త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju | రబీ సాగు ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయండి.. నీటిని బ‌ట్టే పంట‌ల ఎంపిక ఉండాలి

Sanjay Jaju | రాష్ట్రంలో ర‌బీ (Rabi Season) సాగు ప్ర‌ణాళిక‌ (Cultivation Plan) ను త‌యారు చేయాల‌ని.. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏ పంట‌లు వేయాలో రైతుల‌కు చెప్పాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju)సూచించారు.

S

Telangana | Published On Nov 13, 2026, 7.11 pm IST

Sanjay Jaju | రబీ సాగు ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయండి.. నీటిని బ‌ట్టే పంట‌ల ఎంపిక ఉండాలి
Advertisement
  • ఏ పంట‌లు వేయాలో రైతుల‌కు చెప్పండి
  • విత్త‌నాలు రెడీగా ఉండేలా చూడండి
  • క‌లెక్ట‌ర్లే వాళ్ల వాళ్ల జిల్లాల‌కు లీడ‌ర్లు.. అది మీ బాధ్య‌తే
  • వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశం

Sanjay Jaju | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో ర‌బీ (Rabi Season) సాగు ప్ర‌ణాళిక‌ (Cultivation Plan) ను త‌యారు చేయాల‌ని.. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏ పంట‌లు వేయాలో రైతుల‌కు చెప్పాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju)సూచించారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేసే బాధ్య‌త క‌లెక్ట‌ర్ల‌దేన‌న్నారు. క‌లెక్ట‌ర్లంద‌రినీ త‌మ త‌మ జిల్లాల‌కు టీమ్ లీడ‌ర్లుగా ముఖ్య‌మంత్రి రేవంత్ అభివ‌ర్ణించార‌ని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో శుక్ర‌వారం వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వ‌హించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, కూరగాయలు, పప్పుధాన్యాల సాగు, ధాన్యం కొనుగోళ్లు, భూసేకరణ సమస్యలు, పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు.

కూర‌గాయ‌లు, పప్పుధాన్యాలు..

రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో పంటల సాగుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేపట్టాలని తెలిపారు. రబీ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
కూరగాయలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను గరిష్టంగా వినియోగించుకొని సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సూక్ష్మ సేద్యం, ముఖ్యంగా బిందు సేద్యం విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించండి..

జిల్లా కలెక్టర్లు తరచుగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధనా ప్రమాణాలను పరిశీలించాలని సీఎస్‌ సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో అవసరమైన పారిశుద్ధ్య పనులు చేపట్టి, పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.

వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) కార్యక్రమం విస్తరణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా స్థాయిలో కార్యక్రమాల పురోగతిని కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement