త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Vehicles Future India | భారత్‌లో ‘ఈవీ’ సునామీ.. 2050 నాటికి భారత రోడ్లపై 100 శాతం ఈవీ వాహనాలు

పెట్రోల్ ధరల మంటతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు పరుగులు తీస్తున్నారు. 2030 నాటికి దేశంలో 80 శాతం బైక్‌లు ఈవీలే

J

Automobiles | Published On May 20, 2026, 11.59 pm IST

Electric Vehicles Future India | భారత్‌లో ‘ఈవీ’ సునామీ.. 2050 నాటికి భారత రోడ్లపై 100 శాతం ఈవీ వాహనాలు
Advertisement
  • 2030 నాటికి పెట్రోల్ బైక్‌లు కనుమరుగు
  • 2025 నాటికి భారత్‌లో 23 లక్షలు దాటిన కొత్త ఈవీల విక్రయాలు
  • మార్కెట్లో 8% వాటా కైవసం
  • నిర్వహణ ఖర్చు తక్కువ కావడంతో టూ-వీలర్స్, ఆటోలదే సింహభాగం
  • 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80% ఈవీలే ఉంటాయని అంచనా
  • జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లలో భారీగా బయటపడ్డ లిథియం నిల్వలతో దేశీయ బ్యాటరీ తయారీకి బూస్ట్
  • 'పీఎం ఈ-డ్రైవ్' స్కీమ్ కింద రాయితీలు అందిస్తూ ఈవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం

Electric Vehicles Future India | త్రినేత్ర.న్యూస్ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు మామూలుగా లేదు. మొన్నటి వరకు కేవలం ఒక 'ట్రెండ్' అనుకున్న ఈవీలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పుడు సామాన్యుడి అవసరంగా మారిపోయాయి. పర్యావరణంపై పెరిగిన అవగాహన, ప్రభుత్వ రాయితీలు తోడవడంతో 2025 నాటికి దేశంలో ఈవీల అమ్మకాలు ఏకంగా 23 లక్షల మార్కును దాటేశాయి. కొత్తగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఈవీల వాటా ఇప్పుడు 8 శాతానికి చేరుకుంది. భారత ఆటోమొబైల్ రంగంలో నడుస్తున్న ఈ 'నిశ్శబ్ద విప్లవం' మున్ముందు ఎలా ఉండబోతోందంటే..

టూ-వీలర్లదే సింహభాగం

ఈవీ మార్కెట్‌లో కార్ల కంటే టూ-వీలర్స్ , ఆటోలదే పైచేయిగా ఉంది. ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు కేవలం 20-30 పైసలకే పడిపోతుండటంతో మిడిల్ క్లాస్ ప్రజలు వీటిని ఎగబడి కొంటున్నారు. ఓలా, టీవీఎస్, ఎథర్, బజాజ్ వంటి కంపెనీలు మార్కెట్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే బైక్‌లలో 80 శాతం ఈవీలే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

దేశంలో ఉన్న మొత్తం వాహనాలు ఎన్ని?

ప్రస్తుతం దేశంలోని మొత్తం రిజిస్టర్డ్ వాహనాలు సుమారు 40 కోట్లు (400 మిలియన్లు) దాటాయి. వాటిలో రహదారులపై ఉన్న ఈవీల శాతం కేవలం 1.46% మాత్రమే. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 100 కొత్త వాహనాలలో దాదాపు 8.5% వాహనాలు ఎలక్ట్రిక్ రకానికి చెందినవే ఉంటున్నాయి. మొత్తం 40 కోట్ల వాహనాలలో ఇప్పటికీ సాంప్రదాయ ఇంధన వాహనాలదే పైచేయిగా ఉంది. దశాబ్దాలుగా కొనుగోలు చేసిన పాత బండ్లు ఇంకా వాడుకలో ఉండటమే దీనికి కారణం. దేశంలో శరవేగంగా పెరుగుతున్న ఈవీల మొత్తం సంఖ్య ప్రస్తుతం 56 లక్షలు దాటింది. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే కొత్త వాహనాలలో ఈవీల వాటాను 30% కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో 75% కంటే ఎక్కువ పెట్రోల్ వాహనాలే ఉన్నాయి. వీటి సంఖ్య సుమారు 30 కోట్లకు పైగా ఉంది. ఇందులో 21 కోట్ల వరకు ద్విచక్ర వాహనాలు (టూ వీలర్స్) ఉన్నాయి.
డీజిల్ వాహనాలు దాదాపు 15% నుండి 18% వరకు ఉన్నాయి. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు వంటి భారీ వాణిజ్య వాహనాలతో పాటు పెద్ద SUV కార్లు అన్నీ కలిపి సుమారు 6 నుండి 7 కోట్లు ఉన్నాయి. పర్యావరణహిత గ్యాస్ ఇంధనాలతో నడిచే ఆటోలు, టాక్సీలు, కార్లు దాదాపు 1.2 నుండి 1.5 కోట్ల వరకు ఉన్నాయి.

ప్రభుత్వ సపోర్ట్.. పీఎం ఈ-డ్రైవ్

కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీల వాడకాన్ని భారీగా ఎంకరేజ్ చేస్తోంది. 'పీఎం ఈ-డ్రైవ్' స్కీమ్ కింద రూ.10,900 కోట్ల కేటాయింపులతో బయ్యర్లకు సబ్సిడీలు ఇస్తోంది. 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే మొత్తం వాహనాల్లో 30 శాతం వాటా ఈవీలే ఉండేలా టార్గెట్ ఫిక్స్ చేసింది.

బ్యాటరీల కోసం చైనా వద్దకెళ్లక్కర్లేదు

ఈవీలకు గుండెకాయ లాంటి బ్యాటరీల తయారీకి లిథియం చాలా ముఖ్యం. ప్రస్తుతం ముడి సరుకు కోసం చైనా లాంటి దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ, మన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లలో బయటపడ్డ భారీ లిథియం నిల్వలతో ఫ్యూచర్ మారిపోనుంది. 'మేడ్ ఇన్ ఇండియా' గిగా-ఫ్యాక్టరీల ద్వారా రాబోయే 5-10 ఏళ్లలో బ్యాటరీల తయారీలో మనం స్వయంసమృద్ధి సాధించనున్నాం. దేశంలో ఈవీ ఇండస్ట్రీపై ప్రస్తుతం 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉండగా, 2030 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరనుంది.

100% ఈవీలు.. ఎప్పటికంటే?

అధిక ధరలు, రేంజ్ ఆందోళన (ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎంత దూరం వెళ్తుందోనన్న భయం), ఛార్జింగ్ స్టేషన్ల కొరత వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇవి సాల్వ్ అవుతాయి. 2040 నాటికి మనం షోరూమ్‌కి వెళ్తే కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. భారీ వాహనాలతో సహా భారత రహదారులపై 100% ఈవీలు తిరగాలంటే మాత్రం 2050 వరకు ఆగాల్సిందే. దానికి తగ్గట్టుగానే స్క్రాపేజ్ పాలసీ ద్వారా పాత వాహనాలను ప్రభుత్వం వదిలించుకుంటోంది.

మొత్తానికి, భారత్‌లో ఈవీలు కేవలం ఒక ఫ్యాషన్ కాదు, అదొక సునామీ లాంటి భవిష్యత్తు అని స్పష్టమవుతోంది!

Advertisement

తాజావార్తలు

Advertisement