త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే

November Weather Forecast | నవంబర్‌ నెలలోనూ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మరోవైపు వర్షాలు కూడా అంతంతమాత్రంగానే కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో అక్టోబర్‌ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.

P

National | Published On Nov 1, 2026, 5.17 pm IST

November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే
Advertisement
  • సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు!
  • తెలంగాణలోనూ అదే పరిస్థితి

November Weather Forecast | నవంబర్‌ నెలలోనూ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మరోవైపు వర్షాలు కూడా అంతంతమాత్రంగానే కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో అక్టోబర్‌ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదైంది. నవంబర్‌లోనూ సాధారణం కంటే అధిక పగటి ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్‌లో అర్నబ్‌ తుపాను ప్రభావంతో పలుచోట్ల ఉష్ణోగ్రతలు మితంగానే ఉన్నాయని తెలిపింది. నవంబర్‌లో ఈ పరిస్థితులు ఉండవని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

నవంబర్‌ నెలకు సంబంధించి శనివారం విడుదల చేసిన నెలవారీ వాతావరణ అంచనాల్లో ఐఎండీ పలు కీలక విషయాలను వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతాల దిగువ ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో లేదంటే కొంత తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. మధ్య, తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో లేదంటే అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా నవంబర్‌ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతుంటాయి. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లో 27 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని గోవా, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వాతావరణం కొంత వెచ్చగా ఉంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 33 డిగ్రీల వరకు నమోదవుతాయి. కొండ ప్రాంతాలైన లేహ్‌, శ్రీనగర్‌ పరిసరాల్లో 8 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి. మధ్య, తూర్పు భారతదేశంలో సాధారణంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

సాధారణం కంటే తక్కువ వర్షపాతం

నవంబర్‌ నెలలో వర్షపాతానికి సంబంధించి కూడా ఐఎండీ కీలక అంచనాలను వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాల కొరత ఉండొచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్‌లో దీర్ఘకాలిక సగటు (Long Period Average - LPA) వర్షపాతంలో కేవలం 77 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 1971 నుంచి 2020 వరకు నమోదైన వర్షపాత గణాంకాల ఆధారంగా నవంబర్‌ నెలలో దేశ సగటు దీర్ఘకాలిక వర్షపాతం 29.7 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది నవంబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోనూ లోటు..

తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. సాధారణంగా ఈ నెలలో ఈశాన్య రుతుపవనాలు, ఇతర వాతావరణ వ్యవస్థల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పలు జిల్లాల్లో చినుకులు కూడా పడని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంఘం (TGDPS) గణాంకాల ప్రకారం.. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు రాష్ట్రంలో 830.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 628.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 24 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. అక్టోబర్‌ నెలలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఆ నెలలో సాధారణంగా నమోదుకావాల్సిన వర్షపాతంతో పోలిస్తే దాదాపు 86 శాతం లోటు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. జిల్లాలవారీగా చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 44 శాతం, నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 42 శాతం, హనుమకొండలో 41 శాతం లోటు ఉంది. హైదరాబాద్‌లోనూ సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 39 శాతం లోటు కనిపించింది.

నవంబర్‌లో తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు

నవంబర్‌ నెలకు సంబంధించి ఐఎండీ విడుదల చేసిన అంచనాలు తెలంగాణకు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే పగటిపూట సాధారణం కంటే ఎక్కువ వేడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా. నవంబర్‌ మొదటి వారంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. నవంబర్‌ 1 నుంచి 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షం, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడిన లోటు పూర్తిగా భర్తీ అవుతుందని చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలకు మరింత విస్తృతంగా వర్షాలు కురిస్తేనే కొంత ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన వర్షపాత లోటు నేపథ్యంలో నవంబర్‌లో కురిసే వర్షాలు కీలకంగా మారనున్నాయి.

బలపడనున్న ఎల్‌నినో..

మరోవైపు భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం చాలా బలమైన ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లోనూ ఇవి మరింత బలపడే అవకాశముందని తాజా వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులు వాతావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడానికి బలమైన ఎల్‌నినో పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణమై ఉండొచ్చని ఐఎండీ వెల్లడించింది.

1901 తర్వాత అక్టోబర్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 32.43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1901 తర్వాత అక్టోబర్‌ నెలలో నమోదైన అత్యధిక సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. సాధారణంగా అక్టోబర్‌ నెలలో దేశ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31.37 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఈసారి సాధారణం కంటే గణనీయంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే నవంబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే నమోదైన వర్షపాత లోటు, రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల అంచనాలు ప్రజల్లో.. ముఖ్యంగా రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్‌ మొదటి వారంలో కురిసే అవకాశం ఉన్న వర్షాలు రాష్ట్రానికి ఎంతమేర ఉపశమనం కలిగిస్తాయో వేచి చూడాలి.

ట్యాగ్స్:

El Nino EffectHyderabad WeatherIMD Weather AlertIndia Weather ForecastNovember 2026November RainfallNovember TemperaturesNovember Weather ForecastRainfall Forecast November 2026Telangana Rainfall DeficitTelangana TemperatureTelangana WeatherTelugu NewsWeather Update
Advertisement
Advertisement