త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Most Richest Temples | దేశంలో అత్యంత సంప‌న్న ఆల‌యాలు.. జాబితాలో తిరుమ‌ల ఫ‌స్ట్!

Most Richest Temples | దేవాల‌యాలు (Most Richest Temples) అపారమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విశేషమైన సంపదకు నిలయాలుగా భాసిల్లుతున్నాయి. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు, అనాదిగా వ‌స్తున్న సంప‌ద‌తో తుల‌తూగుతున్నాయి.

G

National | Published On Jun 7, 2026, 9.02 am IST

Most Richest Temples | దేశంలో అత్యంత సంప‌న్న ఆల‌యాలు.. జాబితాలో తిరుమ‌ల ఫ‌స్ట్!
Advertisement

Most Richest Temples | త్రినేత్ర‌.న్యూస్‌: ఆల‌యాలు ఆధ్యాత్మిక‌త‌కు, ప‌విత్ర‌త‌కు నిల‌యాలు. మ‌నిషి తాను న‌మ్మే దైవానికి చేరువ కావ‌డానికి మార్గాలు. జీవితంలో ఒక్క‌సారైనా ఆ ఆల‌యంలో మూల మూర్తిని చూసి త‌రించాలని చాలా మంది భ‌క్తులు అనుకుంటారు. అలాంటి దేవాల‌యాలు (Most Richest Temples) అపారమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విశేషమైన సంపదకు నిలయాలుగా భాసిల్లుతున్నాయి. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు, అనాదిగా వ‌స్తున్న సంప‌ద‌తో తుల‌తూగుతున్నాయి. దీంతో అపార‌మైన సంప‌ద‌, బంగారం, ఆస్తుల‌తో అత్యంత సంప‌న్న ఆల‌యాలుగా నిలుస్తున్నాయి. ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేశంలోనే అత్యంత సంపన్న ఆలయంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో కేర‌ళ‌ల‌లో అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం, షిర్డీ సాయినాథుడు, మాతా వైష్ణో దేవి ఆల‌యాలు అత్యంత ధ‌నిక దేవాల‌యాలుగా పేరొందాయి.

తిరుమ‌ల శ్రీ వేక‌టేశ్వ‌ర స్వామి..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవమైన తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌రుడిని జీవితంలో ఒక్క‌సారైనా క‌న్నులారా చూసి త‌రించాల‌ని చాలా మంది భ‌వ‌క్తులు అనుకుంటుంటారు. ప్ర‌తిరోజు స‌గ‌టున 50 వేల మందికిపైగా భ‌క్తులు ద‌ర్శించుకుంటుంటారు. స్వామికి వారికి కానుక‌లు, న‌గ‌దు రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో ఈ ఆల‌య ఆస్తుల విలువ సుమారు రూ.3 లక్షల కోట్లకుపైగా (దాదాపు 40 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. హుండీ ఆదాయం, బంగారం, ఇతర విరాళాల రూపంలో ఏడాదికి సుమారు రూ.1,400 కోట్లు ఆదాయం లభిస్తున్న‌ది. ఒక మే నెల‌లోనే హుండీ ఆదాయం రూ.120 కోట్లు స‌మ‌కూరింది. మే 3న అత్య‌ధికంగా రూ.5.06 కోట్ల ఆదాయం హుండీ ద్వారా రావ‌డం గ‌మ‌నార్హం. నివేదికల ప్రకారం తిరుమల శ్రీవారి ఖజానాలో, వివిధ జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసిన రూపంలో 10 టన్నులకు పైగా బంగారం ఉంది.

అనంత ప‌ద్మ‌నాభుడు..

సంపద అనగానే అందరికీ ట‌క్కున‌ గుర్తుకువచ్చేది కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. అయితే సంప‌న్న ఆల‌యాల‌ జాబితాలో ఈ క్షేత్రం ద్వితీయ స్థానంలో ఉంది. 2011లో ఇక్కడి నేలమాళిగల్లో లభ్యమైన బంగారం, వజ్రాలు, పురాతన నాణేల విలువ సుమారు రూ.1.2 లక్షల కోట్ల‌కు పైనే (1.2 ట్రిలియ‌న్లు) ఉంటుంద‌ని అంచనా వేశారు. ఈ ఆల‌యంలో నాణేలు, పురాత‌న ఆభ‌ర‌ణాలు, ర‌త్నాలు, విగ్ర‌హాల రూపంలో సుమారు 1500 ట‌న్నుల బంగారం ఉన్నట్లు అంచ‌నా. చారిత్రక ప్రాధాన్యతను కలిపితే దీని విలువ ఊహకు అందదు.

