖాళీగా ఉన్న ప్ర‌తి పోస్టును భ‌ర్తీ చేయాల‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన 6 డీఏలను పెండింగ్‌లో పెట్టడం, పీఆర్సీ ప్రకటించకపోవడం తీవ్ర విచారకరమన్నారు. దేశంలోని ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవిధంగా 6 డీఏలను పెండింగ్‌లో పెట్టడం ఇప్పటి వరకు జరగలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం (ఈహెచ్ఎస్) వాళ్ల నెల జీతం నుంచి ఒక్క శాతం కాంట్రిబ్యూషన్ పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.

అయితే, దానిని 1.5 శాతానికి పెంచి కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ఉద్యోగులు, పింఛన్ దారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణం ఉండేదని, వారికి తెలంగాణ పేరిట ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వడమే కాక ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 73 శాతం ఫిట్‌మెంట్ అందజేసి గౌరవించారని ఎంపీ వద్దిరాజు వివరించారు. సముచిత రీతిలో పీఆర్సీ ఇస్తామని, క్రమం తప్పకుండా డీఏలు చెల్లిస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని, ఈహెచ్ఎస్‌ను సక్రమంగా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకుండా జీవో నంబర్ 97ను ఉపసంహరించాలన్న బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తదితరులను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, జాబ్ కేలండర్ అమలుపర్చాలని, జీవో 97ను వెనక్కి తీసుకోవాలని, ఫీజుల బకాయిలను చెల్లించాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement