త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Licensed Surveyors Telangana | కాంగ్రెస్ మాయమాటలు.. రోడ్డున పడ్డ 6500 మంది యువత: రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్న 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎకరా సర్వేకు రూ.10 ఇవ్వడం శ్రమదోపిడీయేనని మండిపడ్డారు.

J

Telangana | Published On Mar 1, 2026, 10.27 pm IST

Licensed Surveyors Telangana | కాంగ్రెస్ మాయమాటలు.. రోడ్డున పడ్డ 6500 మంది యువత: రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

సంక్షిప్త సారాంశం

ప్రభుత్వ ఉద్యోగాల ఆశతో ప్రైవేట్, ఐటీ కొలువులు వదులుకుని వచ్చిన 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘భూ భారతి’ పథకం కింద ఎంపిక చేసి, ఇప్పుడు ఎకరాకు కేవలం పది రూపాయల కమిషన్ ఇస్తామనడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనన్నారు. సర్వేయర్లకు తక్షణమే గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని.. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Licensed Surveyors Telangana | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి తమ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. వారి ఆవేదనను విన్న హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎకరానికి పది రూపాయల కమిషనా?

బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత, ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, గౌరవ వేతనం వస్తుందన్న ఆశతో తాము అప్పటికే చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. "భూ భారతి పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6500 మంది విద్యావంతులను లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేశారు. స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రులు మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. శిక్షణలు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు. కానీ, పనుల్లోకి చేరాక మాట తప్పి మోసం చేశారు," అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao Slams Revanth Govt Over Injustice to 6500 Licensed Surveyors in Telangana

సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం పది రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని హరీశ్ రావు మండిపడ్డారు. "ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవలం 20 వేల రూపాయలేనా? ఇదేనా రేవంత్ రెడ్డి యువతకు ఇచ్చే ఉపాధి?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడటం దుర్మార్గమన్నారు.

అసెంబ్లీలో నిలదీస్తాం

గత ఏడాది కాలంగా ఎలాంటి జీతం లేక, సరైన పని కల్పించక 6500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకోకుండా.. ఇచ్చిన మాట ప్రకారం వారికి తక్షణమే గౌరవ వేతనం ఇవ్వాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Harish Rao Slams Revanth Govt Over Injustice to 6500 Licensed Surveyors in Telangana

లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన వారికి భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement