KTR | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ శిఖండి రాజకీయాలు తప్ప మగతనం రాజకీయాలు చేయడం లేదని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ గెలుపు గులాబీ సైనికులది మాత్రమే.. కేసీఆర్ స్ఫూర్తితో మీరు పోరాటం చేశారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాటం చేసి గెలిపించారు. కొన్ని చోట్ల మోసాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధికార పార్టీ గెలిపించుకుంది. రెండేండ్ల విజయోత్సవ సభల పేరిట జిల్లా జిల్లా తిరిగిండు సీఎం. స్థానిక మంత్రులు ఇందిరమ్మ ఇండ్లు రావని బెదిరించారు. ఎమ్మెల్యేలు ఊరూరా తిరిగారు. ఇన్ని చేసిన రాష్ట్ర వ్యాప్తంగా 35 నుంచి 40 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు.. పారిపోతున్నారు. రైతులకు మేలు చేయడం లేదు.. సహకార సంఘాల ఎన్నికలు పెట్టడం లేదు. నీకు, నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. రైతులకు మంచి చేసినమని భావిస్తే సహకార సంఘాల ఎన్నికలు పెట్టు. ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయదారులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం సర్పంచ్ ఎన్నికల్లో కనబడింది. సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రు కాల్చి వాత పెడుతారని భయపడుతున్నారు అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ రెండేండ్లలో టైం పాస్ చేశారు. రోజుకో లీక్ ఇస్తారు. ఈ కేసు ఆ కేసు అని రెండేండ్లుగా కేసుల చుట్టూ ప్రభుత్వం నడుస్తోంది. ప్రజలకు పనికి వచ్చే పని ఒక్కటి చేయలేదు. మగాడిలా కేసులు పెట్టేందుకు కూడా ధైర్యం లేదు. ట్యాపింగ్ అని మళ్లీ తెరలేపిండు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, మగాడివి అయితే రా.. ఈ కేసు పెడుతున్నానని బహిరంగంగా చెప్పు. శిఖండి రాజకీయాలు తప్ప మగతనంతో కూడిన రాజకీయాలు చేయడం లేదు. చిట్ చాట్‌లు అనుకుంటూ దాక్కోవడం ఎందుకు..? కెమెరాల ముందుకు రా. ఈ విషయంలో కేసు పెడుతున్నా.. నేనే పోలీసోళ్లకు చెప్పినా.. నోటీసు ఇస్తున్నా అని బహిరంగంగా చెప్పు. హోంమంత్రి కూడా నువ్వే కదా రా.. బయటకు రా. కాలక్షేపం చేయకు. డైవర్షన్ గేమ్స్ ఆడకు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.