త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gautam Gambhir | ఆ బలహీనతను అధిగమించాలి.. భారత బ్యాటింగ్‌పై గంభీర్‌ కీలక వ్యాఖ్యలు..

Gautam Gambhir | న్యూజిలాండ్‌ గడ్డపై భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు అక్కడి పరిస్థితులు దగ్గరగా ఉండడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

P

Sports | Published On Nov 13, 2026, 6.01 pm IST

Gautam Gambhir | ఆ బలహీనతను అధిగమించాలి.. భారత బ్యాటింగ్‌పై గంభీర్‌ కీలక వ్యాఖ్యలు..
Advertisement

Gautam Gambhir | న్యూజిలాండ్‌ గడ్డపై భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు అక్కడి పరిస్థితులు దగ్గరగా ఉండడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగో వన్డేలో భారత జట్టు కేవలం 89 పరుగులకే ఆలౌట్‌ కావడంపై స్పందించిన గంభీర్‌.. తక్కువ స్కోరు కంటే, ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు కొనసాగించలేకపోవడమే అసలు సమస్యని పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు ముందే ఈ బలహీనతను అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

244 పరుగుల భారీ తేడాతో ఓటమి..

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 244 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. న్యూజిలాండ్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ ధాటికి 26.4 ఓవర్లలోనే 89 పరుగులకు కుప్పకూలింది. హెన్రీ ఆరు వికెట్లతో భారత బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. ఈ ఘోర పరాజయంపై గంభీర్‌ మాట్లాడుతూ.. ‘ఒక జట్టు 90 పరుగుల సమీపంలో ఆలౌట్‌ అయితే ఆందోళన చెందడం సహజం. నేను ఎందుకు ఆందోళన చెందను? ఇక్కడి పరిస్థితులు వచ్చే ప్రపంచకప్‌లో ఎదురయ్యే పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటాయి. మా ప్రధాన ఆందోళన పరుగులు చేయలేకపోవడం కాదు. కేవలం 26-27 ఓవర్లలోనే ఆలౌట్‌ కావడమే. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం’ అని పేర్కొన్నాడు.

తొలి పది ఓవర్లే కీలకం..

న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ ఆరంభంలోని పది ఓవర్లు బ్యాటర్లకు అత్యంత కఠినమైన సమయమని వివరించాడు. భారత పరిస్థితులతో పోలిస్తే న్యూజిలాండ్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం పెద్ద సవాలని చెప్పాడు. ‘ఇక్కడ తొలి పది ఓవర్లు బ్యాటింగ్‌కు చాలా కష్టమైన సమయం. ఆ పది ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 35-40 పరుగులు చేయగలిగితే అది మంచి ప్రదర్శనే అవుతుంది. భారత్‌లో తొలి పది ఓవర్లలో బ్యాటింగ్‌ చేయడం సాధారణంగా సులభంగా ఉంటుంది. కానీ న్యూజిలాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని గంభీర్‌ వివరించాడు.

ముందుకు వెళ్లాలా.. వెనక్కి తగ్గాలా?

న్యూజిలాండ్‌ పేసర్లు మాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని గంభీర్‌ సూచించాడు. ముఖ్యంగా బంతి లెంగ్త్‌ను అంచనా వేయడంలో తడబడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఫ్రంట్‌ఫుట్‌పై ఆడాలా? బ్యాక్‌ఫుట్‌కు వెళ్లాలా? అనే విషయంలో బ్యాటర్లు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నాడు. ఇటీవలి మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాటింగ్‌ ఇదే తరహా ఒడిదుడుకులను ఎదుర్కొంది. వర్షం కారణంగా కుదించిన గత మ్యాచ్‌లో 135 పరుగుల లక్ష్య ఛేదనలోనూ టీమిండియా 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. వరుసగా ఎదురవుతున్న ఈ వైఫల్యాలు జట్టు బ్యాటింగ్‌ లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

టెక్నిక్‌తో పాటు మానసికంగానూ సిద్ధం కావాలి..

స్వింగ్‌ అయ్యే బంతులను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సాంకేతికంగా, మానసికంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్‌ పర్యటనలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం జట్టుకు కీలకమని ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. కేవలం పరుగులు చేయడమే కాకుండా.. క్రీజులో నిలబడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం కూడా నేర్చుకోవాలని భారత బ్యాటర్లకు ఈ పరాజయం గట్టి హెచ్చరికగా మారింది.

Advertisement
Advertisement