త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

ప్రతిపక్షాల కుట్రలను, అసత్య ప్రచారాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు.

J

Telangana | Published On Sep 16, 2026, 4.43 pm IST

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

సంక్షిప్త సారాంశం

ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై 22A భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్నది విషప్రచారమని మండిపడ్డారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ధరించిన నల్లటి టీషర్ట్‌కు, అసెంబ్లీ నిబంధనలకు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. మా ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమేనని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడడమే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

Advertisement
  • అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రసంగం
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై 22A భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్నది విషప్రచారం
  • పార్లమెంటులో రాహుల్ గాంధీ ధరించిన నల్లటి టీషర్ట్‌కు, అసెంబ్లీ నిబంధనలకు చాలా తేడా ఉంది
  • మా ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమే
  • పోరాటాలు చేసింది ఎర్రజెండా
  • ఆ పోరాటాలకు చట్టరూపం తెచ్చింది మాత్రం మూడు రంగుల జెండా అయిన మా కాంగ్రెస్ జెండానే
  • ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొట్టేలా ఘాటు విమర్శలు

Revanth Reddy Assembly Speech | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో జరిగిన తప్పులపై సభలో సమగ్ర చర్చ జరుగుతుందనే భయంతోనే ప్రధాన ప్రతిపక్షం కుట్రలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరువు, కొందరు చేసిన క్షుద్రపూజలపై చర్చ రాకుండా ఉండేందుకే సభ మొదటి రోజే ప్రతిపక్షాలు అడ్డుతగిలాయని మండిపడ్డారు.

అగ్రికల్చర్ సీలింగ్ చట్టం - చారిత్రక సంస్కరణలు

గతంలో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఎంతో దూరదృష్టితో ఆలోచించి.. కొద్దిమంది చేతుల్లో బందీగా ఉన్న భూములకు విముక్తి కల్పించేందుకు అగ్రికల్చర్ సీలింగ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని సీఎం గుర్తుచేశారు. పోరాటాలు చేసింది ఎర్రజెండా అయితే, ఆ పోరాటాలకు చట్టరూపం తెచ్చింది మాత్రం మూడు రంగుల జెండా అయిన మా కాంగ్రెస్ జెండానే అని స్పష్టం చేశారు.

22A భూముల వివాదంపై విషప్రచారం

ధరణితో భూములు కోల్పోయిన బాధితులకు పట్టాలు ఇప్పించమని వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనక్కి పంపించినందుకే ఆయనపై కక్షగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిషేధిత భూములు అనే ఒక భూతాన్ని సృష్టించాడని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు 'సాడిస్టిక్ ప్లేజర్' పొందుతున్నారని మండిపడ్డారు. 22A భూముల నిషేధిత జాబితా అనేది జెన్యూన్ సమస్య కాదని, కేవలం రాజకీయ లబ్ధికే ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవేళ మంత్రి స్వయంగా తన ఇల్లే నిషేధిత జాబితాలో పెట్టదలుచుకుంటే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా అని ప్రశ్నించారు.

పార్లమెంట్ నిబంధనలు - అసెంబ్లీ రూల్స్ వేరు

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్లటి టీషర్ట్ వేసుకొని వెళ్లడాన్ని, అసెంబ్లీ నిబంధనలను బేరీజు వేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని సీఎం ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో నినాదాలతో కూడిన టీషర్టులతో లోపలికి రావొద్దని లోక్‌సభ స్పీకర్ ఎలాంటి ప్రత్యేక నిబంధనలు విధించలేదని, అందుకే ఆయనను అనుమతించారని తెలిపారు. కానీ తెలంగాణ శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉండాలో గత ప్రభుత్వమే స్పష్టమైన రూల్స్ రూపొందించిందని, ఆ నిబంధనల మేరకే స్పీకర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. సభాపతిని దూషించి, అసభ్యంగా ప్రవర్తించడం వల్లే సభా నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.

ప్రతీ ఆడబిడ్డ ఆత్మగౌరవమే మా ప్రభుత్వ ధ్యేయం

తమ ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా పారదర్శక పాలన అందిస్తామని పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement