అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగం చేయడం, అక్కడే స్థిరపడటం అనేది చాలామంది భారతీయుల కల. ఇక్కడ ఇండియాలో కంటే విదేశాల్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయని, అక్కడే జీవితం బాగుంటుందని అక్కడే సెటిల్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వెళ్లి అక్కడే సెటిల్ అయి మళ్లీ ఇండియా ముఖం చూడని వాళ్లు కోకొల్లలు. కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం అక్కడ సెటిల్ అయినా విదేశాలు వద్దు.. భారతే ముద్దు అన్నట్టుగా అక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకొని వచ్చేశాడు. ఏంటి ఆయన స్టోరీ? పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. కెనడాలో ఐదేళ్ల పాటు ఉన్న ఓ ఇండియన్ చివరకు అక్కడి జీవితాన్ని తట్టుకోలేక ఆ యాంత్రిక జీవనశైలికి చిరాకు పడి, ఒంటరితనం వేధించడంతో చివరకు ఇండియాకు వచ్చేశాడు. ఇక నేను ఆ జీవితాన్ని భరించలేను.. అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. విదేశాలు పైకి అద్భుతంగానే కనిపిస్తాయి కానీ అదంతా రోబోటిక్ జీవితం అంటూ చెప్పుకొచ్చాడు. కెనడాలో ఏదైనా ఒక పక్కా ప్లాన్ ఉండాలి. పాల ప్యాకెట్ దగ్గర్నుంచి బియ్యం, ఇతర కిరాణా సామాన్లు ఏవి కొనాలన్నా ఒక ప్రణాళిక ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవడానికి ఉండదు. భారత్ లో ఉన్నంత స్వేచ్ఛ ఇక్కడ ఉండదు.. అంటూ సోషల్ మీడియాలో ఆ ఎన్ఆర్ఐ పోస్ట్ పెట్టాడు. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎవరి పని వారిది. ఎవరి జీవితం వారిది. పేరుకే ఫ్రెండ్స్ కానీ నెల గడిచినా ఒక్కడూ కలవడు. ఇండియాలో ఉండే ఆప్యాయతలు అక్కడ ఉండవు అంటూ వాపోయాడు. ఇవన్నీ పక్కన పెడితే కెనడాలో భయంకరమైన చలి ఉంటుంది. ఆ చలి వల్ల ఎక్కడికీ వెళ్లలేం. సెలవులు ఉన్నా ఇంట్లోనే కాలక్షేపం చేయాలి. డేటింగ్ లైఫ్ లేదు. ఎంజాయ్‌మెంట్ లేదు. ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి తప్పితే తగ్గించవు.. అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చాడు. ఇండియా ట్రాఫిక్, జనాల రద్దీ, గందరగోళమే ఇష్టం ఇండియా అంటేనే ట్రాఫిక్, జనాలు, గందరగోళం. కానీ.. ఇవన్నీ నాకు ఇష్టం. ఎలాంటి ప్లాన్ లైఫ్ లో ఉండకూడదు. ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లే స్వేచ్ఛ ఉండాలి. అనుకోకుండా జరిగే పరిచయాలు, ప్లాన్ చేయకుండా ఫ్రెండ్స్‌ను కలవడం, కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండటం.. ఇంత మంచి జీవితం కెనడాలో అయితే నాకు దొరకలేదు అంటూ తన మనసులోని భావాలను బయటపెట్టాడు ఆ ఎన్ఆర్ఐ. డబ్బు, సౌకర్యాలు కంటే మనశ్శాంతి ముఖ్యం. మన వాళ్ల మధ్య బతకడమే ముఖ్యం. అందుకే ఇండియా తిరిగి వచ్చేశా. ఇక నా భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి బెంగ లేదు.. అంటూ భావోద్వేగంతో తన సోషల్ మీడియా పోస్టును ముగించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టుకు కనెక్ట్ అయిన కొందరు ఎన్ఆర్ఐలు.. మాది కూడా సేమ్ ఫీలింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.