Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నిన్న కేసీఆర్ స్టేట్స్‌మెన్‌లా మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డినేమో స్ట్రీట్ రౌడీలా చిల్లర మాటలు మాట్లాడారని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నిన్న కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సవివరంగా మాట్లాడారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలను రేవంత్ రెడ్డి నివృత్తి చేయాలి.. లేదా చర్చించి సవరించుకోవాలి. సరైన వివరణ ప్రజలకు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి మరగుజ్జు మనస్తత్వంతో పని చేస్తున్నారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ వ్యక్తిత్వం హిమాలయాల పర్వతాల అంత ఎత్తు కలిగిన వ్యక్తిత్వం. రేవంత్ రెడ్డిదేమో ఒక మరుగుజ్జు మనస్తత్వం. సంకుచిత భావాలు కలిగిన వ్యక్తి. కేసీఆర్ నిన్న స్టేట్స్‌మెన్‌లాగా మాట్లాడారు. నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్ రూపంలో ఒక స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడారు. చాలా చిల్లరగా మాట్లాడారు. తెలంగాణకు నొక్కు పడనీయను అని కేసీఆర్ అన్నారు.. దీనికి సీఎంకు, ఇరిగేషన్ మంత్రికి నొప్పి కలిగింది. ఫ్రస్టేషన్‌లో చిల్లర మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ద్రోహి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడిగా తేలిపోయారు అని హరీశ్‌రావు విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ కేబినెట్‌లోనే రూ. 2 వేల పెన్షన్‌కు నిర్ణయం తీసుకుని అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. మరి నాలుగు వేలు పెన్షన్లు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయిపోయింది.. రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500పై నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అపార అనుభవం ఉంది.. నిధులు ఎలా సమీకరించాలో తమకు తెలుసు.. ఎలా ఇవ్వాలో తమకు బాగా తెలుసు అన్నారు. మరి ఏమైంది మీ అనుభవం అని కేసీఆర్ ప్రశ్నించారు. మీ అనుభవం అంతా దోపిడీలకు, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా..? ఎరువులు దొరకడం లేదు.. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేస్తే ఇంటికాడ దించిపోయేవారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గోస ఎందుకు వచ్చింది.. యాప్ ఎందుకు అని కేసీఆర్ నిలదీశారు. ఫార్మా సిటీ ఉద్దేశం గురించి కేసీఆర్ తెలిపారు. మీకు ఇష్టమొచ్చినట్టు ఆ భూమిని వ్యాపారం చేయడానికి కాదు అన్నారు. వీటికి సమాధానాలు ఏవి..? హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ మాట్లాడారు. ఆర్థిక అరాచకత్వం అని రేవంత్ అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన టోనీ బ్లెయర్.. ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతిని సాధించింది అని కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారు. నీ సమక్షంలోనే చెప్తే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవ్. తలసరి ఆదాయంలో తెలంగాణను ఈ దేశానికి కేసీఆర్ మార్గదర్శకంగా నిలిపారని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు చెప్పారు. నీ రాజకీయాల కోసం రాష్ట్ర పరువును తీస్తున్నావు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నావు.. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బ తీస్తున్నావు.. రేవంత్ రెడ్డి బుద్దే పచ్చ కామెర్ల బుద్ది అంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.