త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WTC | టెస్టుల్లో దక్షిణాఫ్రికా నంబర్‌ వన్‌.. రెండో స్థానానికి ఆస్ట్రేలియా.. టీమిండియా ప్లేస్ ఎక్క‌డ‌?

WTC | టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో టెస్టులో ఆసీస్‌ను 176 పరుగుల తేడాతో చిత్తు చేసిన ప్రొటీస్‌.. ఆ జట్టును రెండో స్థానానికి నెట్టింది.

P

Sports | Published On Oct 31, 2026, 9.50 pm IST

WTC | టెస్టుల్లో దక్షిణాఫ్రికా నంబర్‌ వన్‌.. రెండో స్థానానికి ఆస్ట్రేలియా.. టీమిండియా ప్లేస్ ఎక్క‌డ‌?
Advertisement

WTC | టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో టెస్టులో ఆసీస్‌ను 176 పరుగుల తేడాతో చిత్తు చేసిన ప్రొటీస్‌.. ఆ జట్టును రెండో స్థానానికి నెట్టింది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. భారత్‌ మాత్రం రెండు ర్యాంకింగ్స్‌లోనూ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రొటీస్‌ టాప్‌

ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో దక్షిణాఫ్రికా ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో 124 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇన్నాళ్లూ టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా 122 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. న్యూజిలాండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. భారత్‌ 105 పాయింట్లతో నాలుగో ర్యాంకులో నిలిచింది. ఇంగ్లండ్‌ 102 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ 72.22 శాతం విజయాల పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏడు టెస్టులు ఆడిన దక్షిణాఫ్రికా ఐదు విజయాలు, రెండు ఓటములతో 71.43 శాతం పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. 13 టెస్టుల్లో తొమ్మిది విజయాలు, నాలుగు ఓటములు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా 69.23 శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. భారత్‌ 11 టెస్టుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములు, రెండు డ్రాలతో 68 పాయింట్లు సాధించింది. 51.52 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌ ఐదో స్థానంలో, ఇంగ్లండ్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

భారత్‌ ముందు కీలక సవాల్‌

టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. డబ్ల్యూటీసీ పట్టికలోనూ అదే ర్యాంకులో ఉంది. వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకే ఫైనల్‌ బెర్తులు దక్కనున్నాయి. దీంతో టీమిండియాకు రానున్న టెస్టు సిరీస్‌లు కీలకం కానున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఆసీస్‌ 214 పరుగుల తేడాతో గెలుచుకుంది. అయితే రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్‌లోకి బలంగా తిరిగొచ్చింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టులో 176 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వియాన్‌ ముల్డర్‌, ర్యాన్‌ రికెల్టన్‌ సెంచరీలతో అదరగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో సైమన్‌ హార్మర్‌ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు.

ట్యాగ్స్:

Australia Test TeamICC Test RankingsICC Test Team RankingsIndia Test RankingsIndia WTC RankingSouth Africa Cricket TeamSouth Africa No 1 Test TeamSouth Africa Vs Australia Test SeriesTelugu NewsWorld Test Championship 2025 27WTC 2027 FinalWTC Points Table
Advertisement
Advertisement