త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | దివాళా తీసిన కంపెనీకి రూ. 6 వేల కోట్ల ప‌నులు..!

KTR | రేవంత్ రెడ్డి స‌ర్కార్ బాగోతాల‌ను బీఆర్ఎస్ పార్టీ వెలికి తీస్తూనే ఉంది. ఇప్ప‌టికే అనేక కుంభ‌కోణాలు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా మ‌రో కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది. దివాళా తీసిన కేఎస్ఎల్ఆర్ కంపెనీకి రూ. 6 వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వచ్చాయ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీశారు.

S

Telangana | Published On Feb 4, 2026, 4.19 pm IST

KTR | దివాళా తీసిన కంపెనీకి రూ. 6 వేల కోట్ల ప‌నులు..!
Advertisement

రేవంత్ రెడ్డికి, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఏం సంబంధం..?
దివాళా తీసిన కంపెనీకి రూ. 6 వేల కోట్లు ఎలా ఇచ్చారు..?
TS07FF0009 కారును రేవంత్‌కు ఎవ‌రిచ్చారు..?
కేఎల్ఎస్ఆర్‌పై సీబీఐ, ఎస్ఎఫ్ఐవో, ఈడీ విచార‌ణ జ‌ర‌గాల్సిందే..
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వ‌జం

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి స‌ర్కార్ బాగోతాల‌ను బీఆర్ఎస్ పార్టీ వెలికి తీస్తూనే ఉంది. ఇప్ప‌టికే అనేక కుంభ‌కోణాలు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా మ‌రో కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది. దివాళా తీసిన కేఎస్ఎల్ఆర్ కంపెనీకి రూ. 6 వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వచ్చాయ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిల‌దీశారు. ఆ కంపెనీ సిబ్బందికి వేత‌నాలు చెల్లించేందుకు డ‌బ్బుల్లేక బ్యాంకు నుంచి రూ. 15 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నారు. ఎన్సీఎల్ఏటీలో కేసు న‌డుస్తుంది.. అలాంటి కంపెనీకి రూ.6000 కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు? అని కేటీఆర్ అడిగారు. ఈ కుంభ‌కోణంపై తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ కుంభ‌కోణాల‌ను బ‌య‌ట‌పెడుతూ వ‌స్తున్నాం.. అది మీరు గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నంలోకి తీసుకుంటున్నారు. మూసీ పేరిట రూ. ల‌క్షా 50 వేల కోట్ల దోపిడీకి తెర‌లేపారు. దాన్ని బ‌య‌ట‌పెట్టి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి అడ్డుకున్న‌ది బీఆర్ఎస్ పార్టీనే. ల‌గ‌చ‌ర్ల‌లో గిరిజ‌న్ల మీద దాడి చేసి భూములు లాక్కొని త‌న సొంత అల్లుడి కోసం ఫార్మా విలేజ్ అని ప్ర‌తిపాద‌న పెడితే రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డినం. హిల్ట్ పాల‌సీ పేరిట దోచుకునేందుకు య‌త్నించిన రూ. 5 ల‌క్ష‌ల కోట్ల భూభాగోతాన్ని బీఆర్ఎస్ బ‌య‌ట‌పెట్టింది. అమృత్ ప‌థ‌కంలో సీఎం బావ‌మ‌రిది చేసిన స్కాంను బ‌య‌ట‌పెట్టింది బీఆర్ఎస్. సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణానికి పాల్ప‌డింద‌ని చెబుతూ ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది బీఆర్ఎస్ అని కేటీఆర్ తెలిపారు.

త‌వ్వ‌డం మొద‌లుపెడితే.. ఈ బాగోతం బ‌య‌ట‌ప‌డింది..

గ‌త వారం ప‌ది రోజులుగా జ‌న‌వ‌రి 22 త‌ర్వాత వ‌రుస‌స‌గా హ‌రీశ్‌రావు, సంతోష్ కుమార్, కేసీఆర్‌తో పాటు న‌న్ను విచార‌ణ‌కు పిలిపిస్తే మాకు అనుమానం వ‌చ్చింది. ఇదేదో డైవ‌ర్ష‌న్ గేమ్ ఆడుతున్నార‌ని డౌట్ వ‌చ్చింది. మేం కూడా త‌వ్వ‌డం మొద‌లుపెట్టినం.. ఏం క‌వ‌ర్ చేయ‌డానికి హడావుడి చేస్తున్నార‌ని ఆలోచ‌న చేస్తే.. ఒక పెద్ద ఫ్రాడ్ బ‌య‌ట‌ప‌డింది. ముఖ్య‌మంత్రి బినామీ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. జ‌న‌వ‌రి 23న కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేంటంటే.. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీ కేఎల్ఎస్ఆర్ రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీ. ఈ కంపెనీ బినామీ బాగోతం బ‌య‌ట‌ప‌డ‌డంతో సుప్రీం నోటీసులు జారీ చేసింది. దివాళా తీసిన కంపెనీకి రూ. 6 వేల కోట్ల టెండ‌ర్లు ఎలా క‌ట్ట‌బెట్టారు.. ఈ ప్రాజెక్టులు ఎక్క‌డ్నుంచి వ‌చ్చాయ‌ని ఆరా తీస్తే తెలంగాణ నుంచే వ‌చ్చాయ‌ని తేలింది అని కేటీఆర్ తెలిపారు.

సీఎం సీట్లో కూర్చోని వేల కోట్లు మ‌ళ్లిస్తున్నారు..

రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్ట‌ర్ కాదు ఆయ‌న బినామీ చీఫ్ మినిస్ట‌ర్ అని తెలుసు. ఆయ‌న‌ను వెనుకాల‌ నుంచి ఎవ‌రు న‌డిపిస్తున్నారో తెలుసు. బినామీ చీఫ్ మినిస్ట‌రే కాదు.. బినామీ మాస్ట‌ర్ అని కూడా నిర్ధారించే బాగోతం ఇది. బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన డ‌బ్బును బినామీ కంపెనీలోకి దొడ్డిదారిలో మ‌ళ్లిస్తున్నారు. సీఎం సీట్లో కూర్చోని వేల కోట్లు మ‌ళ్లిస్తున్నారు. 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి మీద ఆయన బంధువులు, దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగాయి. సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిదిది.. వాళ్ళు ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదని చెప్పారు. అప్పుడే కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ రేవంత్ రెడ్డి బినామీది అని తెలిసింది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు తిరిగిన TS07FF0009 అనే కారు కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా టెక్ అనే కంపెనీపై రిజిస్టర్ అయింది. రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డికి కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా, భూపాల్ ఇన్‌ఫ్రా అనే కంపెనీలు పెద్ద ఎత్తున్న డబ్బులు బదిలీ చేశారు అని తేలింది.

ఒత్తిడి భ‌రించ‌లేక త‌ప్పుకున్న‌ జ‌డ్జి శ‌ర‌త్ కుమార్

2023 జూలైలో కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ అనే కంపెనీకి మధ్యలో గొడవ జరిగింది.. దీంతో ఇద్దరు కలిసి ఎన్సీఎల్ఏటీని అప్రోచ్ అయ్యారు . 2023 నుంచి వాటి మీద విచారణ జరుగుతంది. రేవంత్‌కు ఎన్ని అప‌స‌వ్య బుద్ధులు ఉన్నాయో.. ఈ కంపెనీకి కూడా అన్ని అప‌స‌వ్య బుద్ధులు ఉన్నాయి. అయితే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని 2025 ఆగ‌స్టు 13న ఎన్సీఎల్ఏటీ జడ్జి శరత్ కుమార్‌కు మేసేజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జడ్జి గారే చెప్పి, ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, నేను తప్పుకుంటున్నానని తెలియజేశారు. ఈ విష‌యం అన్ని వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

కారు కూడా మార్చిన‌ట్టు ఉన్నాడు..

2018లో ఐటీ త‌నిఖీల్లో కేఎల్ఎస్ఆర్ బినామీ కంపెనీ అని బ‌య‌ట‌ప‌డింది. సాయి మౌర్య కంపెనీలోకి డ‌బ్బులు పంపి.. రియ‌ల్ ఎస్టేట్ చేసి ఆ లాభాల‌ను భూపాల్ ఇన్‌ఫ్రా కంపెనీలోకి మ‌ళ్లించారు. ఈడీ, ఐటీ రైడ్ చేస్తే ఈ కంపెనీ బినామీ రేవంత్ రెడ్డి అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య‌న కారు కూడా మార్చిన‌ట్టు ఉన్నారు. రేవంత్ సీఎం కాగానే ఈ కంపెనీల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య‌కాలంలో 6 వేల కోట్ల ప్రాజెక్టులతో పాటు అమృత్ స్కీం, జ‌ల్ జీవ‌న్ మిష‌న్, యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు మాకు వ‌చ్చాయ‌ని పేర్కొంది కేఎల్ఎస్ఆర్ త‌మ కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంద‌ని కేటీఆర్ తెలిపారు.

కేఎల్ఎస్ఆర్ కంపెనీలో పేర్కొన్న కొన్ని టెండ‌ర్లు

మెద‌క్‌లో ఆర్ అండ్ బీలో రూ. 116 కోట్ల ప‌నులు
షాద్‌న‌గ‌ర్ - ప‌రిగి రోడ్డుకు రూ. 135 కోట్లు
సూర్యాపేట మోతెలో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్స్‌కు రూ. 1910 కోట్లు
రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీం(కోదాడ‌) - రూ. 320 కోట్లు
కొడంగ‌ల్‌లో వెట‌ర్న‌రీ సైన్స్ కాలేజీకి రూ. 145 కోట్లు
హెచ్ఎండ‌బ్ల్యూఎస్‌కు రూ. 168 కోట్ల ప‌నులు.

ఇలా రూ. 6 వేల కోట్ల ప‌నులు కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అప్ప‌జెప్పారు. ఈ కంపెనీ దివాళా తీసినప్ప‌టి నుంచి ఎన్సీఎల్ఏటీలో విచార‌ణ జ‌రుగుతుంది. 2023 జులై నుంచి ఈ కంపెనీ వ‌ద్ద డ‌బ్బుల్లేవు. కంపెనీ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు బ్యాంకుల వ‌ద్ద రూ. 15 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నారు. అలాంటి కంపెనీకి రూ. 6 వేల కోట్ల పనులు వ‌చ్చాయంటే ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

క‌మీష‌న్ల కోస‌మా..? అక్ర‌మ సంపాద‌న దారి మ‌ళ్లించేందుకా..?

రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఫ్రాడ్ మీద సీబీఐ, ఎస్ఎఫ్ఐవో, ఈడీ ద్వారా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ దొంగ, కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి దొంగ వారి బినామీ బాగోతం బయటకు రాకుండా దావోస్ నుండి విచారణలు అని డైవర్షన్ నడిపారు. ప్ర‌జ‌ల ముందు పార‌ద‌ర్శ‌కంగా ఈ కుంభ‌కోణాన్ని ఉంచుతున్నాం. దివాళా తీసిన కంపెనీకి ఎలా ప‌నులు ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాం. వేల కోట్ల కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాం. వీటిన్నంటికి సీఎం స‌మాధానం చెప్పాలి. దివాళా తీసిన కంపెనీతో సంబంధాలు ఎందుకు.. క‌మీష‌న్ల కోసమా..? అక్ర‌మ సంపాద‌న దాంట్లోకి తోయ‌డానికా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

రూ. 6 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం..

కంపెనీ వెబ్‌సైట్‌లో అన్ని ప‌నులు ఓపెన్‌గా ఉన్నాయి. దివాళా తీసిన కంపెనీకి బ్యాంకు గ్యారెంటీలు ఎక్క‌డ్నుంచి వ‌చ్చాయి.. రూపాయి లేని కంపెనీ.. ఉద్యోగుల జీతాల కోసం అప్పు తీసుకున్న కంపెనీకి వంద‌ల కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు ఎలా స‌మ‌ర్పించింది. ఎవ‌రి ఆదేశాల మేర‌కు ఇన్ని కోట్ల వ‌ర్కులు ఈ కంపెనీకి వ‌చ్చాయో రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్య‌వ‌హారం కాదు. రూ. 6 వేల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసిన ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

సిగ్గు, ల‌జ్జ ఉంటే కాంట్రాక్టులు ర‌ద్దు చేయాలి..

బినామీ సంస్థ కాక‌పోతే నిధులు ఎలా వ‌చ్చాయి..? ఇందులో సీఎం పాత్ర ఏందో తేలాలి. సిగ్గు ల‌జ్జ ఉంటే త‌క్ష‌ణ‌మే కేఎల్ఎస్ఆర్ కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. వ‌ర్కుల‌ను నిలిపివేయాలి. దాంతో పాటు సుప్రీం కోర్టు విచార‌ణ పూర్త‌య్యే దాకా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో వ‌ర్కు ఇవ్వ‌కుండా బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో వెంట‌నే రంగంలోకి దిగాలి. నిజంగా కిష‌న్ రెడ్డి రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట వాస్త‌వం కాక‌పోతే వెంట‌నే సీబీఐ, ఈడీ ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగి కేఎల్ఎస్ఆర్‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాలి. కేంద్రం వేంగంగా స్పందించాల్సిన‌ బాధ్య‌త ఉంది. ఇప్ప‌టికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి 10 రోజులు అయిందని కేటీఆర్ గుర్తు చేశారు.

ఆ మూడింటిని రంగంలోకి దింపాలి..

ముఖ్యమంత్రి నాలుగైదు రోజులు దావోస్‌లో మాయమయ్యారని వార్తలు వచ్చాయి.. మరి బినామీ సంస్థలతో బాగోతాలు చేయడానికి పోయారో, లేదా ఇంక దేనికైనా పోయారో రేవంత్ రెడ్డినే చెప్పాలి. రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షులుగా ఉన్న‌ప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోప‌ణ‌లు చాలా చేశారు. ఇవాళ ఆధారాల‌తో స‌హా బాధ్య‌త గ‌ల ప్రతిప‌క్షంగా మాట్లాడుతున్నాం. కేంద్రం వెంట‌నే స్పందించి సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవోను రంగంలోకి దింపాల‌ని కోరుతున్నాం. కేఎల్ఎస్ఆర్‌పై సమ‌గ్రంగా విచార‌ణ జ‌రిపి, ప్ర‌తి కాంట్రాక్టును ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక్క తెలుగు ప‌త్రిక కూడా రాయ‌లేదు..

ఈ వ్య‌వ‌హారంపై ఏ ఒక్క తెలుగు ప‌త్రిక కూడా రాయ‌లేదు. కేవ‌లం సియాస‌త్ ప‌త్రిక మాత్ర‌మే రాసింది. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీరు ఈ తీవ్ర‌మైన ఆర్థిక నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకోక‌పోతే మ‌రింత చెల‌రేగిపోతారు. మీరు కూడా ఇలాంటి కుంభ‌కోణాల‌ను ప్ర‌జ‌ల దృష్టికి తీసుకురావాల‌ని కోరుతున్నాం అని కేటీఆర్ తెలిపారు.

స్పీక‌ర్ గాంధారి ప్ర‌సాద్ కుమార్

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోర్టులో తేల్చుకుంటాం. ఇది ఒక కామెడి సీరియ‌ల్ లాగా ఉంది. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌కు స్వ‌యంగా సీఎం రేవంత్ రెడ్డినే కండువా క‌ప్పిండు. ఆయ‌న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కాదు.. గాంధారి ప్ర‌సాద్ కుమార్. ఆయ‌న క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుండు. ఆయ‌నంటే నాకు గౌర‌వం.. 20 ఏళ్ల మిత్రుడు మా ప్ర‌సాద్ అన్న‌. సీఎం ఒత్తిడి, ప్ర‌భావం ప‌ని చేస్తుంది. సీఎం ఒత్తిడికి ఆయ‌న‌ గాంధారి ప్ర‌సాద్ అయిపోయిండు.. కండువా క‌ప్పింది కూడా క‌న‌బ‌డుత‌లేదు అంటే మేం ఏం చేయాలి. కోర్టుకు పోతాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement