త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSPF | తెలంగాణ ప్రగతికి టీజీఎస్‌పీఎఫ్‌ రక్షణ కవచం

TGSPF | ‎‎భద్రతే అభివృద్ధికి పునాది అని, రాష్ట్రంలోని కీలక సంస్థలకు రక్షణ కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (TGSPF) సేవలు తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

S

Telangana | Published On Oct 23, 2026, 2.03 pm IST

TGSPF | తెలంగాణ ప్రగతికి టీజీఎస్‌పీఎఫ్‌ రక్షణ కవచం
Advertisement

‎67ప్రభుత్వ కీలక సంస్థలకు టీజీఎస్‌పీఎఫ్‌ భద్రత..
‎‎టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
36వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క

TGSPF | ‎త్రినేత్ర న్యూస్ : ‎భద్రతే అభివృద్ధికి పునాది అని, రాష్ట్రంలోని కీలక సంస్థలకు రక్షణ కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (TGSPF) సేవలు తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దళం సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, శిక్షణ అవకాశాలు, పని పరిస్థితుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు.
‎
‎శుక్రవారం తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1991 అక్టోబర్ 23న ఏర్పాటైన ఈ దళం 36 ఏళ్లలో విశిష్ట సంస్థగా ఎదిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక సంస్థలు సహా మొత్తం 67 ముఖ్యమైన సంస్థలకు భద్రత కల్పిస్తోందని పేర్కొన్నారు. దాదాపు రెండు వేల మంది సిబ్బంది ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
‎
‎టీజీఎస్‌పీఎఫ్‌ సేవలు కేవలం భవనాలు, సంస్థల రక్షణకే పరిమితం కావని, ప్రభుత్వ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చూడటంతోపాటు ప్రజల విశ్వాసాన్ని కాపాడే బాధ్యతను కూడా ఈ దళం నిర్వహిస్తోందని వివరించారు. దళం నినాదమైన ‘ప్రగతికి రక్షణ’ ఎంతో అర్థవంతమైనదని అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధికి పటిష్టమైన భద్రత అవసరమని స్పష్టం చేశారు.భద్రత అనేది అభివృద్ధి తర్వాత వచ్చే అంశం కాదని, అభివృద్ధికి ముందస్తు పునాది అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించాలన్నా, వైద్యులు రోగులకు సేవలు అందించాలన్నా, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కావాలన్నా విశ్వసనీయమైన మౌలిక సదుపాయాలతోపాటు వాటికి పటిష్టమైన రక్షణ ఉండాలని చెప్పారు.

‎విద్యుత్ కేంద్రాలకు కీలక రక్షణ
‎

‎విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్రత్యేక రక్షణ దళం సేవల ప్రాధాన్యం తనకు మరింత స్పష్టంగా తెలుసని ఉప ముఖ్యమంత్రి అన్నారు. యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి వంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని తెలిపారు. అక్కడ ఇంజినీర్లు, కార్మికులు విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలు నిర్వహిస్తుంటే, ఆ కేంద్రాలకు భద్రత కల్పిస్తూ ఉత్పత్తి నిరంతరాయంగా సాగేలా టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది తోడ్పడుతున్నారని ప్రశంసించారు. విద్యుత్ వెలుగులు అందరికీ కనిపించినా, వాటిని కాపాడే భద్రతా సిబ్బంది కృషి చాలాసార్లు కనిపించదని, అయితే వారి సేవల విలువ ఎంతో గొప్పదని అన్నారు. గత 35 ఏళ్లలో భద్రతా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆధునిక నిఘా వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ వ్యవస్థలతో అనుసంధానమైన భౌతిక మౌలిక సదుపాయాలు కొత్త సవాళ్లను తీసుకొస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో శారీరక దృఢత్వంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, అప్రమత్తత, వేగంగా స్పందించే సామర్థ్యం కూడా భద్రతా సిబ్బందికి అత్యంత అవసరమని వివరించారు అమీన్‌పూర్‌లో ప్రత్యేక శిక్షణ అకాడమీ ఉండటం సంతోషకరమని పేర్కొంటూ, శిక్షణ అనేది ఉద్యోగంలో చేరినప్పుడు పూర్తయ్యే ప్రక్రియ కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

‎క్రమశిక్షణ, నిజాయితీనే సంస్థకు బలం

‎
‎భద్రతా వ్యవస్థ బలాన్ని ఆయుధాలతోనే కొలవలేమని, వాటిని ధరించే సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, వివేకం, బాధ్యతాయుత ప్రవర్తనతోనే అంచనా వేయాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. విధులకు అప్పగించిన అధికారాలను బాధ్యతగా వినియోగించడం, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించడం సంస్థ ప్రతిష్ఠను నిర్ణయిస్తాయని చెప్పారు. ప్రజల్లో భయాన్ని కలిగించడం కాకుండా భరోసా కల్పించడమే మంచి భద్రతా వ్యవస్థ లక్షణమని పేర్కొన్నారు. పండుగలు, సెలవు దినాలు, రాత్రివేళలు, అత్యవసర సమయాల్లోనూ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. సిబ్బంది బాధ్యతలను అర్థం చేసుకుంటూ వారికి మానసిక బలాన్ని అందిస్తున్న కుటుంబ సభ్యుల త్యాగాలు కూడా ప్రశంసనీయమని అన్నారు. దళం అధికారులు, సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

‎తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన, సమృద్ధమైన, సురక్షితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో టీజీఎస్‌పీఎఫ్‌ పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రదర్శించిన క్రమశిక్షణ, అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. “మీరు కాపాడేది కేవలం భవనాలను కాదు.. ప్రజల విశ్వాసాన్ని. మీరు రక్షించేది కేవలం సంస్థలను కాదు.. తెలంగాణ ప్రగతిని” అని భట్టి విక్రమార్క పేర్కొంటూ, దళం 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement