Gummadi Narsaiah | హైదరాబాద్ : విప్లవ పార్టీ నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య( Gummadi Narsaiah )చిత్రం షూటింగ్ పాల్వంచలో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో పాటు చిత్ర బృందం, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఇటీవలే విడుదల చేశారు. ఈ బయోపిక్‌ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరపున నిర్మాత ఎన్ సురేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. ఎవరీ గుమ్మడి నర్సయ్య..? గుమ్మడి నర్సయ్య 1955లో ఖమ్మం జిల్లా పరిధిలోని టేకులగూడెం గ్రామంలో జన్మించారు. రైతు కుటుంబంలో పురుడు పోసుకున్న నర్సయ్యకు.. భూమి పట్ల, పేదల జీవన విధానాల పట్ల అనుభవం ఎక్కువే. చిన్నప్పట్నుంచి నర్సయ్యకు సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడు కావడంతో.. ఆ సిద్ధాంతం ఆయన జీవితాన్ని మార్చేసింది. రైతుల భూమి కోసం, కార్మికుల న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ నిత్యం ప్రజా పోరాటాల్లో ముందుండేవాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ(CPI-M) తరఫున రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశాడు. ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ తరపున ఐదు సార్లు ఉమ్మడి ఏపీ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ వరుసగా ఇదే ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. ఇక ఈ పార్టీ తరపున ఉమ్మడి ఏపీలో ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యనే. ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఆయన ఒక సాధారణ పౌరుడిలా మెలిగాడు. అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చేవాడు. పల్లెల్లో ఎక్కువ సమయం కేటాయిస్తూ ప్రజల సమస్యలు విని అప్పటికప్పుడు పరిష్కరించేవాడు. అధికారం కోసం, డబ్బు కోసం నర్సయ్య ఏనాడూ కూడా ఆశపడలేదు. అందుకే గుమ్మడి నర్సయ్యను ప్రజా ఎమ్మెల్యే అని నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు.