త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | బూతుల ముఖ్యమంత్రికి.. పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పాలి: హరీశ్‌ రావు

Harish Rao | హామీల గురించి అడిగితే మురికి మాటలు, చెత్త మాటలు మాట్లాడుతున్న‌ బూతుల ముఖ్య‌మంత్రికి ఈ నెల 11న పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి.. చెత్త సేకరణ కూడా చేతకాని దద్దమ్మ రేవంత్ అని ధ్వ‌జ‌మెత్తారు.

G

Telangana | Published On Feb 8, 2026, 1.24 pm IST

Harish Rao | బూతుల ముఖ్యమంత్రికి.. పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పాలి: హరీశ్‌ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: హామీల గురించి అడిగితే మురికి మాటలు, చెత్త మాటలు మాట్లాడుతున్న‌ బూతుల ముఖ్య‌మంత్రికి ఈ నెల 11న పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి.. చెత్త సేకరణ కూడా చేతకాని దద్దమ్మ రేవంత్ అని ధ్వ‌జ‌మెత్తారు. అన్నం పెట్టిన కేసీఆర్ (KCR) కావాలా.. హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) కావాలో ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్నారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఒక్క మంచి పనీ లేద‌ని, ఉచిత బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ధ్వ‌జ‌మెత్తారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భారీ రోడ్ షో నిర్వ‌హించారు. అనంత‌రం మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. `సదాశివపేట వాసులు ఒకటే ఆలోచించాలి. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ కు ఓటేద్దామా?. లేక హామీల పేరుతో మోసం చేసి ప్రజలకు సున్నం పెట్టిన కాంగ్రెస్ కు ఓటేద్దామా?. ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పండి. బస్సు తప్ప మిగతాదంతా తుస్సు.

భార్యకు ఫ్రీ టికెట్ అని, భర్తకు డబల్ రేట్లు బాదుతున్నారు. కేసీఆర్ రూ.2000 పెన్షన్ ఇస్తే.. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రెండున్నరేండ్ల‌లో ఒక్కో అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.52,000 బాకీ పడింది. ఆ డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది.

ఆడపిల్ల పెండ్లికి కేసీఆర్ రూ.లక్ష ఇస్తే.. తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్కరికైనా ఇచ్చాడా?. ఒకప్పుడు సదాశివపేటకు వారానికి ఒకసారి మంచినీళ్లు వచ్చేవి. ఇక్కడికి పిల్లనియ్యాలంటే భయపడేవాళ్లు. చింతా ప్రభాకర్ చొరవతో రూ.37 కోట్లతో మిషన్ భగీరథ తెచ్చి రోజుకోసారి నీళ్లు వచ్చేలా చేశాం. 50 పడకల ఆసుపత్రి కట్టించాం. బస్టాండ్‌ను బాగుచేశాం. ఊర చెరువు, కందకండ్ల రోడ్డు, గల్లీల్లో మోరీల కోసం రూ. 25 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశాం. మొత్తంగా రూ. 284 కోట్లతో సదాశివపేటను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్.

అస‌మ‌ర్థుడు రేవంత్‌..

హామీల గురించి అడిగితే.. లాగుల తొండలు వదులుతా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి చెత్త సేకరణ కూడా చేతకాని అసమర్థుడు. కేవలం మురికి మాటలు, చెత్త మాటలే మాట్లాడుతున్నాడు. ఈ బూతుల ముఖ్యమంత్రికి 11వ తేదీన‌ పోలింగ్ బూత్‌లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలి.

బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీ విద్యార్థుల కోసం కేసీఆర్‌ రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టించారు. సంగారెడ్డిలో రూ.20 కోట్లతో మైనార్టీ స్కూల్ ఏర్పాటు చేశారు. షాదీ ముబారక్, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా బంద్ చేశాడు. ముస్లింలకు రూ.4 వేల‌ కోట్లు ఇస్తానని మోసం చేశాడు. సదాశివపేటలో హిందువులకు 5 ఎకరాలు, ముస్లింలకు 5 ఎకరాలు, క్రిస్టియన్లకు 5 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.50 కోట్లు ఉంటుంది. అన్ని వర్గాలను ఆదరించింది మేమే.

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

మాకు ఓటేస్తేనే అభివృద్ధి చేస్తామ‌ని కాంగ్రెస్ వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి.. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి జనాభా ప్రాతిపదికన నేరుగా వస్తాయి. అవి రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేవి కావు. అవి మీ హక్కు. ఇప్పుడు వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎలాగూ వస్తాయి. కానీ, రెండేండ్ల‌ తర్వాత మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అప్పుడు సదాశివపేటకు స్పెషల్ ప్యాకేజీ తెచ్చి, మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది.

ప్రజలను గోస పెడుతున్న రేవంత్‌..

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయన ఇల్లు ఎక్కడంటే ఆటోవాడిని అడిగినా తీసుకెళ్తాడు. మరి జగ్గారెడ్డి ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? ఆయన అడ్రస్ ఎవరికైనా తెలుసా?. కష్టాల్లో తోడుండే చింతా ప్రభాకర్‌ని, కారు గుర్తు అభ్యర్థులను గెలిపించండి. గొర్రెల పంపిణీ పథకాన్ని సదాశివపేట నుంచే కేసీఆర్ ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రాగానే అది బంద్‌చేశాడు. చేప పిల్లలు బంద్, బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్.. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నాడు. సదాశివపేట అభివృద్ధి ఆగకూడదన్నా, మన పేదలకు సంక్షేమం అందాలన్నా కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి` అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement