త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మూసీ సుందరీకరణా.. మూసీ ప్రక్షాళనా.. మూసీ పునరుజ్జీవమా..

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి మూసీ సుందరీకరణ, మరోసారి మూసీ ప్రక్షాళన, ఇంకోసారి మూసీ పునరుజ్జీవం అంటూ రోజుకో మాట మారుస్తున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి ఎవ‌రు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Mar 13, 2026, 2.47 pm IST

Harish Rao | మూసీ సుందరీకరణా.. మూసీ ప్రక్షాళనా.. మూసీ పునరుజ్జీవమా..
Advertisement

మూసీ పేరుతో విధ్వంస‌కాండ‌
రియ‌ల్ ఎస్టేట్ దందా కోస‌మే పేద‌ల ఇళ్ల కూల్చివేత‌
ల‌క్ష మంది జీవితాల‌ను కూలుస్తానంటున్నాడు
నిజాలు మాట్లాడొద్ద‌నే శాపం రేవంత్‌కు ఉంది
విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రికి హ‌రీశ్‌రావు ప‌లు సూటి ప్ర‌శ్న‌లు
పేద‌ల ఇళ్ల కూల్చివేత‌పై బీజేపీ వైఖ‌రేంట‌ని ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి మూసీ సుందరీకరణ, మరోసారి మూసీ ప్రక్షాళన, ఇంకోసారి మూసీ పునరుజ్జీవం అంటూ రోజుకో మాట మారుస్తున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి ఎవ‌రు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. మూసీ పేరుతో విధ్వంస‌కాండ‌కు తెర‌తీశాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. మూసీ అభివృద్ది పేరు చెప్పి హైదరాబాద్‌లో అసలు ఎందుకు ఈ విధ్వంసకాండను కొనసాగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? లేదా ఆస్తటిక్ బ్యూటిఫికేషనా? చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

మూసీ పున‌రుజ్జీవ‌నానికి శ్రీ‌కారం చుట్టిందే బీఆర్ఎస్‌

మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ మూసీ పేరిట రేవంతు చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే మేం వ్యతిరేకం. సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా చేస్తుండటానికి వ్యతిరేకం. మొదట మూసీ బ్యూటీఫికేషన్ కు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా 4 వేల కోట్లతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినం. గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో పోసీ శుద్ది చేయాలని ప్రణాళికలు వేశాం. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే తుగ్లన్ పాలన గుర్తుకు వస్తున్నది. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ది పథంలో నడిపిస్తే.. రేవంతు తన తుగ్లక్ పాలనతో అధోగతి పాలు చేస్తున్నడు. మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ది ఉన్న వారెవరు మొదలు మొదలే పేదల ఇండ్ల మీద పడరు రేవంత్ రెడ్డీ. వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తవు రేవంత్ రెడ్డీ. వికారాబాద్‌లో ఎస్టీపీ పని చేయడం లేదు. ముందు అది చూడు అని హ‌రీశ్‌రావు హిత‌వు ప‌లికారు.

ఖ‌జానా ఖాళీ అంటూనే.. కోట్లు దుబారా

ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూనే.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్షా 50వేల కోట్లకు టెండర్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వమంటే పైసలు లేవు అంటడు. గత సీజ‌న్‌లో సన్నవడ్లు కొన్న పైసలు ఇవ్వమంటే ఉలుకు లేదు పలుకు లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటే ఖజానా ఖాళీ అంటడు. రిటైర్డ్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పింఛన్ బెనిఫిట్స్ ఇవ్వమంటే నన్ను కోసుకు తిన్నా రూపాయి లేదు అంటడు. ఒక వైపు పైసలు లేవు అంటడు. మరో వైపు మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడతడు. వందల కోట్లతో క్యాంపు ఆఫీసు కడుతడు. సింగరేణి పైసలు ఖర్చు చేసి ఫుట్ బాల్ ఆడతడు. లక్షా 50 వేల కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ అంటూ లూటీ కి ఎగబడతడు. ఇక్కడ పాలన చేత గాదు గానీ, మా పాలన అద్భుతం అని పక్క రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేసి పేపర్ ఆడ్స్ ఇస్తడు. రేవంతు ప్రాధాన్యంలో రైతులు లేరు, ఉద్యోగులు లేరు, విద్యార్థులు లేరు, మహిళలు లేరు. రేవంత్ రెడ్డి గోబెల్స్ రెడ్డి. అన్ని మాట తప్పుడే. ఒక్కటీ చేయడు. నిజాలు మాట్లాడొద్దు అనే శాపం రేవంత్ రెడ్డి ఉన్నట్లుంది అని ఎద్దేవా చేశారు.

ప్ర‌జ‌ల అభిప్రాయాలు లేకుండా ఎలా?

