త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Organ Donation Telangana | రోడ్డు ప్రమాదంలో కొడుకు బ్రెయిన్ డెడ్.. పుత్రశోకంలోనూ నలుగురికి పునర్జన్మనిచ్చిన తండ్రి

రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల కొడుకు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆ యువకుడి అవయవదానం నలుగురికి పునర్జన్మ నిచ్చింది.

J

Telangana | Published On May 19, 2026, 7.04 pm IST

Organ Donation Telangana | రోడ్డు ప్రమాదంలో కొడుకు బ్రెయిన్ డెడ్.. పుత్రశోకంలోనూ నలుగురికి పునర్జన్మనిచ్చిన తండ్రి
Advertisement

Organ Donation Telangana | త్రినేత్ర.న్యూస్ : చేతికొచ్చిన కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారితే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా రగిలిపోతుందో మాటల్లో చెప్పలేం. కానీ, అలాంటి పుత్రశోకంలో ఉండి కూడా ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. మరణానంతరం కూడా తన కొడుకు పది కాలాల పాటు బతకాలనే ఉద్దేశంతో.. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ (Brain dead) అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మ నిచ్చాడా తండ్రి.

ప్రమాదం జరిగిందిలా..

నల్గొండ (Nalgonda) జిల్లా ఆలేరుకు చెందిన పులిపలుపుల మహేష్ కొడుకు రాఘవ (20) జనగామలోని సీజేఐటీ (CJIT) ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మే 16న టూవీలర్‌పై వెళ్తున్న రాఘవ.. చేర్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి తలకి తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ (Hyderabad) లోని మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. మే 18న రాఘవ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

నిర్ణయం మార్చుకోని తండ్రి.. 4 ప్రాణాలు నిలబెట్టిన దానం

కొడుకు ఇక లేడన్న వార్తతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కానీ, ఆ తండ్రి మహేష్ గుండె నిబ్బరం చేసుకున్నారు. జీవన్‌దాన్ (Jeevandan Telangana) ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో తన కొడుకు అవయవాలను దానం (Organ Donation) చేసేందుకు అంగీకరించారు.

మొత్తంగా కిడ్నీలు - 02, లివర్ - 01, ఊపిరితిత్తులు (Lungs) - 01 అవయవాల దానం ద్వారా చావుబతుకుల మధ్య ఉన్న నలుగురు పేషెంట్లకు రాఘవ ప్రాణదానం చేశాడు. ఈ ఉదారమైన నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులకు తెలంగాణ జీవన్‌దాన్ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

అపోహలు వీడండి: సజ్జనార్ ట్వీట్

ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాఘవ కుటుంబాన్ని ఆయన ప్రశంసించారు.

"రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రాఘవ అనే యువకుడు, తన అవయవాల దానం ద్వారా నలుగురికి పునర్జన్మనిచ్చారు. పుత్రశోకంలో ఉండి కూడా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం మరణానంతరం కూడా జీవించవచ్చని నిరూపించింది. ప్రజలంతా అవయవదానంపై అపోహలు వీడండి.. ప్రాణదాతలుగా నిలవండి" అని సజ్జనార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరణం తర్వాత మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేయడం ద్వారా మరికొన్ని ప్రాణాలను నిలబెట్టవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Advertisement
Advertisement