షిర్డీ సాయి..

దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే, ఎక్కువ విరాళాలు అందుకునే పుణ్యక్షేత్రాలలో మ‌హారాష్ట్ర‌లోని షిర్డీ సాయిబాబా ఆల‌యం ఒకటి. జాతి, మత బేధాలు లేకుండా ఏటా కోట్లాది మంది భక్తులు సాయిని దర్శించుకుంటారు. దీంతో వంద‌ల కోట్ల న‌గ‌దు విరాళంగా వ‌స్తుంది. బాబా ఖజానాలో వందల కోట్ల విలువైన బంగారం, వెండి, నవరత్నాలు ఉన్నాయి. 2022లో భక్తులు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు రూ.400 కోట్లకు పైగా విరాళాలు సమర్పించారు. ఇందులో హుండీల ద్వారా రూ. 166 కోట్లకు పైగా నగదు, డెబిట్/క్రెడిట్ కార్డులు మరియు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా రూ. 144 కోట్లకు పైగా, క్యాష్ కౌంటర్ల ద్వారా రూ. 74 కోట్లకు పైగా ఆదాయం లభించింది. వీటితో పాటు ఆలయానికి 26 కేజీలకు పైగా బంగారం, 330 కేజీల వెండి విరాళాలుగా వచ్చాయి.

మాతా వైష్ణోదేవి ఆల‌యం..

జమ్ము కశ్మీర్​లోని కాట్రా అనే ప్రదేశంలో త్రికూట పర్వత శిఖరాల్లో వైష్ణోదేవి ఆలయం ఉన్న‌ది. సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో వెలసిన వైష్ణోదేవి భక్తుల కోర్కెలు తీర్చే చల్లని తల్లి. అత్యంత పురాతనమైన ఈ ఆలయానికి సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో భ‌క్తులు తరలివ‌స్తుంటారు. భక్తుల నుంచి బంగారం, వెండి, నగదు రూపంలో భారీగా విరాళాలు అందుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.63.85 కోట్లుగా ఉన్న విరాళాలు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.171.90 కోట్లకు చేరాయి. బంగారు కానుకలు 2020-21లో 9.075 కిలోల నుంచి 2024-25 నాటికి 27.717 కిలోలకు పెరిగాయి. అదేవిధంగా వెండి కానుకలు 753.630 కిలోల నుంచి 3,424.538 కిలోలకు చేరాయి.

గురువాయూర్ ఆల‌యం..

జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారి అయిన శ్రీకృష్ణుడు వెల‌సిన దివ్య‌క్షేత్రం కేరళలోని గురువాయూర్‌. భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందిన ఈ క్షేత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్న‌ది. దేవతల గురువు బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన ఈ శ్రీకృష్ణుని క్షేత్రం ఎన‌లేని సంప‌దతో తుల‌తూగుతున్న‌ది. ఆల‌యంలో రూ.1,737 కోట్ల బ్యాంకు డిపాజిట్లతో పాటు, 271 ఎకరాల భూమి మరియు భారీ స్థాయిలో బంగారం, వెండి, రత్నాల నిల్వలు ఉన్నాయి. శతాబ్దాల కాలంగా భక్తుల సమర్పించిన కానుకలు, రాజపోషణ కారణంగా ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక, భౌతిక సంపదను కలిగి ఉంది.

 

వెల్లూరు గోల్డెన్ టెంపుల్

తమిళనాడులోని వెల్లూరులో కొలువై ఉన్న లక్ష్మీ నారాయణి దేవాలయం అద్భుతమైన వాస్తుశిల్పానికి, వైభవానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆల‌య‌ గోపురాలు, స్తంభాలు 1.5 టన్నుల స్వచ్ఛమైన బంగారు రేకులతో కప్పబడి ఉన్నాయి.

గోల్డెన్ టెంపుల్

అమృత్‌సర్‌లో ఉన్న పవిత్రమైన హర్మందిర్ సాహిబ్ క్షేత్రాన్ని ప్రపంచమంతా గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తుంది. ఈ ఆలయ పైభాగం, గుమ్మటాలు దాదాపు 500 కిలోల స్వచ్ఛమైన బంగారు పూతతో అలంకరించబడి ఉంటాయి. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ బంగారు పూత పనులను ప్రారంభించారు. ఇక్కడికి కూడా ప్రతి సంవత్సరం దేశవిదేశాల నుండి కోట్ల రూపాయల విరాళాలు అందుతాయి.

Advertisement
Advertisement