త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

KCR | తెలంగాణ ఉద్యమం సాగింది, త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, సాగునీరు తాగునీరు కోసమేనని, తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టులపై చేసినవి దుష్ప్రచారాలనీ, కుట్ర పూరితంగానే నీటిని ఎత్తిపోయడం లేదనే వాస్తవం ఎన్డీఎస్ఏ ప్రకటనతో స్పష్టమైపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.

S

Telangana | Published On Sep 6, 2026, 8.42 pm IST

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

సంక్షిప్త సారాంశం

కాళేశ్వ‌రం ప్రాజెక్టును వాడుకోవచ్చని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేయడంపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పండ బెట్టడంపై ఆవేదన వ్య‌క్తం చేశారు. సాగునీటిని ఎత్తిపోయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా,విడుదల చేయకుండా ప్రజలను రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయడంపై కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీరు తాగునీటి సరఫరాపట్ల జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహించారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటానికి రైతులు, కార్యకర్తలు సహా లక్షలాదిమందితో క్షేత్రస్థాయిలో పోరాటానికి అధినేత కేసిఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం పాలన మూడేళ్లు కావస్తున్నది.. ఇక మౌనాన్ని వీడుదామ‌ని పార్టీ నేత‌ల‌కు అధినేత పిలుపునిచ్చారు.

Advertisement

లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ

KCR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్యమం సాగింది, త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, సాగునీరు తాగునీరు కోసమేనని, తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టులపై చేసినవి దుష్ప్రచారాలనీ, కుట్ర పూరితంగానే నీటిని ఎత్తిపోయడం లేదనే వాస్తవం ఎన్డీఎస్ఏ ప్రకటనతో స్పష్టమైపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సహించేది లేదన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాపంటలకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద జల యుద్ధానికి సిద్ధం కావాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో కలిసి కూర్చొని చర్చించి త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.

సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశాన్ని ఆదివారం నాడు ఎర్రవెల్లిలో నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా సమస్యలపై చర్చా వేదికగా కాకుండా బూతు కూతలకు వేదికగా మార్చడం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ సభ్యులను సభలో తూలనాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని ఉభయ సభల్లో తిప్పి కొట్టాలని పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ జలాలను తెలంగాణ రైతాంగానికి అందకుండా పక్కరాష్ట్రం ఉపయోగించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా తొంభై శాతం పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేసినా, కృష్ణా జాలాలను ఎత్తిపోసి నల్గొండ పాలమూరూ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీటిని ఎందుకు అందించలేక పోతున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డ దగ్గర చిన్న రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగళంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల్లో రైతాంగం పంటలు పండించుకుంటారని, మరి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరో ప్రజలకు స్పష్టం చేయాలని కాంగ్రేస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ నిలదీశారు. కాళేశ్వరంపై ఇదే పద్ధతిలో నిర్లక్ష్యం వహిస్తే, అన్యాయానికి గురవుతున్న రాష్ట్ర రైతాంగానికి సాగునీటి కోసం తానే స్వయంగా లక్షలాది మందితో కార్యాచరణ ప్రకటిస్తానని, సాగునీటి కోసం తిరిగి మరో యుద్ధానికి సిద్ధమౌదామని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా, సోమవారం నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత పలు సలహాలు సూచనలు ఇస్తూ సుదీర్ఘ చర్చ జరిపారు.

చర్చకు సంబంధించి ముఖ్యమైన అంశాలు :

వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలను, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వెయ్యి రోజుల కాంగ్రేస్ పాలనా వైఫల్యం మీద బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల అధినేత సంతృఫ్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను పార్టీ ముఖ్యనేతలను జిల్లా నాయకత్వాన్ని కార్యకర్తలను పార్టీ అథ్యక్షులు కేసీఆర్ అభినందించారు. పేద ప్రజల సంక్షేమం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నదనే విషయాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి

గ్రామాలు పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లల వివాహాలు, దవాఖాన ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా తమ భూమిని అమ్ముకోవడానికి వీలు లేక ప్రజలు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మీద ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పంటి ప్రాజెక్టుల్లో నీళ్లు వున్నా తెలంగాణ రైతాంగానికి ఎందుకు విడుదల చేయట్లేదనే విషయం మీద ప్రభుత్వాన్ని పట్టు పట్టాలని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, మిషన్ భగీరథ వంటి తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి అని కేసీఆర్ దుయ్యబట్టారు. ఇదే విషయాన్ని సభాముఖంగా నిలదీయాలన్నారు.

పాలిటెక్నిక్ విద్యను భ్ర‌ష్టు పట్టించే విధంగా జీవో 97

నిరుపేదల పిల్లలు ఉన్నత చదువులు చదువుతూ, వారి భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకునే క్రమంలో అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం పట్ల కెసిఆర్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల పై విద్యార్థుల పక్షాన అసెంబ్లీ వేదికగా పోరాడాలన్నారు. పాలిటెక్నిక్ విద్యను భ్ర‌ష్టు పట్టించే విధంగా జీవో 97ను తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సభ్యులకు కేసీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు, వృత్తి నైపుణ్యాన్ని సొంతం చేసుకుని భవిష్యత్తు ఉపాధిని సంపాదించుకుంటారని, అట్లా పలు రంగాలకు సంబంధించిన సాంకేతిక వృత్తి విద్యను అందించే పాలిటెక్నిక్ ను స్వార్థ ప్రయోజనాల కోసం ఫణంగా పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్నారు.

