త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్

KTR | ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి బూత్ పరిధిలో దొంగ ఓట్లను గుర్తించి తొలగించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా పరిశీలన అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. బుధవారం సీతాఫల్‌మండిలో నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

P

Telangana | Published On Jun 3, 2026, 9.03 pm IST

KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
Advertisement

KTR | ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి బూత్ పరిధిలో దొంగ ఓట్లను గుర్తించి తొలగించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా పరిశీలన అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. బుధవారం సీతాఫల్‌మండిలో నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక నిరంతర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించిన కేటీఆర్, పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షలు, బీహార్‌లో 65 లక్షల ఓట్ల తొలగింపు కారణంగా ప్రతిపక్షాలు నష్టపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం “కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోందని, దానిని ఓట్ల రూపంలోకి మార్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రత్యేక నిరంతర సవరణ (SIR) కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కాలంలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని సూచించారు. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, ఇళ్లు మారిన వారి వివరాల సవరణతో పాటు ఓటర్ల జాబితాలోని ఇతర లోపాలను గుర్తించి సరిదిద్దాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్టోబర్ 1న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితానే భవిష్యత్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రాతిపదిక కానుందని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగుచూసిన ఓట్ల అక్రమాలను గుర్తు చేస్తూ, ఒకే వ్యక్తికి పలుచోట్ల ఓట్లు నమోదైన ఉదాహరణలను సమావేశంలో ప్రదర్శించారు.

సికింద్రాబాద్ పరిధిలో అనుమానాస్పద ఓట్ల వివరాలతో కూడిన ‘వర్క్‌బుక్’ను ప్రతి బూత్ ఏజెంట్‌కు అందజేస్తామని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఇదే నెలలో ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా కేవలం ఫోన్ నంబర్, ఫోటో అప్‌లోడ్ చేస్తే ఓటర్ ఐడీ ఆధారంగా వివరాలు స్వయంచాలకంగా నమోదు అవుతాయని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు నాణ్యమైన ఫోటో గుర్తింపు కార్డు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement