త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | దేశ స‌రిహ‌ద్దులు ఇక స్మార్ట్‌గా..!

Amit Shah | దేశ స‌రిహ‌ద్దుల‌ను స్మార్ట్‌బోర్డ‌ర్ మోడ‌ల్‌లో అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. బీఎస్‌ఎఫ్‌ (BSF) వ్యవస్థాపక డైరెక్టర్ కేఎఫ్ రుస్త‌మ్ జీ మెమోరియ‌ల్ లెక్చ‌ర్‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త్ వేగంగా సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను స్వీక‌రిస్తూ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తోంద‌న్నారు.

P

National | Published On May 22, 2026, 3.12 pm IST

Amit Shah | దేశ స‌రిహ‌ద్దులు ఇక స్మార్ట్‌గా..!
Advertisement
  • శ‌త్రుదుర్బేద్యంగా స‌రిహ‌ద్దులు
  • సాంకేతిక వ్య‌వ‌స్థ‌ల‌తో బ‌లోపేతం
  • సంకేతాలిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • రుస్తంజీ మెమోరియ‌ల్ లెక్చ‌ర్‌లో వ్యాఖ్య‌లు

Amit Shah | దేశ స‌రిహ‌ద్దుల‌ను స్మార్ట్‌బోర్డ‌ర్ మోడ‌ల్‌లో అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. బీఎస్‌ఎఫ్‌ (BSF) వ్యవస్థాపక డైరెక్టర్ కేఎఫ్ రుస్త‌మ్ జీ మెమోరియ‌ల్ లెక్చ‌ర్‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త్ వేగంగా సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను స్వీక‌రిస్తూ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తోంద‌న్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఆధునిక కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, నిఘా పరికరాలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలతో కూడిన అధునాతన సరిహద్దు మౌలిక వసతులు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని షా వివ‌రించారు. దేశ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశ‌లో ఈ చ‌ర్య‌లు కీల‌కంగా మార‌నున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

స‌రిహ‌ద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్‌..

స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఏడాదిలోగానే భారత్-బంగ్లాదేశ్, భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వెంట పెద్ద ఎత్తున స్మార్ట్ ఫెన్సింగ్‌తో పాటు సమగ్ర సరిహద్దు నిర్వహణ సిస్ట‌మ్‌ల‌ను అమలు చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే అందించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త సాంకేతిక వ్యవస్థలతో అక్రమ చొరబాట్లు, డ్రోన్ కార్యకలాపాలు, పశువుల స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా వంటి అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించ‌వ‌చ్చ‌ని షా తెలిపారు. భద్రతా సంస్థలకు రియల్ టైమ్ అలర్ట్స్ అందుతాయని, దాంతో సరిహద్దు రక్షణ మరింత సమర్థవంతంగా మారుతుంద‌ని చెప్పారు.

న‌క్స‌లిజంపై ప్ర‌భుత్వ వ్యూహంతో ఫ‌లితాలు

న‌క్స‌లిజం అంశంపై మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యూహం ప్ర‌స్తుతం ఫ‌లితాలు ఇస్తోంద‌న్నారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగిన సమస్య ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంద‌ని, భార‌త్ న‌క్స‌ల్స్ ర‌హిత దేశంగా వేగంగా ముందుకు సాగుతోంద‌న్నారు. ఒక సమస్యను కేవలం నియంత్రించడం సరైన భద్రతా విధానం కాద‌ని, దానిని మూలం నుంచే నిర్మూలించడమే అసలైన పరిష్కారమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదం, చొరబాట్లపై భారత్ క‌ఠినంగానే స్పందిస్తోందని షా స్పష్టం చేశారు. అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, భవిష్యత్తులో కూడా అవసరమైతే అదే త‌ర‌హాలో స్పందిస్తామ‌ని హెచ్చ‌రించారు.

బీఎస్ఎఫ్‌కు అండ‌గా కేంద్రం..

బీఎస్‌ఎఫ్‌ బాధ్యతలు త్వ‌ర‌లోనే మ‌రింత విస్త‌రించ‌నున్నాయ‌ని హోంమంత్రి వెల్ల‌డించారు. స్థానిక అధికారుల‌తో క‌లిసి అక్రమ సరిహద్దు కార్యకలాపాలను అడ్డుకోవడంలో బీఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తుందని షా ప్ర‌క‌టించారు. పట్వారీ స్థాయి నుంచి జిల్లా పరిపాలన వరకు సమన్వయాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు హోంశాఖ మంత్రి వివ‌రించారు. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ సమన్వయం మరింత బ‌ల‌ప‌డుతుంద‌న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టులు, ఫెన్సింగ్ పనులకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని చెప్పారు. సరిహద్దు భద్రతా ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రభుత్వం బీఎస్‌ఎఫ్‌కు అండగా నిలుస్తుందని తేల్చి చెప్పారు.

 

Advertisement
Advertisement