ఎన్నికలు రాకముందు నిరుద్యోగులను ఉసిగొల్పి..

ఎన్నికలు రాకముందు నిరుద్యోగులను ఉసిగొల్పి, లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని నమ్మపలికిన కాంగ్రెస్ హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇదే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపు హామీలను ప్రశ్నిస్తున్నారని, వారికి మద్దతుగా ఉభయ సభల్లో సభ్యులు గళం విప్పాలని కేసీఆర్ తెలిపారు. నిరుద్యోగ నోటిఫికేషన్ల కోసం జాబ్ క్యాలెండర్ల అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో అత్యంత దుర్మార్గమైన అవినీతి

ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఫార్మా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అత్యంత దుర్మార్గమైన అవినీతి తతంగానికి తెరలేపిందని కేసీఆర్ దుయ్యబట్టారు. ఈ సమస్యమీద ఉభయ సభల్లో ప్రశ్నించాలన్నారు.

సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ సిరుల వెలుగు సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చు మీరిందని, సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉభయసభల్లో పార్టీ సభ్యులు ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ భూములను భవిష్యత్తు తరాల అవసరాలకు ఏమాత్రం మిగిల్చకుండా, తమ ఇష్టా రీతిన అక్రమ అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను నిలదీయాలన్నారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా రాష్ట్ర ఖజానా పై విపరీతమైన భారాన్ని పోపడమే కాకుండా నిర్వహణ చేతగాని పరిస్థితిలోకి నెట్టివేయబడిందని, ఇటువంటి తప్పుడు నిర్ణయాల మీద ఉభయ సభల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలనీ పార్టీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.

ఎత్తిపోయడానికి ఎందుకు అలసత్వం వహిస్తున్నారు

గోదావరి కావేరి నదుల లింకు ప్రాజెక్టు పేరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టానికి ఒడిగడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉభయసభల్లో ప్రశ్నించాలని అన్నారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్య చేస్తున్న ప్రభుత్వ కుట్ర మీద నీటి యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్ర రైతాంగం ప్రజలు సాగునీటి తాగునీటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసినా, ఎత్తిపోయడానికి ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నిలదీశారు. ఇదే విషయం మీద ఉభయ సభలను స్తంభింప చేయాలని కెసిఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై తాను త్వరలో పార్టీ ముఖ్య నేతలతో జిల్లా నేతలతో చర్చించి లక్షలాది మందితో కార్యాచరణను చేపట్టనున్నట్టు కేసీఆర్ పునరుద్ఘాటించారు.

బాలికలు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర ఆందోళన

విద్యా రంగంలో అనాలోచిత నిర్ణయాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే కుట్ర చేస్తూ, రాష్ట్ర విద్యా విధానానికి విఘాతం కలిగిస్తున్నారనీ కేసీఆర్ అన్నారు. గురుకులాలను అత్యంత గొప్పగా, ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దిన చరిత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీకి తట్టుకొని, ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని, సుందరమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ బీసీలకు వేలాది గురుకులాలను స్థాపించి తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. అటువంటి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, బాలికలు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా విధానం క్షీణించడం పట్ల అసెంబ్లీ, మండలి వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అధినేత దిశా నిర్దేశం చేశారు.

మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు పెరిగిపోతున్న‌య్

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయనీ, శాంతి భద్రతల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిలదీయాలన్నారు. బంధుప్రీతి ఆశ్రితపక్షపాతంతో మునిగిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిమయంగా రాష్ట్ర పాలనను కొనసాగిస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాల మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అటు అసెంబ్లీలో ఇటు మండలి లో, ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు.

ఉచిత విద్యుత్తకు ఎసరు

ఉచిత విద్యుత్తకు ఎసరు పెట్టే విధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న నిర్ణయాలను వినియోగదారుల పై తీవ్రమైన ప్రభావం చూపుతుందనీ కేసీఆర్ అన్నారు. అడ్డగోలుగా వస్తున్న బిల్లులు చెల్లించలేక పేదలు, మధ్యతరగతి ఇప్పటికే బాధలు పడుతున్నారని, విద్యుత్ సరఫరా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిందని, రైతు డిస్కం ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ని ఎత్తివేసే కుట్ర దాగి ఉన్నదని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విద్యుత్ విధానాలపై ఉభయ సభల్లో నిలదీయాలన్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల త‌ర‌పున అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలి

రిటైర్ అయిన ఉద్యోగులకు వారి ఉద్యోగ విరమణ సందర్భంగా చెల్లించాల్సిన పిఎఫ్ వంటి నిధులను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు అన్నారు. తమ జీవితకాలం నిర్వర్తించిన వృత్తిలో దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాట్లేవని, కొంతమంది డబ్బు అందక మరణించిన వార్తల పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ సమస్యల గురించి అడిగితే రెండేండ్ల పాటు ఏమీ అడగవద్దు అనడం అన్యాయమని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు ,రిటైర్ ఉద్యోగుల సమస్యలు, పిఆర్సి పెండింగ్ వంటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన బి ఆర్ ఎస్ ఎల్ పి సంయుక్త సమావేశంలో, రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రగతి పరిస్థితిపై కేసీఆర్ లోతుగా చర్చించారు. ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయాలని అధినేత కెసిఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అధినేత కేసిఆర్ తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, శానసభాపక్ష ఉప నేతలు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మండలి ఉపనాయకులు ఎమ్మెల్సీలు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement