త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Rate | బంగారం కొనుగోలుదారుల‌కు బిగ్ రిలీఫ్‌.. ఒకే రోజు రూ.3200 డౌన్‌.. అదే బాట‌లో వెండి

Gold Rate | బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు భారీ రిలీఫ్ ఇవ్వ‌గా.. పెట్టుబడిదారుల‌కు మాత్రం షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో శనివారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1,42,000కు చేరింది.

P

Business | Published On Oct 31, 2026, 9.15 pm IST

Gold Rate | బంగారం కొనుగోలుదారుల‌కు బిగ్ రిలీఫ్‌.. ఒకే రోజు రూ.3200 డౌన్‌.. అదే బాట‌లో వెండి
Advertisement

Gold Rate | బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు భారీ రిలీఫ్ ఇవ్వ‌గా.. పెట్టుబడిదారుల‌కు మాత్రం షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో శనివారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1,42,000కు చేరింది. దీంతో పది నెలల కనిష్టానికి పడిపోయినట్లయింది. వెండి ధర కూడా కిలోపై రూ.4,200 తగ్గి రూ.1,86,000 వద్దకు చేరింది.

దేశీయ మార్కెట్‌లో ధరల పతనం

ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో శుక్రవారం రూ.1,45,200గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.1,42,000కు దిగొచ్చింది. గతేడాది డిసెంబర్‌ 26న నమోదైన రూ.1,42,300 ధరే ఇంతకుముందు కనిష్ట స్థాయి. తాజాగా అంతకంటే దిగువకు చేరింది. మరోవైపు కిలో వెండి ధర శుక్రవారం రూ.1,90,200 ఉండగా.. శనివారం రూ.1,86,000కు పడిపోయింది. గతేడాది డిసెంబర్‌ 8న నమోదైన రూ.1,85,000 కనిష్ట ధరకు ఇది చేరువైంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ..

విదేశీ మార్కెట్లలోనూ పసిడి, వెండిపై అమ్మకాల వెల్లువ కొనసాగింది. అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 145.84 డాలర్లు (దాదాపు 4 శాతం) తగ్గి 3,875.55 డాలర్లకు చేరింది. ఇది ఏడాదికి పైగా కాలంలో కనిష్ట స్థాయి. ఇక వెండి ధర ఔన్సుకు 3.04 డాలర్లు (6 శాతం) పడిపోయి 49.12 డాలర్ల వద్ద ముగిసింది. షాంఘై ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ ధరలు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ప్రీమియంతోనే కొనసాగాయి.

ధరల పతనానికి కారణాలివే!

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించే అవకాశాలు పెరగడం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగబాకడం బులియన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతున్నాయని 360 వన్‌ అసెట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫండ్‌ మేనేజర్‌ రాహుల్‌ ఖేతావత్‌ పేర్కొన్నారు. దీంతో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లి బంగారం, వెండిపై ఒత్తిడి పెరిగిందన్నారు.

అన‌లిస్ట్‌లు ఏమ‌న్నారంటే..

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీస్‌ అనలిస్ట్‌ మానవ్‌ మోదీ ప్రకారం.. చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో డిసెంబర్‌లో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కంపెనీల షేర్లలో తగ్గుదలతో పెట్టుబడిదారులు నగదు సమీకరణకు దిగుతున్నారు. దీంతో బంగారం, వెండిలోనూ అమ్మకాలు పెరిగాయి. నగదు అవసరాల కోసం చైనాలో కొందరు ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పారిశ్రామిక అవసరాలు, మార్కెట్‌ అంచనాల్లో మార్పులు వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. యూఎస్ మిడ్‌టర్మ్‌ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో ఊహాజనిత షార్ట్‌ పొజిషన్లు పెరగడం కూడా ధరల కదలికలపై ప్రభావం చూపుతోంది.

ధరలు ఎలా ఉండొచ్చు?

సమీప కాలంలో బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులపై స్పష్టత వచ్చే వరకు బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్స్:

Bullion MarketDelhiGold MarketGold PriceGold RateGold Rate TodayHyderabadSilver PriceSilver RateTelugu NewsUS Federal Reserve
Advertisement
Advertisement