త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మీకు క‌డుపులో విషం ఉండొచ్చు.. క‌ళ్లల్లో కోపం ఉండొచ్చు

CM Revanth Reddy | హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైటెక్స్ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న భార‌త్ స‌మ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా భార‌త్ స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు వ‌స్తున్నందుకు మీకు క‌డుపులో విషం ఉండొచ్చు.. క‌ళ్ల‌ల్లో కోపం ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల మీద ప్ర‌ద‌ర్శించకండి.. రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 13, 2026, 6.11 pm IST

CM Revanth Reddy | మీకు క‌డుపులో విషం ఉండొచ్చు.. క‌ళ్లల్లో కోపం ఉండొచ్చు
Advertisement

కానీ తెలంగాణ ప్ర‌జ‌ల మీద ప్ర‌ద‌ర్శించ‌కండి
రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుంది
రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయిత‌డ‌ని బీజేపీకి భ‌యం ఉండొచ్చు
కానీ బీజేపీ, బీఆర్ఎస్ నేత‌లు విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి
మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైటెక్స్ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న భార‌త్ స‌మ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా భార‌త్ స‌మ్మిట్‌లో పాల్గొనేందుకు వ‌స్తున్నందుకు మీకు క‌డుపులో విషం ఉండొచ్చు.. క‌ళ్ల‌ల్లో కోపం ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల మీద ప్ర‌ద‌ర్శించకండి.. రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు. కాబ‌ట్టి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పెవిలియ‌న్‌లో శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

మౌలిక వ‌స‌తులు, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, కంపెనీల పెట్టుబ‌డులు వివ‌రాల‌ను ఈ రోజు ప్ర‌పంచానికి తెలియ‌జేప్ప‌డానికి భార‌త్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నాం. గ‌తేడాది కూడా గ్లోబ‌ల్ స‌మ్మిట్ కంటే ముందు భార‌త్ స‌మ్మిట్ నిర్వ‌హించాం. ఈరోజు తెలంగాణ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 7, 8, 9 వ‌ర‌కు గ్లోబ‌ల్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా పెట్టుబ‌డుల‌కు సానుకూల‌మైన రాష్ట్రంగా, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన విధివిధానాల‌తో ముందుకు వెళ్తున్న‌ది. ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని రాష్ట్రం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.

వీసాల‌ను ర‌ద్దు చేసి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటున్నారు

ఇప్ప‌టికే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌పై బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ముంబై, అహ్మ‌దాబాద్‌లో కూడా త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాం. అందులో భాగంగానే హైద‌రాబాద్‌లో న‌వంబ‌ర్ 13, 14 తేదీల్లో స‌మ్మిట్ ద్వారా 70 దేశాల‌కు చెందిన‌ 1000 మంది ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాం. విదేశాల నేత‌లు ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మై ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ ప్ర‌భుత్వం ఆఖ‌రి నిమిషంలో వీసాల‌ను ర‌ద్దు చేసి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటున్నారు అని సీఎం మండిప‌డ్డారు.

