త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మా లాంటోళ్లం థ‌ర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో నూటికి నూరు మార్కులు తెచ్చుకునే వారు ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఉన్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ మేం చ‌దువుకునేట‌ప్పుడు.. ప‌దిలో ఫ‌స్ట్ క్లాస్ వ‌స్తే జిల్లా మొత్తం గుర్తు పట్టేది.. ఇక మా లాంటోళ్లం థ‌ర్డ్ క్లాస్‌లో రిజ‌ల్ట్ చూసుకునేటోళ్లం అని సీఎం గుర్తు చేశారు.

S

Telangana | Published On Aug 14, 2026, 6.10 pm IST

CM Revanth Reddy | మా లాంటోళ్లం థ‌ర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో నూటికి నూరు మార్కులు తెచ్చుకునే వారు ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఉన్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ మేం చ‌దువుకునేట‌ప్పుడు.. ప‌దిలో ఫ‌స్ట్ క్లాస్ వ‌స్తే జిల్లా మొత్తం గుర్తు పట్టేది.. ఇక మా లాంటోళ్లం థ‌ర్డ్ క్లాస్‌లో రిజ‌ల్ట్ చూసుకునేటోళ్లం అని సీఎం గుర్తు చేశారు. నెక్లెస్ రోడ్‌లో మ‌హాత్మా జ్యోతిబాపూలే విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

గ్రూప్‌-1 పోస్టుల కింద 562 మందిని నియ‌మిస్తే 60 శాతం బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఉద్యోగాలు వ‌చ్చాయి. ప‌రీక్ష‌లు మాత్రం ల‌క్ష‌లాది మంది రాశారు. ప్ర‌స్తుతం చ‌దువులో పోటీ పెరిగింది. నేను చ‌దువుకునేట‌ప్పుడు ఫ‌స్ట క్లాస్ వ‌స్తే జిల్లా మొత్తం గుర్తు పట్టేది. ఇప్పుడేమో నూటికి నూరు వ‌చ్చేటోల్లు ల‌క్ష మంది ఉన్నారు. ఫ‌స్ట్ క్లాస్ వాళ్ల‌ను వేళ్ల మీద లెక్క పెట్టేవారు. సెకండ్ క్లాస్ కొద్ది మంది. మా లాంటోళ్లం ఫ‌స్ట్‌ థ‌ర్డ్ క్లాస్‌లో వెతికేటోళ్లం.. పాస్ అయ్యామా..? లేదా..? అని సీఎం పేర్కొన్నారు.

ఒక‌ప్పుడు డాక్ట‌ర్ స‌ర్టిఫికెట్ ఉంటే పిలిచి పిల్ల‌ను ఇచ్చేటోళ్లు

ఒక‌ప్పుడు ఇంజినీరింగ్ స‌ర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వ‌చ్చేది. ఒక‌ప్పుడు డాక్ట‌ర్ స‌ర్టిఫికెట్ ఉంటే పిలిచి పిల్ల‌ను ఇచ్చేటోళ్లు. ఇవాళ ఈ స‌ర్టిఫికెట్లు స‌రిపోవ‌డం లేదు.. నాణ్య‌త ఉందా..? స్కిల్ ఉందా.. అని ప్ర‌శ్నించే ప‌రిస్థితి వ‌చ్చింది. న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు సాంకేతిక‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి. స్కిల్ నేర్పాలి. నైపుణ్యం ఉన్న‌వారికి ప్ర‌పంచం ఎర్ర తివాచీతో స్వాగ‌తం ప‌లుతుకుంది. స‌ర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగం వ‌స్తుందో రాదో చెప్ప‌లేం. భాష ప‌రిజ్ఞానం, అవ‌గాహ‌న నేర్చుకోవాలి. ఇంట‌ర్ త‌ర్వాత ఏటీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ యూనివ‌ర్సిటీల్లో చేరండి.. స్కిల్ నేర్చుకోండి. మీరు న‌ర్సింగ్ చ‌దువుకుంటే 2 ల‌క్ష‌ల‌తో జ‌ర్మ‌నీ, జపాన్, సౌత్ కొరియాలో మీకు ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి. లాయ‌ర్లు ఇంజినీర్లు, డాక్ట‌ర్ల‌తో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి.. మ‌న ప్ర‌భుత్వం నైపుణ్యం కోసం సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న‌తో ముందుకు పోతున్న‌ది అని సీఎం తెలిపారు.

సాంకేతిక నైపుణ్యం పెంచుకునేందుకు సంసిద్దులు కావాలి

ఒకప్పుడు కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివిస్తే అమెరికాలో ఐటీ ఉద్యోగం వ‌స్త‌ది.. డాల‌ర్లు పంపిస్త‌రు జీవితాల్లో మార్పు వ‌స్త‌ద‌ని త‌ల్లిదండ్రులు ఆశించారు. కానీ ఇవాళ ఇంటికి తిరిగి వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. ఏఐ వ‌ల్ల ఉద్యోగాలు పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే ప్ర‌భుత్వం ముంద‌స్తు ఆలోచ‌న‌ల‌తో టాటా సంస్థ‌తో మాట్లాడి ఏటీసీల‌ను ప్రారంభించుకున్నాం. ప్ర‌తి స్టూడెంట్‌కు 2 వేల స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తున్నాం. సాంకేతిక నైపుణ్యం పెంచుకునేందుకు సంసిద్దులు కావాలి అని విద్యార్థుల‌కు సీఎం సూచించారు.

Advertisement
Advertisement