త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

Harish Rao | 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ1, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ-2 అని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కమీషన్ల కోసమే సామాన్యుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

P

Telangana | Published On Aug 25, 2026, 2.35 pm IST

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
Advertisement
  • క‌మీష‌న్ల కోస‌మే నిషేధిత జాబితాలోకి
  • అక్ర‌మాల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి
  • రెవెన్యూమంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
  • బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు
  • షాపూర్‌న‌గ‌ర్‌లో బాధితుల‌తో స‌మావేశం

Harish Rao | 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ1, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ-2 అని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కమీషన్ల కోసమే సామాన్యుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 22ఏ జాబితా అక్రమాలపై తక్షణమే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం షాపూర్‌నగర్‌లోని ఎంజే గార్డెన్స్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలతో సోమ‌వారం నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, గోరెటి వెంకన్న, సీనియర్‌ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బాధితుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హ‌రీశ్‌రావు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

98 శాతం తొలగించామనడం పచ్చి అబద్ధం

22ఏ జాబితా నుంచి 98 శాతం భూములను తొలగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని హరీశ్‌రావు అన్నారు. అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు సమావేశానికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ‘‘22ఏ జాబితాలో భూములను చేర్చడం ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలి? లక్షలాది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టి కంటిమీద కునుకు లేకుండా చేసి ప్రజలను శిక్షిస్తారా?’’ అంటూ నిల‌దీశారు.

దశాబ్దాల నాటి పట్టా భూములూ 22ఏలోనా..?

58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మారావునగర్‌ ఫేజ్‌-1, 1950ల నాటి స్ప్రింగ్‌ఫీల్డ్‌, నిజాంపేట్‌ వంటి కాలనీల్లోని దశాబ్దాల క్రితం నాటి పట్టా భూములను కూడా 22ఏలో చేర్చడం తుగ్లక్‌ చర్య కాక మరేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలంటే లంచాలు చెల్లించాల్సిందే అన్నట్లుగా సీఎం, పొంగులేటి ఏజెంట్లు వసూళ్లకు దిగారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్ప్రింగ్‌ఫీల్డ్‌ కాలనీలో విల్లాకు, ఫ్లాట్‌కు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారని అన్నారు. అమీన్‌పూర్‌కు చెందిన ఓ బాధితుడిని ఎంఆర్‌ఓ, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిప్పించి.. చివరకు బయట బ్రోకర్లను కలిస్తేనే పని అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారన్నారు. ‘‘ఈ 22ఏ కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉంది. దీనికి ఏ-1 రేవంత్‌రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 50-50 కమీషన్ల కోసమే ఈ దోపిడీ అంతా జరుగుతోంది’’ అని హరీశ్‌రావు ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు.

రక్తం పీల్చి పిప్పి చేస్తారా

‘‘తనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా తెలుసని రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటారు. ఆ వ్యాపారం తెలిస్తే ప్రజల కష్టాలు తీర్చాలి కానీ.. వాళ్ల రక్తం పీల్చి పిప్పి చేస్తారా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, హౌసింగ్‌ బోర్డు భూములతో సహా విక్రయానికి పెడుతున్నారని ఆరోపించారు. చివరకు పిల్లలు ఆడుకునే వెయ్యి గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ‘‘ఇలా అమ్ముకుంటూ పోతే రేపు గుడికో, బడికో.. చివరకు స్మశానవాటికకు కూడా భూమి మిగలదు’’ అని అన్నారు. 22ఏ భూముల సమస్య హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో చేర్చారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం, యాదాద్రి జిల్లా రాజాపేట మండలం చెల్లూరులో సగం ఊరినే నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. వ్యవసాయ భూములను 22ఏలో చేరిస్తే రైతుబంధు రాదని, ఎరువులు దొరకవని, విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వబోరని అన్నారు. అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌, ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయంటే ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

సీఎం తమ్ముడికి వందల కోట్ల భూములు

ముఖ్యమంత్రి తన తమ్ముడికి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెడతారని, సామాన్య ప్రజల ఆస్తులను మాత్రం 22ఏలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. మల్కాజిగిరిలో 22ఏ భూములపై తాను మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చిన బాధితుల పేర్లు నమోదు చేసుకుని వారి భూములను జాబితా నుంచి తొలగించారని తెలిపారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితుల వివరాలు తీసుకున్న తర్వాత కూడా భూములను జాబితా నుంచి తొలగించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పోరాటం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వస్తోందన్నారు.

అసెంబ్లీని స్తంభింపజేస్తాం..

ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ముందుంటుందని హరీశ్‌రావు అన్నారు. ‘‘సెప్టెంబర్‌ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే దద్దరిల్లేలా సభను స్తంభింపజేసి అయినా బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కొట్లాడుతాం’’ అని ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాత్రికి రాత్రి చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. ‘‘డబ్బుపై ఉన్న దురాశే రేపు ఆయన దుఃఖానికి కారణమవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక రేవంత్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

40వేల ఎకరాలపై నాలుగు నెలల కింద‌టే స‌మాచారం..

యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని నాలుగు నెలల కింద‌ట‌నే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని హరీశ్‌రావు తెలిపారు. తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘‘కేవలం 50-50 కమీషన్ల కక్కుర్తే దీనికి కారణం’’ అని ఆరోపించారు. ఈ భూములను ఎవరి ఆదేశాలతో నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నిషేధిత జాబితాను రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని, వెబ్‌సైట్‌లో జాబితాను ఎందుకు బ్లాక్‌ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్ర‌జల భూములతో చెలగాటమాడుతూ వారిని నిద్రలేకుండా చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్‌ చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement