త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి

CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 23, 2026, 2.46 pm IST

CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి
Advertisement

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజూ

CS Sanjay Jaju | త్రినేత్ర న్యూస్ : ఎల్‌నినో ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్ నినో చూపే ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమాచార శాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు నిర్వహించిన ఒకరోజు చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోందని , దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 20 శాతానికి పైగా వర్షపాతం తక్కువగా నమోదయింది అన్నారు. దీనితో, దాదాపు 20 శాతం పంట విస్తీర్ణం తగ్గిందని, తద్వారా సరిపడా ధాన్యం, పశుగ్రాసం తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కేవలం 30 నుండి 40 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో రానున్న జులై మాసం వరకు తాగు నీటికి అత్యంత ప్రాధాన్య నిస్తున్నామని వివరించారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం జరుగుతోందని, అత్యధికంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు అవగాహన కార్యక్రమాలు

సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రజా అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఈ ప్రచారాన్ని విస్తరించి, ప్రజలందరికీ ఎల్‌నినో ప్రభావాలు, వాటిని ఎదుర్కొనే ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్ డోర్ మీడియా , సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహింస్తున్నప్పటికే, జానపద కళారూపాల ప్రభావం గ్రామీణ ప్రజలపై గణనీయంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సందేశాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా పౌరసంబంధాల అధికారులు (డీపీఆర్వోలు), తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం, అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని చేరవేసి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

నీటిని , విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వాడడం, ఎండల సమయంలో తగినంత నీరు తాగడం, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, వృద్ధులు, చిన్నారులు, ఇతర సున్నిత వర్గాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. తాగునీటిని పొదుపుగా వినియోగించడం, నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం, నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రజలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు నిరంతరం చేరేలా వ్యవసాయ, విద్యుత్, పశు సంవర్ధక, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధిత శాఖల సమన్వయంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ప్రచార కార్యాచరణను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఎ. నరసింహ రెడ్డి, సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, సంయుక్త సంచాలకులు కె.వెంకట రమణ, శ్రీనివాస్, మధుసూధన్‌తో పాటువ్యవసాయ, విద్యుత్, పశుసంవర్ధక శాఖల అధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement