త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGEHS | ఈహెచ్ఎస్‌పై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి.. దేవీప్ర‌సాద్ డిమాండ్‌..

TGEHS | ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు గుండవరం దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆగస్టు 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ అమల్లోకి వచ్చిందని ప్రకటించినా.. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వాస్తవంగా నగదు రహిత వైద్యం అందుతోందా అనే దానిపై స్పష్టత లేదన్నారు. 

P

Telangana | Published On Aug 23, 2026, 4.15 pm IST

TGEHS | ఈహెచ్ఎస్‌పై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి.. దేవీప్ర‌సాద్ డిమాండ్‌..
Advertisement

TGEHS | ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు గుండవరం దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆగస్టు 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ అమల్లోకి వచ్చిందని ప్రకటించినా.. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వాస్తవంగా నగదు రహిత వైద్యం అందుతోందా అనే దానిపై స్పష్టత లేదన్నారు. నూతన పథకం ద్వారా 4,440 మంది లబ్ధి పొందారని ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. లబ్ధిదారుల పేర్లు, చికిత్స పొందిన ఆసుపత్రులు, వైద్య సేవలు, ఖర్చుల వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడించాలని కోరారు. ఉద్యోగులకు ఇప్పటికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వలేదని, కార్డులు, అవసరమైన వ్యవస్థలు లేకుండా క్యాష్‌లెస్ సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాల నుంచి మే నెల నుంచే ఈహెచ్ఎస్‌ ప్రీమియం వసూలు చేసి.. ఆగస్టు 17 నుంచి పథకం అమల్లోకి వచ్చిందని చెప్పడం సమంజసం కాదన్నారు. మే 1 నుంచి ఆగస్టు 16 వరకు ఉద్యోగులు, పెన్షనర్లు, ఆధారిత కుటుంబ సభ్యులు పొందిన అర్హత కలిగిన వైద్యానికి వెంటనే రీయింబర్స్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈహెచ్ఎస్‌లో ఓపీ సేవలను కేవలం వెల్‌నెస్ సెంటర్లకే పరిమితం చేయకుండా ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ సేవలు అందించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లలో వైద్యులు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయో సమీక్షించాలని సూచించారు. పెన్షనర్లకు ఆరు నెలలకు ఒకసారి ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆరోగ్య ప‌థ‌కం అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వడంతో పాటు క్యాష్‌లెస్ ఇన్‌పేషెంట్, OP సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పందించి జాక్ ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు.

Advertisement
Advertisement