త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఏసీల్ల కూసోని స‌వాళ్లు కాదు.. క్షేత్రస్థాయికి రండి

Ponnam Prabhakar | ఏసీ గ‌దుల్లో కూర్చొని స‌వాళ్లు విస‌ర‌డం కాద‌ని.. ఏయే బూత్‌ల‌లో, వార్డుల్లో ఓట్లు తీసేశారో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ‌కు సిద్ధ‌మా? అని రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao)కు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ ప్ర‌తి స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Oct 12, 2026, 5.14 pm IST

Ponnam Prabhakar | ఏసీల్ల కూసోని స‌వాళ్లు కాదు.. క్షేత్రస్థాయికి రండి
Advertisement
  • ఓవైసీ పేర్లు ఎత్తి మ‌త‌ప‌ర‌మైన కోణంలోకి తేవ‌డ‌మే మీ వ్యూహం
  • ముషీరాబాద్‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఫామ్-7తో ఓట్లు తీసేయాల‌ని ఫిర్యాదు చేయ‌లేదా?
  • అస‌లు సమ‌స్య‌ల‌పై స‌మాధానం చెప్పండి
  • రాంచంద‌ర్‌రావుకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌తిస‌వాల్‌

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: ఏసీ గ‌దుల్లో కూర్చొని స‌వాళ్లు విస‌ర‌డం కాద‌ని.. ఏయే బూత్‌ల‌లో, వార్డుల్లో ఓట్లు తీసేశారో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ‌కు సిద్ధ‌మా? అని రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao)కు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ ప్ర‌తి స‌వాల్ విసిరారు. ముషీరాబాద్ (Musheerabad) నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్‌-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారో లేదో చెప్పాల‌న్నారు. రాంచంద‌ర్‌రావు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు గురించి ప్రశ్నిస్తే ఎంఐఎం, ఓవైసీ పేర్లను తెరపైకి తెచ్చి సమస్యను మతపరమైన కోణంలోకి మళ్లించడం బీజేపీ రాజకీయ వ్యూహమ‌ని ఆరోపించారు. రాంచంద‌రావు వ్యాఖ్య‌ల‌కు సోమ‌వారం పొన్నం కౌంట‌ర్ ఇచ్చారు.

అధికారులుగా ఉండాల‌నుకుంటున్న‌రా?

ఎన్నికల సంఘం అధికారాలను మీ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలి. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే సిస్టమ్‌లో యాడ్ చేయిస్తామనడం ఏమిటి? ఎన్నికల సంఘం అధికారులుగా వ్యవహరించాలనుకుంటున్నారా?

ఓటు హక్కు విషయంలో రాజకీయాలు కాదు.. అర్హులైన ప్రతి పౌరుడి హక్కును కాపాడటమే ముఖ్యం. ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదు. ఓట్లు తొలగించబడిన బాధితులను తీసుకువస్తాం. ఇది ఆరోపణ కాదు.. మా దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. ఓటర్ల జాబితా సవరణల్లో ఫామ్‌-6, ఫామ్‌-7 దరఖాస్తుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలి.

ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్‌-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారా లేదా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఓటర్ల జాబితా సవరణల్లో పారదర్శకతపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగించిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలి. ఓటు హక్కు ఏ ఒక్క మతానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదు.. అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు.

ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించలేరు. కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి ఏం సాధించిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర విభజన హామీలు, రైతుల సంక్షేమం వంటి అంశాలపై కేంద్రం నుంచి తెలంగాణకు అందిన సహకారంపై స్పష్టత ఇవ్వాలి. రాజకీయ డ్రామాలు, డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించేందుకు కృషి చేయాలి అని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement