త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Justice Surya Kant | సీజేఐ సూర్య‌కాంత్ రాజీనామాకు డిమాండ్‌.. బార్ అసోసియేష‌న్ల‌ ఆగ్రహం!

P

National | Published On Oct 12, 2026, 9.10 pm IST

CJI Justice Surya Kant | సీజేఐ సూర్య‌కాంత్ రాజీనామాకు డిమాండ్‌.. బార్ అసోసియేష‌న్ల‌ ఆగ్రహం!
Advertisement
  • న్యాయవ్యవస్థ ప్రతిష్ట‌ను దెబ్బతీసే వ్యాఖ్యలు సరికాదు
  • న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణన
  • చట్టబద్ధ మార్గాల్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని స్పష్టం

CJI Justice Surya Kant | భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజీనామా చేయాలంటూ సోషల్‌ మీడియాలో వ‌స్తున్న డిమాండ్ల‌పై సుప్రీంకోర్టు బార్‌ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ తరహా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరచడంతో పాటు న్యాయ నిర్వహణలో జోక్యం చేసుకునే ప్రయత్నంగా పరిణమిస్తాయని పేర్కొన్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ), సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) అక్టోబర్‌ 12, 2026న వేర్వేరుగా తీర్మానాలు చేశాయి.

న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి

సీజేఐ రాజీనామా కోరుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై ఎస్‌సీబీఏ అభ్యంతరం తెలిపింది. చట్టం ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి, తమకు తగిన పరిష్కారాలను కోరే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేసింది. అయితే న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను తగ్గించడమే కాకుండా, న్యాయ నిర్వహణలో జోక్యం చేసుకునే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని తీర్మానంలో పేర్కొంది. సుప్రీంకోర్టు గౌరవం, హుందాతనాన్ని కాపాడేలా తమ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని బార్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. ఈ తీర్మానంపై ఎస్‌సీబీఏ గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బగేల్‌ సంతకం చేశారు.

రాజ్యాంగబద్ధ మార్గాల్లోనే అభ్యంతరాలు

సీజేఐ రాజీనామాను కోరుతూ బహిరంగ వేదికల్లో వ్యక్తమవుతున్న వ్యాఖ్యలను ఎస్‌సీఏఓఆర్‌ఏ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. చట్టబద్ధ పాలనను నిలబెట్టడం, పౌరుల హక్కులను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలను న్యాయవ్యవస్థ నిర్వర్తిస్తోందని గుర్తుచేసింది. న్యాయ వ్యవహారాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తగిన చట్టపరమైన, రాజ్యాంగబద్ధ మార్గాల ద్వారానే వాటిని వ్యక్తం చేయాలని సూచించింది. న్యాయవ్యవస్థ అధిపతి రాజీనామాను కోరుతూ బహిరంగ ప్రకటనలు చేయడం ఆ పదవి గౌరవాన్ని, సంస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎస్‌సీఏఓఆర్‌ఏ తన తీర్మానంలో పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను గౌరవించాలని, సుప్రీంకోర్టు హుందాతనాన్ని కాపాడాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది.

ఒత్తిళ్లకు తావుండకూడదు

న్యాయ ప్రక్రియ ఎలాంటి ఒత్తిళ్లు, జోక్యాలు లేకుండా స్వతంత్రంగా కొనసాగేందుకు అవకాశం కల్పించాలని ఎస్‌సీఏఓఆర్‌ఏ స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసేటప్పుడు సంస్థాగత గౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఈ మేరకు విడుదల చేసిన తీర్మానంపై ఎస్‌సీఏఓఆర్‌ఏ గౌరవ కార్యదర్శి యుగంధర పవార్‌ ఝా సంతకం చేశారు.

Advertisement
Advertisement