ఈరోజు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చొని ప్రణాళిక రచిస్తడట రేవంత్ రెడ్డి. అంటే ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఇన్ని రోజులు పేదల ఇండ్లు కూల్చినవా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే బస్తీ ప్రజల గుండెల్లో భయాందోళనలు సృష్టించినవా? నీకు నిజంగా మూసీని బాగు చేయలనే చిత్తశుద్ది ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరుగు. అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకో. ఫైవ్ స్టార్ హోటల్లలో, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఏసీల్లో కూర్చొని కాగితాలు తిరగేస్తే ఏం ప్రయోజనం? మూసీని బాగు చేయాలన్నదే నీ లక్ష్యం అయితే ముందు నువ్వు ఎస్టీపీలు పెట్టాలె. మురుగు నీటిని శుద్ది చేసి, మూసీలో కలిసేలా చూడాలె. అది చేయకుండా మొదలు మొదలు పేదల ఇండ్ల మీద ఎందుకు పడ్డట్లు. నీకు విజన్ లేదు, ప్రణాళిక లేదు.. ఉన్నది ఒక్కటే రియల్ ఎస్టేట్ దందా? నీ రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్ల మీద పడ్డవు అని మండిప‌డ్డారు.

త‌క్ష‌ణ‌మే రాహుల్‌గాంధీ స‌మాధాన‌మివ్వాలి

రేవంతు ప్రభుత్వం ఇచ్చిన గజిట్ ప్రకారం.. 3279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చుతడట. అంటే లక్ష మంది జీవితాలు కూల్చుతా అంటున్నడు. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఇన్ని ఇండ్లు కూల్చడం అవసరమా? రెండున్నరేండ్లలో పది ఇండ్లు కూడా కట్టని రేవంతు రెడ్డికి పది వేల ఇండ్లను కూల్చే హక్కు ఎవరు ఇచ్చారు. మొన్న వెలుగుమట్లలో వందల ఇండ్లు కూల్చిండు. అసలు రేవంత్ రెడ్డికి కూల్చడంపై ఎందుకు ఇంత శ్రద్ద ఉంది? ఒకవైపు గల్ఫ్ దేశాల్లో బాంబులు వేస్తూ ఇండ్లు కూల్చతుంటే, ఇక్కడ ఏ యుద్దం లేదు, బాంబులు లేవు. కానీ రేవంత్ రెడ్డి బుల్‌డోజర్లతో విధ్వంసం చేస్తున్నడు. ఎలాంటి డీపీఆర్ లేకుండా, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, భయబ్రాంతులకు గురి చేయడం ఏమిటి? రేవంతు బుల్డోజర్ రాజ్ రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదా? ఉత్తర ప్రదేశ్ లో జరిగే బుల్డోజర్ రాజ్ కు, తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజ్ కు తేడా ఏముంది? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

నిన్న త‌న‌ను మూసీ జన ఆందోళన్ బాధితులు వచ్చి కలిసారని, వారిని ఈరోజు సీఎం మీటింగ్ ఉందని హౌజ్ అరెస్టు చేసారని దుయ్య‌బ‌ట్టారు. నిర్బందాలు, భయాందోళనల మధ్య ఈరోజు సీఎం మీటింగ్ పెడుతున్నడని ఎద్దేవా చేశారు.

రేవంత్ దోపిడీకి బీజేపీ ఎందుకు అడ్డుప‌డ‌డం లేదు

బిజేపీ వాళ్లకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా.. మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారిని ఆహ్వానిస్తాం అంటున్నారు. మూసీ పేరిట రేవంతు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బిజేపీ సహకరిస్తున్నదా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్థిస్తుందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి బస్తీ నిద్ర అని ప్రచారం చేసారు. అందులో చిత్తశుద్ది లేదా? మూసీ పేరిట జరుగుతున్న చేస్తున్న రేవంత్ దోపిడి ఎందుకు అడ్డుపడటం లేదు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డ‌కి ప‌లు సూటి ప్ర‌శ్న‌లు సంధించారు.

1. అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18నెలలు పడుతుంది అన్నరు. మరి డీపీఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చినవు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతమని గజిట్ ఎట్లా ఇచ్చినవు?
2. అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? మూసీ ప్రక్షాళననా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు?
3. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసి నుండి ఎలా కొలుస్తారు?
4. ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయట పెట్టండి.
5. జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీ లోన్ 4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది, మంజూరు అయ్యింది అని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025 లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23, 2026 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. నిన్న గాక మొన్న మార్చి 11 నాడు ఇచ్చిన లేఖలో.. మేం ఇంకా లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇలా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన శాసనసభనే తప్పు తోవ పట్టించిండు రేవంత్ రెడ్డి? లోన్ మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించినవా స్పష్టం చేయి? లేదంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. అబద్దాలు మాట్లాడే రేవంత్ రెడ్డి శాపగ్రస్తుడు.
6. ఇప్పటికే చాదర్ ఘాట్ లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లల్లకు పంపినవు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పండి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తవని ప్రజలు ఎట్ల నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులు నిన్ను ఎట్ల నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్ గారిది అయితే, మాట తప్పడమే రేవంతు నైజం అని పేరు తెచ్చుకున్నడు.
7. మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నవు. సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నవు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తవా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తవా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
8. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయండి.

Advertisement
Advertisement