త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్‌

Brazil Vs Japan | ఫిఫా ప్రపంచకప్‌-2026 రౌండ్‌ ఆఫ్‌ 32లో బ్రెజిల్‌ అసాధారణ పోరాట పటిమ కనబరిచింది. హ్యూస్టన్‌ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో జపాన్‌ను 2-1తో ఓడించి ప్రీక్వార్టర్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లోకి అడుగుపెట్టింది. ఇంజ్యురీ టైమ్‌ (90వ నిమిషం)లో గాబ్రియెల్‌ మార్టినెల్లి చేసిన గోల్‌తో బ్రెజిల్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. కార్లో అన్‌సెలోట్టి శిక్షణలోని బ్రెజిల్‌ జట్టు తదుపరి రౌండ్‌లో ఐవరీ కాస్ట్‌–నార్వే మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.

P

Sports | Published On Jun 30, 2026, 6.55 am IST

Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్‌
Advertisement
  • ప్రీక్వార్టర్‌లోకి సాంబా జట్టు
  • 2-1 తేడాతో ఘన విజయం
  • ఇంజ్యురీ టైమ్‌లో బ్రెజిల్‌ మ్యాజిక్‌
  • చివరి నిమిషంలో మార్టినెల్లి మెరుపులు
  • బ్రెజిల్‌ ఆరో ప్రపంచకప్‌ కల సజీవం

Brazil Vs Japan | ఫిఫా ప్రపంచకప్‌-2026 రౌండ్‌ ఆఫ్‌ 32లో బ్రెజిల్‌ అసాధారణ పోరాట పటిమ కనబరిచింది. హ్యూస్టన్‌ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో జపాన్‌ను 2-1తో ఓడించి ప్రీక్వార్టర్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లోకి అడుగుపెట్టింది. ఇంజ్యురీ టైమ్‌ (90వ నిమిషం)లో గాబ్రియెల్‌ మార్టినెల్లి చేసిన గోల్‌తో బ్రెజిల్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. కార్లో అన్‌సెలోట్టి శిక్షణలోని బ్రెజిల్‌ జట్టు తదుపరి రౌండ్‌లో ఐవరీ కాస్ట్‌–నార్వే మ్యాచ్‌ విజేతతో తలపడనుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే జపాన్‌ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దూకుడుగా ఆడింది. 29వ నిమిషంలో బ్రెజిల్‌ డిఫెన్స్‌ చేసిన పొరపాటును చాకచక్యంగా వినియోగించుకున్న కైషు సానో బంతిని అందుకుని వేగంగా ముందుకు దూసుకెళ్లి అద్భుతమైన షాట్‌తో గోల్‌ సాధించాడు. దీంతో జపాన్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌లో సానోకు ఇది తొలి గోల్‌. తొలి ప్రథమార్థంలో బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాళ్లు జపాన్‌ పటిష్ట డిఫెన్స్‌ను ఛేదించలేకపోగా.. విరామం వరకు జపాన్‌ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.

అన్‌సెలోట్టి వ్యూహం ఫలించింది

ద్వితీయార్థంలో బ్రెజిల్‌ కోచ్‌ కార్లో అన్‌సెలోట్టి వ్యూహాన్ని మార్చారు. యువ స్ట్రయికర్‌ ఎండ్రిక్‌ను బరిలోకి దింపడంతో బ్రెజిల్‌ దాడులు మరింత ఎక్కువయ్యాయి. వరుస దాడుల ఫలితంగా 56వ నిమిషంలో గాబ్రియేల్ మగల్హేస్ ఇచ్చిన కచ్చితమైన క్రాస్‌ను కాసెమిరో అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. స్కోరు సమమైన తర్వాత కూడా బ్రెజిల్‌ ఎటాకింగ్‌ జోరును ఏమాత్రం తగ్గించలేదు. వినీషియస్‌ జూనియర్‌ జట్టుకు ఆధిక్యం అందించే అవకాశానికి చేరువైనప్పటికీ.. జపాన్‌ గోల్‌కీపర్‌ జియోన్‌ సుజుకి అద్భుతమైన సేవ్‌తో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. మరోసారి వినీషియస్‌ కొట్టిన షాట్‌ పోస్టును తాకి బయటకు వెళ్లింది. మ్యాచ్‌ ఇంజరీ టైమ్‌లోకి వెళ్లిన వేళ బ్రెజిల్‌ కీలక ఎటాకింగ్‌కు దిగింది. 90వ నిమిషంలో బ్రూనో గిమారాయిస్‌ ఇచ్చిన చక్కటి పాస్‌ను గాబ్రియెల్‌ మార్టినెల్లి అందుకుని గోల్‌కీపర్‌ జియోన్‌ సుజుకిని దాటించి బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో బ్రెజిల్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తుది విజిల్‌ మోగగానే బ్రెజిల్‌ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోగా, జపాన్‌ ఆటగాళ్ల ముఖాల్లో నిరాశ కనిపించింది.

ఓడినా ఆకట్టుకున్న జపాన్‌

పరాజయం పాలైనప్పటికీ జపాన్‌ ఆటతీరు ప్రశంసలు అందుకుంది. క్రమశిక్షణతో కూడిన రక్షణ, వేగవంతమైన కౌంటర్‌ అటాక్స్‌, మొదటి అర్ధభాగంలో కనబరిచిన ఆధిపత్యం.. పెద్ద జట్లకు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం తమకుందని మరోసారి నిరూపించాయి. అయితే, చివరి నిమిషాల్లో బ్రెజిల్‌ పెంచిన ఒత్తిడిని డిఫెన్స్‌ విభాగం తట్టుకోలేకపోయింది. ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో తొలి విజయంపై జపాన్‌ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఈ విజయంతో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకోవాలన్న బ్రెజిల్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. గాబ్రియెల్‌ మార్టినెల్లికి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది ఐదో గోల్‌ కాగా.. అమెరికా గడ్డపై మూడో గోల్‌గా నమోదైంది. మరోవైపు అనుభవజ్ఞుడు కాసెమిరో మరోసారి కీలక మ్యాచ్‌లో తన విలువేంటో చాటుకున్నాడు.

Advertisement
Advertisement