త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Thummala Nageshwar Rao | శాటిలైట్ మ్యాపింగ్‌తో పంట‌ల ప్ర‌ణాళిక‌ సుల‌భం: మంత్రి తుమ్మ‌ల‌

Minister Thummala Nageshwar Rao | పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ ఒక దిక్సూచిగా ఉప‌యోగ‌ప‌డాల‌ని.. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని శాటిలైట్ డేటా ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం అత్యవసరమ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. ఇందులో మార్కెటింగ్, డిమాండ్ అంచనా, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ, గిడ్డంగి సదుపాయాలు, పంట నష్టాల అంచనా, పంట భీమా వంటి అంశాల‌ను సమన్వయం చేయడంలో ఉపగ్రహ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

S

News | Published On Apr 4, 2026, 5.41 pm IST

Minister Thummala Nageshwar Rao | శాటిలైట్ మ్యాపింగ్‌తో పంట‌ల ప్ర‌ణాళిక‌ సుల‌భం: మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ ఒక దిక్సూచిగా ఉప‌యోగ‌ప‌డాల‌ని.. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని శాటిలైట్ డేటా ఆధారంగా ముందుకు తీసుకెళ్లడం అత్యవసరమ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. ఇందులో మార్కెటింగ్, డిమాండ్ అంచనా, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ, గిడ్డంగి సదుపాయాలు, పంట నష్టాల అంచనా, పంట భీమా వంటి అంశాల‌ను సమన్వయం చేయడంలో ఉపగ్రహ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్య‌వ‌సాయ‌ యూనివర్సిటీ, అధికారులతో స‌చివాల‌యంలో శ‌నివారం ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్ (Satellite Crop Mapping) పై తుమ్మల సమావేశం నిర్వ‌హించారు.

పంటల‌ బీమా, నష్టాల అంచనాల్లో పారదర్శకత కోసం..

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా. నీలిమ గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన శాటిలైట్ డేటా ఆధారంగా సేకరించిన వివరాలను మంత్రికి వివరించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా పంటల విస్తీర్ణం, వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ డేటాలో ఉన్న స్వల్ప తేడాలను వివరించారు. ఈ డేటా ఖచ్చితత్వం కోసం ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల సరళిని వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ డేటాతో సరిపోల్చుతున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామ‌ని వెల్లడించారు.

వివ‌రాలందితే వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు..

అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడారు. ఉపగ్రహ మ్యాపింగ్ ద్వారా ప్రతి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, సాగులో ఉన్న పంటల రకాలు, ఉత్పత్తి అంచనాలు, గిడ్డంగి సదుపాయాల అవసరాలు వంటి అంశాలపై ముందుగానే స్పష్టత లభిస్తుంది. దీంతో రైతులకు సమయానుకూల సూచనలు తెలియ‌జేయ‌వ‌చ్చు. అలాగే వ్యవసాయ శాఖ చర్యలను సుల‌భంగా వేగవంతం చేయొచ్చు. భారీ వర్షాలు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల పంటలకు కలిగే నష్టాలను గుర్తించి ప్రభుత్వానికి వివ‌రాలు అందిస్తే సహాయక చర్యలు వేగంగా చేపట్టొచ్చు.

ఖర్చులు త‌గ్గించి దిగుబ‌డులు పెంచొచ్చు..

రైతుల పంట వివ‌రాలు తెలిస్తే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవ‌చ్చ‌ని తుమ్మ‌ల చెప్పారు. అధిక ఉత్పత్తి లేదా కొరత పరిస్థితులను ముందే అంచనా వేసి సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించవచ్చ‌న్నారు. రెవెన్యూ శాఖ, అటవీశాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వ‌హించి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని సెక్రటరీకి సూచించారు. అటవీశాఖ భూముల్లో యూకలిప్టస్, సుబాబుల్ తో పాటు రైతుల‌ పంటల‌ వివరాలు తెలిసేలా శాటిలైట్ డేటా విశ్లేషణ చేయాల‌ని వెల్ల‌డించారు. సాంకేతిక వినియోగంతో ఖర్చులు త‌గ్గించుకొని దిగుబడులు పెంచుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. భూసార స్థితి, నీటి లభ్యత, పంటల నాణ్య‌త‌ వంటి అంశాలను విశ్లేషించి రైతులకు సూచ‌న‌లు చేయొచ్చ‌ని వివ‌రించారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement