త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malvika Sharma | ఇంత ప్రేమ ద‌క్కుతుంద‌ని ఊహించ‌లేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!

Malvika Sharma | మాళవిక శర్మకు ఈ ఓన‌మ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మలయాళ చిత్రసీమలోకి ఆమె తొలిసారి అడుగుపెట్టింది. వైశాఖ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖలీఫా’లో ఫిజా పాత్రలో కనిపించింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన అమీర్‌ అలీ పాత్రకు భార్యగా నటించింది. కొత్త భాష.. కొత్త చిత్ర పరిశ్రమ.. అయినప్పటికీ కేరళలో తనకు లభించిన ఆదరణ మాళవికను ఆశ్చర్యపరిచింది.

P

Entertainment | Published On Sep 6, 2026, 6.30 pm IST

Malvika Sharma | ఇంత ప్రేమ ద‌క్కుతుంద‌ని ఊహించ‌లేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!
Advertisement

Malvika Sharma | మాళవిక శర్మకు ఈ ఓన‌మ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మలయాళ చిత్రసీమలోకి ఆమె తొలిసారి అడుగుపెట్టింది. వైశాఖ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖలీఫా’లో ఫిజా పాత్రలో కనిపించింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన అమీర్‌ అలీ పాత్రకు భార్యగా నటించింది. కొత్త భాష.. కొత్త చిత్ర పరిశ్రమ.. అయినప్పటికీ కేరళలో తనకు లభించిన ఆదరణ మాళవికను ఆశ్చర్యపరిచింది. ‘కేరళలో ఇంత ప్రేమ దక్కుతుందని నిజంగా ఊహించలేదు’ అని ఆమె చెప్పింది. ‘ఖలీఫా’ థియేటర్‌ సందర్శనల సందర్భంగా ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ఈ అనుభవం మలయాళంలో మరిన్ని సినిమాలు చేయాలనే ఆసక్తిని తనలో పెంచిందని పేర్కొంది. గతేడాది ఆగ్రాలో ఉన్న సమయంలో ‘ఖలీఫా’ అవకాశం తన వద్దకు వచ్చిందని మాళవిక గుర్తుచేసుకుంది. మలబార్‌ ప్రాంత మహిళలు దుపట్టా ధరించే విధానంలో తాను ఉన్న ఫొటోను పంపించాలని తొలుత అడిగారని, ఆ తర్వాత దర్శకుడు వైశాఖ్‌ నుంచి కథనం, పాత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నానని చెప్పింది. ‘ఫిజా లాంటి పాత్రను ఇంతకుముందు నా సినిమాల్లో ఎప్పుడూ చేయలేదు. పృథ్వీరాజ్‌ సర్‌తో కలిసి నటిస్తూ మలయాళంలో అరంగేట్రం చేయడం, సినిమాలో మోహన్‌లాల్‌ సర్‌ కూడా ఉండటం.. నా తొలి సినిమాకు చాలా ప్రత్యేకతను తీసుకొచ్చింది’ అని మాళవిక తెలిపింది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం ఒక కొత్త అనుభూతినిచ్చిందని చెప్పిన ఆమె.. మలయాళ సినిమా సెట్స్‌పై కనిపించిన క్రమశిక్షణను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అక్కడ ప్రతిదీ సమయానికి జరుగుతుంది. ప్రతి విషయం ముందుగానే సరిగ్గా షెడ్యూల్‌ చేస్తారు. ఎలా ప్లాన్‌ చేస్తారో అలాగే అమలు చేస్తారు. అది నాకు చాలా మంచి అనుభవం’ అని చెప్పింది.

మలయాళం అర్థం కాకపోతే పృథ్వీరాజ్‌ సాయం

భాష తెలియకపోవడం ‘ఖలీఫా’ సమయంలో మాళవికకు ఎదురైన ప్రధాన సవాలు. అయితే, ఈ విషయంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తనకు ఎంతో సహకరించారని ఆమె వెల్లడించింది. ‘ఆయన నిజంగా చాలా సింపుల్‌గా, అణకువగా ఉంటారు. చాలా సహకరిస్తారు. ఇతర నటీనటులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని పృథ్వీరాజ్‌ గురించి చెప్పింది. ఒక సన్నివేశం అర్థం కాకపోయినా, దాని నేపథ్యం తెలియకపోయినా, మలయాళ డైలాగ్‌ అర్థం కాకపోయినా పృథ్వీరాజ్‌ స్వయంగా సమయం తీసుకుని వివరించేవారని తెలిపింది. ‘పృథ్వీరాజ్‌ సర్‌ తన నటన గురించి మాత్రమే కాకుండా అందరూ బాగా నటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా చూసుకునేవారు’ అని మాళవిక చెప్పింది. దర్శకుడు వైశాఖ్‌ కూడా తన పాత్రను ఎలా చేయాలనే విషయంలో స్పష్టత ఇచ్చారని తెలిపింది. తెలుగు సినిమాల్లో నటన కొంత ఎక్కువ ‘మసాలా’తో ఉంటుందని, మలయాళంలో మాత్రం భావాలను చాలా సున్నితంగా, ముఖ్యంగా కళ్ల ద్వారా వ్యక్తీకరించాలని వైశాఖ్‌ చెప్పినట్టు మాళవిక గుర్తుచేసుకుంది.

మలయాళ సినిమాలపై ఆసక్తి

‘ఖలీఫా’కు ముందు మలయాళ చిత్రసీమతో తనకు పెద్దగా పరిచయం లేదని మాళవిక తెలిపింది. దృశ్యం, ఆడు జీవితం, ‘కుంబళంగి నైట్స్‌ వంటి కొన్ని సినిమాలు మాత్రమే చూసినట్లు చెప్పింది. అయితే ‘ఖలీఫా’ అనుభవం తర్వాత మలయాళ సినిమాలను మరింతగా అన్వేషించాలని ఉందని పేర్కొంది. దుల్కర్‌ సల్మాన్‌, టొవినో థామస్‌, నివిన్‌ పౌలీ వంటి నటులతో కలిసి పనిచేయాలని తన కోరికను వెల్లడించింది. మాళవికకు ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే చేసింది. 2018లో ‘నేల టికెట్‌’తో వెండితెరకు పరిచయమైన ఆమె.. ఇప్పటివరకు తెలుగులో మూడు సినిమాలు చేసింది. 2022లో సుందర్‌ సీ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ‘కాఫీ విత్‌ కాదల్‌’తో తమిళంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో జీవాతో కలిసి నటించింది. తమిళ సినిమా సెట్‌ కూడా తనకు ఎంతో నచ్చిందని మాళవిక చెప్పింది. పెద్ద తారాగణం ఉన్నప్పటికీ షూటింగ్‌ మధ్యలో అందరూ కలిసి సరదాగా గడిపేవారని గుర్తుచేసుకుంది. సుందర్‌ సీ, ఖుష్బూ కారణంగా అక్కడి వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉండేదని తెలిపింది. ‘వర్క్‌.. ఫన్‌.. మళ్లీ వర్క్‌.. మళ్లీ ఫక్. చాలా ప్రశాంతమైన వాతావరణం. వచ్చి మీలాగే ఉండండి.. ఎలాంటి సంకోచం లేకుండా ఉండండి అన్నట్టుగా ఉండేది’ అని ఆమె గుర్తుచేసుకుంది. తమిళ భాష విషయంలోనూ తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది. జీవా తనకు మైమ్‌ చేయడం నేర్పించారని, టేక్‌కు కొద్దిసేపటి ముందు స్క్రిప్ట్‌ ఇచ్చిన సందర్భాల్లో డైలాగ్‌లు నేర్చుకోవడానికి కొంత సమయం పట్టేదని తెలిపింది. పొడవైన డైలాగ్‌లు ఉన్నప్పుడు వాటిని ఎలా చెప్పాలో, తమిళ పదాలను ఎలా ఉచ్చరించాలో సుందర్‌ సీ ఓపికగా వివరించేవారని మాళవిక చెప్పింది.

ధనుష్‌, సూర్యతో నటించాలన్న కోరిక

ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని మాళవిక తెలిపింది. అయితే తమిళంలో మాత్రం ప్రస్తుతానికి ఏ సినిమా ఖరారు కాలేదని చెప్పింది. తమిళంలో తన కోరికల గురించి మాట్లాడుతూ ధనుష్‌తో కలిసి పనిచేయాలని ఉందని వెల్లడించింది. ‘ధనుష్‌ సర్‌ పనిని నేను నిజంగా ఎంతో అభిమానిస్తాను’ అని చెప్పింది. సూర్య కూడా తనతో కలిసి పనిచేయాలనుకునే నటుల జాబితాలో ఉన్నారని తెలిపింది. దర్శకుడు మణిరత్నంతో పనిచేయడం తన కల అని మాళవిక వెల్లడించింది. ‘అది ఎప్పుడైనా జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ మణిరత్నం సర్‌తో పనిచేయడం నా కల’ అని చెప్పింది.

నటనతో పాటు న్యాయ విద్య

మాళవిక జీవితంలో నటనతో పాటు న్యాయ విద్యకూ ముఖ్యమైన స్థానం ఉంది. ఈ ఏడాది ఎల్‌ఎల్‌బీ, క్రిమినల్‌ లాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసింది. తాను నటనలోకి రావడానికి ఒక కారణం చదువు ఫీజులు చెల్లించుకోవడమేనని ఆమె చెప్పింది. ఎంట్రన్స్‌, ఎల్‌ఎల్‌బీ ఫీజుల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే మొదట నటనను ప్రారంభించినట్లు వెల్లడించింది. తాను కమర్షియల్స్‌లో నటించడం ప్రారంభించిన విషయం తన తండ్రికి తొలుత తెలియదని చెప్పింది. న్యాయశాస్త్రం చదవడానికీ ఆయన మొదట్లో వ్యతిరేకించారని తెలిపింది. అమ్మాయి న్యాయవాద వృత్తిలో ఉంటే పెళ్లికి ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం కుటుంబంలో ఉండేదని వివరించింది. వినోద రంగంలోకి రావడాన్నీ కుటుంబం తొలుత వ్యతిరేకించిందని, అయితే కాలక్రమంలో వారు దానికి అలవాటు పడ్డారని చెప్పింది. భవిష్యత్తులో న్యాయవాద వృత్తిలోకి తిరిగి వెళ్లే అవకాశాలున్నాయని మాళవిక పేర్కొంది. అయితే, నటన, న్యాయవాద వృత్తిని ఒకేసారి కొనసాగించడం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడింది. ‘బహుశా నాకు 40 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ చేయవచ్చు’ అని చెప్పింది. న్యాయ విద్య తన వ్యక్తిత్వంపై కూడా ప్రభావం చూపిందని మాళవిక తెలిపింది. ఆ చదువు తనను మరింత ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేసిందని చెప్పింది.

‘హీరోయిన్‌ కావాలని కాదు.. మంచి నటి కావాలి’

సినిమా రంగంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయినప్పటికీ తన లక్ష్యం మాత్రం మారలేదని మాళవిక చెబుతోంది. ‘నేను ఎప్పుడూ హీరోయిన్‌ కావాలని అనుకోలేదు. మంచి నటిగా ఉండాలని మాత్రమే అనుకున్నాను. బలమైన పాత్రలు రావాలి. నటిగా నిరంతరం ఎదుగుతూ ఉండాలి’ అని ఆమె చెప్పింది. తన దృష్టిలో విజయమంటే పెద్ద స్థాయి సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు దక్కించుకోవడమేనని ఆమె మాటల్లో స్పష్టమవుతోంది. మాళవిక తాజాగా మరో కొత్త భాషలోకి అడుగుపెడుతోంది. గణేశ్‌ సరసన నటిస్తున్న ‘బృందవిహారి’తో కన్నడ చిత్రసీమలోకి ఆమె పరిచయం కానుంది. ఈ సినిమాలో మీరా అనే కృష్ణ భక్తురాలి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రకు భిన్నమైన కోణాలు ఉన్నాయని, తనకు ఇది చాలా సవాలుతో కూడుకున్న పాత్ర అని మాళవిక తెలిపింది. ‘ఇది నాకు చాలా సవాలుతో కూడుకున్న, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’ అని ఆమె చెప్పింది. తెలుగుతో మొదలైన మాళవిక శర్మ సినీ ప్రయాణం.. తమిళం, మలయాళం మీదుగా కన్నడ వరకు సాగుతోంది. భాష మారుతున్న కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతున్నా, బలమైన పాత్రల్లో నటిస్తూ నటిగా ఎదగాలన్న లక్ష్యం మాత్రం తనలో అలాగే ఉందని మాళవిక చెబుతోంది.

 

Advertisement
Advertisement