త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

95 ఏళ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్‌గా చరిత్రాత్మక విజయం – కేసీఆర్ అభినందనలు

నాగారం గ్రామంలో 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ప్రజలు ప్రేమతో సర్పంచ్​గా నిలబెట్టిన ‘బాపు’కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లకు చేరువైన వయసులో ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అరుదైన ఘట్టంగా నిలిచింది.

a

News | Published On Dec 11, 2025, 10.57 pm IST

95 ఏళ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్‌గా చరిత్రాత్మక విజయం – కేసీఆర్ అభినందనలు
Advertisement

95-Year-Old Wins Sarpanch Election in Nagaram; KCR Congratulates Veteran Leader

త్రినేత్ర, సూర్యాపేట:

Nagaram sarpanch election | సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన, అందరికీ స్ఫూర్తినిచ్చే విజయం నమోదైంది. 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందడం గ్రామ ప్రజలను ఆనందోత్సాహాలలో ముంచెత్తింది. ఊరంతా ఆయనను ప్రేమగా “బాపూ” అని పిలుచుకుంటారు. చిన్నా–పెద్దా అన్న తేడా లేకుండా గ్రామంలో ప్రతి వ్యక్తిని పేరుపెట్టి పిలిచే రామచంద్రారెడ్డికి బాసటగా నిలబడిన ప్రజలు ఘనమైన విజయం అందించారు. ఎటువంటి పదవి లేకుండానే గ్రామాభివృద్ధిని తన బాధ్యతగా భావిస్తూ, ఎన్నోయేళ్లుగా ప్రజల మధ్యే సాగిన ఆయన జీవనం, ఈ ఎన్నిక ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది.

గ్రామంలోని యువతతో పోటిపడి బరిలోకి దిగిన రామచంద్రా రెడ్డి, వయస్సు అనే అడ్డంకిని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు రావడం నిజంగా ప్రత్యేకం. 95 ఏళ్ల వయసులో పోటీలో నిలబడటమే ఒక రికార్డు; గెలుపొందడం మరో రికార్డు. “ఊరు బాగుంటే మనిషి బాగుంటాడు” అనే నమ్మకంతో ఆయన చేసిన ప్రచారం గ్రామ ప్రజల్లో గొప్ప ప్రభావం చూపింది. మహిళలు, యువకులు, పెద్దలు.. అందరూ ఒకేలా ‘బాపు’కి అండగా నిలిచి స్పష్టమైన మెజార్టీని అందించారు. 95 సంవత్సరాల వయసులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న రామచంద్రారెడ్డి, తన ఆరోగ్య రహస్యం ఆహార క్రమశిక్షణే అని తరచూ చెబుతుంటారు.

పోరాటానికి వయసు అడ్డంకి కాదు

విజయం ప్రకటించబడిన వెంటనే గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు భారీ సంఖ్యలో చేరి రామచంద్రా రెడ్డిని భుజాలమీద ఎత్తుకుని సంబురాలు జరిపారు. సుదీర్ఘమైన పోరాట జీవితానికి, వందేళ్లకు చేరువైన వయసులోనూ అచంచలమైన సేవాభావానికి ఊరంతా నీరాజనం పలికింది. ప్రజల ప్రేమ, నమ్మకం ఈ వయసులోనూ ఇంత గొప్ప బాధ్యత అప్పగించడం అరుదైన విషయం.

కాగా, రామచంద్రా రెడ్డి మాజీ మంత్రి, బిఆర్​ఎస్​ నాయకుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రిగారు. కుటుంబం ఎప్పటినుంచో ప్రజాసేవలో చురుకుగా ఉండడం కూడా ఈ విజయానికి మరో కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభమైన రోజునుంచే గ్రామంలో పోటీ హోరాహోరీగా మారింది. పార్టీలకు అతీతంగా, “మన ఊరు – మన బాపు” అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది.

ఈ చరిత్రాత్మక విజయంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందిస్తూ రామచంద్రా రెడ్డిని అభినందించారు. ఇంత వయసులోనూ ప్రజాసేవ కోసం ముందుకు రావడం, ఎన్నికల్లో పోటీ పడటం, ప్రజల మద్దతుతో గెలవడం ప్రజాస్వామ్యంలో చాలా అరుదైన విషయం అన్నారు. “దీంతో ప్రజల్లో విశ్వాసం, గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద నమ్మకం మరింత బలపడుతుంది” అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే నాగారం గ్రామ ప్రజలకు, మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రారెడ్డి గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, గ్రామ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆశిస్తున్నానని కేసీఆర్ ఫోన్​లో ఆయనతో సంభాషిస్తూ అభిలషించారు.

నాగారం ఎన్నికలు ఈసారి రాష్ట్ర దృష్టిని ఆకర్షించాయి. వందేళ్లకు చేరువైన వయసులో ఒక నాయకుడు ప్రజల ముందుకు రావడం, యువతతో పోటీ పడటం, స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించడం—ఇది తెలుగు రాష్ట్రాల గ్రామ రాజకీయాల్లో అరుదుగా నమోదైన ఘట్టం. ఈ విజయం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదు; గ్రామం మొత్తం ఏకతా, విశ్వాసం, సేవాభావానికి ప్రతీకగా నిలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement