త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ల‌.. వ‌దిలేసుకున్న భార‌త్‌..

FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో 1950 ఎడిషన్ భారత ఫుట్‌బాల్‌కు ఒక అపూర్వమైన అవకాశంగా నిలిచింది. 1930లో తొలి వరల్డ్ కప్ నిర్వహించగా, తర్వాత 1934, 1938లో టోర్నమెంట్‌లు జరిగాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి.

S

Sports | Published On Jun 12, 2026, 12.23 pm IST

FIFA World Cup | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ల‌.. వ‌దిలేసుకున్న భార‌త్‌..
Advertisement

FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో 1950 ఎడిషన్ భారత ఫుట్‌బాల్‌కు ఒక అపూర్వమైన అవకాశంగా నిలిచింది. 1930లో తొలి వరల్డ్ కప్ నిర్వహించగా, తర్వాత 1934, 1938లో టోర్నమెంట్‌లు జరిగాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. 1945లో యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఫిఫా ప్రయత్నాలు ప్రారంభించింది. 1946లో జరిగిన ఫిఫా కాంగ్రెస్‌లో బ్రెజిల్ 1950 వరల్డ్ కప్ నిర్వహణకు ముందుకొచ్చింది. యుద్ధం తర్వాత చాలా దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఫిఫా వెంటనే ఆ ప్రతిపాదనను ఆమోదించింది. అయితే ఆర్థిక పరిమితుల కారణంగా టోర్నమెంట్‌ను 16 జట్లకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఆతిథ్య దేశం బ్రెజిల్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ఇటలీకి నేరుగా అర్హత లభించింది. మిగిలిన 14 స్థానాల్లో యూరప్‌కు ఏడు, అమెరికా ఖండానికి ఆరు, ఆసియాకు కేవలం ఒక స్థానం కేటాయించారు.

కార‌ణాలు తెల‌ప‌కుండా తిర‌స్క‌ర‌ణ‌..

ఆసియాలో అత్యంత బలమైన జట్టు జపాన్. కానీ రెండు అణుబాంబుల దాడుల తర్వాత ఆ దేశం పూర్తిగా కోలుకోలేదు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సమయం లేకపోవడంతో ఫిఫా గత ప్రదర్శనల ఆధారంగా ఎంపిక చేసింది. జపాన్ తర్వాత ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బర్మా, భారత్ వరుసలో ఉన్నాయి. మొదటి మూడు దేశాలు పాల్గొనలేమని తెలిపాయి. దీంతో 1950 ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి ఆహ్వానం పొందిన ఏకైక ఆసియా దేశంగా భారత్ నిలిచింది. భారత ఫుట్‌బాల్‌కు అది స్వర్ణావకాశం. వరల్డ్ కప్‌లో పాల్గొనడం ద్వారా దేశంలో ఫుట్‌బాల్‌కు భారీ ప్రోత్సాహం లభించేది. తక్కువ జట్ల పోటీ ఉన్నందున భారత్ మంచి ప్రదర్శన చేసే అవకాశమూ ఉండేది. భారత ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉండేది. అయితే స్పష్టమైన కారణాలు వెల్లడించకుండా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. దీంతో కోట్లాది మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. భారత్‌ను గ్రూప్-3లో స్వీడన్, ఇటలీ, పరాగ్వేతో కలిసి ఉంచారు. అప్పట్లో పరాగ్వే ప్రస్తుతం ఉన్నంత బలమైన జట్టు కాదు. అందువల్ల భారత్ ఆ జట్టును ఓడించే అవకాశం కూడా ఉండేది. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్‌కు చెందిన అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అతిపెద్ద వేదికపై ఆడే అవకాశాన్ని కోల్పోయారు.

ఇప్ప‌టికీ కార‌ణం తెలియ‌దు..

భారత్ ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఏఐఎఫ్‌ఎఫ్ చెప్పిన కారణాలు బలహీనంగానే కనిపించాయి. ప్రయాణ ఖర్చులు భరించలేమని ఒక కారణం చెప్పారు. కానీ ఫిఫా ప్రయాణ ఖర్చుల్లో పెద్ద భాగాన్ని భరించేందుకు అంగీకరించింది. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. జట్టు ఎంపిక, ప్రాక్టీస్‌కు తగిన సమయం లేదని మరో కారణం చెప్పారు. అయితే అదే పరిస్థితి ఇతర దేశాలకు కూడా ఎదురైంది. 1948 ఒలింపిక్స్‌లో భారత్ ఆటగాళ్లు షూస్ లేకుండా ఆడిన నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్‌లో బేర్‌ఫుట్ ప్లేను నిషేధించింది. అయితే అప్పటి భారత కెప్టెన్ శైలెన్ మ‌న్నా ప్రకారం ఆటగాళ్లు షూస్‌ ధరించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, క‌నుక అది కూడా అసలు కారణం కాదని ఆయన చెప్పారు.

బ్రెజిల్‌ను ఓడించిన ఉరుగ్వే..

ప్రముఖ ఫుట్‌బాల్ రచయిత నోవీ క‌పాడియా అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ ప్రాముఖ్యతను ఏఐఎఫ్‌ఎఫ్ సరిగా అర్థం చేసుకోలేదు. ఒలింపిక్స్‌నే అత్యున్నత టోర్నమెంట్‌గా భావించి వరల్డ్ కప్‌ను నిర్లక్ష్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా 1950 వరల్డ్ కప్‌లో మొత్తం ఆసియా ఖండానికే ప్రాతినిధ్యం లేకుండా పోయింది. చివరకు బ్రెజిల్‌లోని భారీ మరకానా స్టేడియంలో జరిగిన నిర్ణాయక మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. లక్షలాది మంది బ్రెజిలియన్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ మ్యాచ్ ఫలితంతో తీవ్రంగా బాధపడిన వారిలో ఒకరు జొవో రామోస్ డో నాసిమెంటో. ఆయన మరెవరో కాదు, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తండ్రి. అప్పుడు కేవలం 10 ఏళ్ల వయసున్న పీలే తన తండ్రికి బ్రెజిల్‌కు వరల్డ్ కప్ గెలిపిస్తానని మాట ఇచ్చాడు. ఏడేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. తర్వాత బ్రెజిల్ మొత్తం ఐదుసార్లు వరల్డ్ కప్ గెలవగా, పీలే అందులో మూడుసార్లు విజేత జ‌ట్టులో ఉన్నాడు.

ఎంతో మంది మేటి ప్లేయ‌ర్లు..

1950లలో హైదరాబాద్‌కు చెందిన ఎంద‌రో ప్ర‌తిభావంతులైన ఆటగాళ్లు భారత జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. కేపీ ధనరాజ్, సయ్యద్ ఖ్వాజా అజీజ్-ఉద్-దిన్, జీఎస్ లాయక్, అబ్దుల్ లతీఫ్, నూర్ మహ్మద్ తదితరులు వరల్డ్ కప్‌లో ఆడే జీవితకాల అవకాశాన్ని కోల్పోయారు. కేపీ ధనరాజ్ 1948 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కోల్‌కతాలోని ఈస్ట్ బెంగాల్ క్లబ్ తరఫున ఆడి ఐఎఫ్‌ఏ షీల్డ్‌ను నాలుగుసార్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. నూర్ మహ్మద్ హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టులో అద్భుత మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీం ప్రణాళికల్లో ఆయన కీలక పాత్ర పోషించేవాడు. అజీజ్‌గా ప్రసిద్ధి చెందిన అజీజ్-ఉద్-దిన్ ఫుల్‌బ్యాక్‌గా అత్యంత బహుముఖ ప్రతిభ కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1951 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1953 ఆసియన్ క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్‌లో కూడా స్వర్ణం సాధించాడు. 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించిన భారత జట్టులో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. 1955లో బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

భార‌త ఫిఫా అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని వాస్త‌వం..

స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీం శిక్షణలో భారత జట్టు 1950లలో అద్భుత ప్రదర్శనలు చేసింది. 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను 1-0తో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. జపాన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు 2026లో ఇరాన్, జపాన్ రెండూ ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడుతుండగా భారత్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవాల్లో ఒకటైన ఫిఫా వరల్డ్ కప్‌లో లేకపోవడం విచారకరం. ఫిఫా అంచనాల ప్రకారం ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్, స్ట్రీమింగ్ వేదికల ద్వారా సుమారు 600 కోట్ల మంది వీక్షించనున్నారు. ఫిఫాకు 211 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సంఖ్య 193 కంటే కూడా ఎక్కువ. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అసాధారణం. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు రెండేళ్ల పాటు జరుగుతాయి. 2026 ఎడిషన్‌కు 48 జాతీయ జట్లు అర్హత సాధించాయి. కురకావో, కేప్ వెర్డే, పనామా, హైటి వంటి చిన్న దేశాలు కూడా పోటీలో ఉన్నాయి. కానీ భారత్ మాత్రం అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. ఫుట్‌బాల్ అభిమానులకు ఈ వాస్తవం ఇప్పటికీ బాధనే మిగులుస్తోంది.

Advertisement
Advertisement