ఎందుకు అభ్యంత‌రమో అర్థం కావ‌డం లేదు

కిష‌న్ రెడ్డి, రామ‌చంద‌ర్ రావు, కేటీఆర్.. భార‌త్ వ్య‌తిరేక స‌మ్మింట్ అంటూ ప్ర‌జా యోజ‌నాలు లేవు.. ప్ర‌జాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే విధి విధానాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా కార్యాచ‌ర‌ణ తీసుకుని, ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటే గుడ్డిగా వ్య‌తిరేకించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వివిధ దేశాల‌కు చెందిన పార్ల‌మెంట్ స‌భ్యులు, మంత్రులు, ప‌ర్యావ‌ర‌ణ‌, ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లుగా ఉన్న‌వారిని ఆహ్వానించ‌డం జ‌రిగింది. విదేశాల్లోని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను కూడా ఆహ్వానించాం. ఎందుకంటే తెలంగాణ, హైద‌రాబాద్ గురించి మాట‌ల్లో ఎంత చెప్పినా కొంత‌నే అవ‌గాహ‌న క‌లుగుతుంది. పాల‌సీల‌ను వివ‌రించ‌డం ద్వారా, క్షీణించిపోతున్న ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను నిల‌బెట్ట‌డానికి చ‌ర్చ‌ల ద్వారానే ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌నే న‌మ్మ‌కంతో పార్టీ ప్ర‌భుత్వంగా ఈ కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నాం. అయితే కేటీఆర్, కిష‌న్ రెడ్డి, రామ‌చంద‌ర్ రావుకు ఎందుకు అభ్యంత‌రమో అర్థం కావ‌డం లేదు. అర్థం లేని ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు అని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ నేత‌లు కూడ‌బ‌లుక్కొని వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

ఈ రెండు రోజుల స‌మావేశాల్లో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డులు, మావ‌న వ‌న‌రుల గురించి వివ‌రించ‌డం ద్వారా రాష్ట్రం ఒక అనువైన పెట్టుబ‌డుల కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలి. 2047 నాటికి 3 ట్రిలియ‌న్ డాల‌ర్స్ ఎకాన‌మీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌న పెపొందించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం. కానీ ప్ర‌తిప‌క్ష నేతలు మూసీని వ్య‌తిరేకించారు. మెట్రో విస్త‌ర‌ణ‌, రేడియ‌ల్ రోడ్స్, ట్రిపుల్ ఆర్‌ను వ్య‌తిరేకించారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను తీసుకుంటే వాళ్లు వ్య‌తిరేకిస్తున్నారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల పూర్తి చేస్తామంటే, తుమ్మిడిహెట్టి ప‌రిష్క‌రిస్తామంటే వ్య‌తిరేకిస్తున్నారు. ఏ నిర్ణ‌యాన్ని కూడా ముందుకు సాగ‌నివ్వ‌కుండా ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ నేత‌లు కూడ‌బ‌లుక్కొని వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉంటూ విఘాతం క‌లిగిస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

మోదీ ఏది చేసినా క‌రెక్టే.. రాహుల్ ఏది చేసినా త‌ప్పే అన్న‌ట్టుగా..

గిగ్ వ‌ర్క‌ర్ల‌కు స‌మ‌స్య‌లు ఉన్నాయి. వేలాది మంది గిగ్ వ‌ర్క‌ర్ల‌కు ర‌క్ష‌ణ చ‌ట్టం లేదు.. ప్ర‌తిప‌క్షాల‌కు ఆదుకోవాల‌న్న ఆలోచ‌న కూడా లేదు. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు గిగ్ వ‌ర్క‌ర్స్ పాల‌సీ అమ‌లు చేయాల‌నుకున్నాం. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. వారిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. భార‌త్ స‌మ్మిట్ ముగింపు సంద‌ర్భంగా రాహుల్ వ‌స్తున్నారు. ఆయ‌న వ‌స్తుంటే బీజేపీకి ఉన్న అభ్యంత‌రం అర్థం కావ‌డం లేదు. రాజీవ్ గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత అట‌ల్ బీహారి వాజ‌పేయిని విదేశాల‌కు ముఖ్య అతిథిగా పంపించారు. ప్ర‌ధాని ఏఐ, బ్రిక్స్ స‌మ్మిట్ చేస్తారు. ఇత‌ర దేశాల‌కు చెందిన ముఖ్య‌మైన వారితో స‌మ్మిట్ పెడుతారు. చైనా అధ్య‌క్షుడిని పిలుస్తారు. పాకిస్తాన్‌తో వైరం ఉంద‌ని చెప్పి కూడా న‌వాజ్ ష‌రీఫ్ వ‌ద్ద బిర్యానీ తిని వ‌స్తారు. మోదీ ఏది చేసినా క‌రెక్టే.. రాహుల్ ఏది చేసినా త‌ప్పే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు. ఆయ‌న‌కు కేబినెట్ ర్యాంకు ఉంది. ఈ రోజు స‌మావేశాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నారు. విదేశాల‌కు భార‌త ప్ర‌తినిధిగా వాజ‌పేయిని పంపించి రాజీవ్ కొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపారు. మ‌రి మీరు ఎందుకు రాహుల్‌ను అవ‌మానిస్తున్నారు. బీజేపీ వైఖ‌రి నియంత‌లా వైఖ‌రిలా మారింది. ప్ర‌జాస్వామ్యంలో అంద‌రి అభిప్రాయాలు తీసుకుని, అందులో ఉత్త‌మ విధానాల‌ను అమ‌లు చేస్తాం. రాజ్యాంగాన్ని 106 సార్లు స‌వ‌రించుకున్నాం ఉత్త‌మ ప‌రిపాల‌న‌కు అని సీఎం గుర్తు చేశారు.

