త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amara Raja Giga Corridor | దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా

మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా CQP ప్లాంట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. 2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యమన్నారు.

J

Telangana | Published On Jul 15, 2026, 5.12 pm IST

Amara Raja Giga Corridor | దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా

సంక్షిప్త సారాంశం

మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్ 'కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్'ను (CQP) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుండగా, అందులో 400 మంది మహిళలే కావడం విశేషం. గత ప్రభుత్వాల మంచి పాలసీలను తాము కొనసాగిస్తామని, పాలసీల విషయంలో తమకు ఎలాంటి పక్షపాతం లేదని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని సాధించేలా పొరుగు రాష్ట్రంతో కీలక చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

Advertisement
  • ఈవీ రంగంలో చైనాతో ఢీ
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని సాధిస్తాం
  • దివిటిపల్లిలో అమర రాజా ప్లాంట్ ప్రారంభం
  • ఉమ్మడి పాలమూరు దశ మారేలా సీఎం మాస్టర్ ప్లాన్
  • ఢిల్లీకి రాజైనా.. నేను పాలమూరు బిడ్డనే 
  • అమర రాజా ప్లాంట్‌లో సీఎం రేవంత్ కీలక ప్రకటన

Amara Raja Giga Corridor | త్రినేత్ర.న్యూస్ : మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఊపందుకుంది. ప్రతిష్ఠాత్మక 'అమర రాజా గిగా కారిడార్'లో (Amara Raja Giga Corridor) ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్ర పారిశ్రామిక విధానం, భవిష్యత్ లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈవీ రంగంలో చైనాకు దీటుగా..

అమర రాజా సంస్థకు నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర ఉందన్న సీఎం.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) రంగంలో ప్రపంచ లీడర్‌గా ఉన్న చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలతో ఈ సంస్థ పోటీ పడుతోందని ప్రశంసించారు. వాతావరణ మార్పులు, ఎల్-నినో ప్రభావం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈవీల వాడకం అత్యవసరమని ఆయన నొక్కిచెప్పారు. దివిటిపల్లి ప్లాంట్‌లో పనిచేస్తున్న 700 మందిలో 400 మంది మహిళలే ఉండటం నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. భూములు ఇచ్చిన స్థానిక రైతుల కుటుంబాలకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని సీఎం కోరారు.

పాలసీ పెరాలసిస్ లేదు.. మంచిని కొనసాగిస్తాం

రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు తెచ్చిన మంచి పాలసీలను తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 1994లో చంద్రబాబు, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల సానుకూల విధానాలను మరింత మెరుగుపరుస్తామన్నారు. "మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ (Policy Paralysis) లేదు. పారదర్శకంగా విధానాలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉంది. దానిని 10 శాతానికి పెంచడమే మా లక్ష్యం. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల (One Trillion Dollar) ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని 'తెలంగాణ రైజింగ్ 2047' దిశగా అడుగులు వేస్తున్నాం" అని ఆయన వివరించారు.

పాలమూరు అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్

తాను ఢిల్లీకి రాజైనా, పాలమూరుకు బిడ్డనే అన్న సీఎం రేవంత్.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏటీసీలు (ATCs), ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, భీమా, ఆర్డీఎస్, నెట్టంపాడు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపులపై పొరుగు రాష్ట్రంతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిల్లా ప్రజలకు శుభవార్త చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. గతంలో గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్నప్పుడు కొడంగల్‌కు రోడ్లు మంజూరు చేశారని, తాను రెండోసారి గెలవడానికి ఆ అభివృద్ధి పనులే కారణమయ్యాయని సీఎం గుర్తుచేసుకున్నారు.

Advertisement
Advertisement