ప్ర‌జాస్వామ్య‌యుత‌మైన వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో ఉంది..

ప్ర‌పంచంలో ఎక్క‌డా చూసినా అల‌జ‌డి.. ఎన్నో ర‌కాల యుద్ధాలు జ‌రుగుతున్నాయి. శాంతి కోసం చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. 70 దేశాల నుంచి వెయ్యి మంది అతిథులుగా వ‌స్తే.. వారు తిరిగి వెళ్లేట‌ప్పుడు వారు తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా మారుతారు. వెయ్యి మందిని హైద‌రాబాద్‌కు ర‌ప్పించి ఒక ద‌గ్గ‌ర కూర్చోబెట్టి వివిధ సెమినార్లు నిర్వ‌హించి నిపుణుల‌తో చ‌ర్చించి తీర్మానాలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డ‌మే కాకుండా, ప్ర‌జాస్వామ్య‌యుత‌మైన వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో ఉంది.. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ‌లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. కిష‌న్ రెడ్డి, కేటీఆర్, రామ‌చంద‌ర్ రావు విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి. మీకు క‌డుపులో విషం ఉండొచ్చు. క‌ళ్ల‌ల్లో కోపం ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ మీద ప్ర‌ద‌ర్శించ‌కండి.. రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుంది అని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాబోయే ఎన్నిక‌ల్లో మిమ్మ‌ల్ని ఓడిస్తాడు..

గిగ్ వ‌ర్క‌ర్ పాల‌సీ దేశంలోనే బెస్ట్ పాల‌సీ. రేప‌టి స‌మావేశంలో కొన్ని తీర్మానాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉన్నాయి. కాబ‌ట్టి భార‌త్ స‌మ్మిట్‌ను గుడ్డిగా వ్య‌తిరేకించొద్దు. రాహుల్ అంటే మీకు భ‌యం ఉండొచ్చు. రాబోయే ఎన్నిక‌ల్లో మిమ్మ‌ల్ని ఓడిస్తాడు.. ప్ర‌ధానిగా బాధ్య‌త తీసుకుంటాడ‌ని భ‌యం ఉండొచ్చు. ఆ భ‌యంతో రాహుల్‌పై ఆరోప‌ణ‌లు చేయాల‌న్న ఆలోచ‌న ఉంటే మానేయండి. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. రాహుల్ ముఖ్య అతిథిగా త‌న అభిప్రాయాల‌ను పంచుకోవడానికి, గిగ్ వ‌ర్క‌ర్స్ పాల‌సీని అంకితం చేయ‌డానికి వ‌స్తున్నారు. ఇదే సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. అక్క‌డ్నేమో మీరు స‌మ‌ర్థిస్తారు.. సేమ్ అదే భార‌త్ స‌మ్మిట్ కు రాహుల్ వ‌స్తే వ్య‌తిరేకిస్తారు. ఈ ద్వంద్వ వైఖ‌రిని బీజేపీ వీడాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement