త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiruppur Textile Industry | ఒకప్పుడు నదిని కలుషితం చేసిన నగరం.. ఇప్పుడు రోజుకు 13 కోట్ల లీటర్ల నీటి రీసైకిల్.. ప్రపంచానికే ఆదర్శంగా తిరుపూర్!

ఒకప్పుడు టెక్స్‌టైల్ ఫ్యాక్టరీల రసాయనాలతో నొయ్యల్ నదిని తీవ్రంగా కలుషితం చేసిన తమిళనాడులోని తిరుపూర్ నగరం.. ఇప్పుడు ఏకంగా రోజుకు 130 మిలియన్ లీటర్ల నీటిని రీసైకిల్ చేస్తూ సక్సెస్ స్టోరీగా మారింది. పర్యావరణాన్ని కాపాడుతూనే వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి చాటి చెబుతోంది.

J

National | Published On Mar 8, 2026, 4.45 pm IST

Tiruppur Textile Industry | ఒకప్పుడు నదిని కలుషితం చేసిన నగరం.. ఇప్పుడు రోజుకు 13 కోట్ల లీటర్ల నీటి రీసైకిల్.. ప్రపంచానికే ఆదర్శంగా తిరుపూర్!

సంక్షిప్త సారాంశం

భారతదేశానికి 'నిట్‌వేర్ క్యాపిటల్'గా పేరొందిన తిరుపూర్‌లో, ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనాల వల్ల నొయ్యల్ నది నల్లగా మారిపోయింది. దీనిపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయి 700 ఫ్యాక్టరీలను మూసివేయించింది. దీంతో 50,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే ఈ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకున్న తిరుపూర్.. 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' (ZLD) విధానాన్ని ప్రవేశపెట్టింది. వాడిన నీటిని 92 శాతం వరకు శుద్ధి చేసి మళ్లీ వాడుకుంటూ అద్భుతం సృష్టించింది. ప్రస్తుతం తిరుపూర్ ఏటా రూ.40,000 కోట్ల వస్త్రాలను ఎగుమతి చేస్తూ రికార్డు సృష్టిస్తోంది.

Advertisement

Tiruppur Textile Industry | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడులోని తిరుపూర్.. భారతదేశపు నిట్‌వేర్ క్యాపిటల్ (Knitwear Capital)(అల్లిన బట్టలు). జారా (Zara), హెచ్&ఎమ్ (H&M), గ్యాప్ (Gap) వంటి గ్లోబల్ బ్రాండ్స్‌కు కాటన్ బట్టలను సరఫరా చేసే అతిపెద్ద కేంద్రం. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం ఈ నగరం ఒక అతిపెద్ద పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సంక్షోభం నుంచి కోలుకుని, ఈరోజు ప్రపంచానికే ఎలా ఆదర్శంగా నిలిచిందో తెలుసుకుందాం.

Tiruppur Textile Industry | నల్లగా మారిన నొయ్యల్ నది.. మూతపడిన ఫ్యాక్టరీలు

వస్త్రాలకు రంగులు వేసే డైయింగ్ యూనిట్ల (Dyeing units) నుంచి వెలువడే అత్యంత విషపూరితమైన రసాయనాలు, వ్యర్థాలు నేరుగా పక్కనే ఉన్న నొయ్యల్ నదిలోకి చేరేవి. దీంతో ఒకప్పుడు స్వచ్ఛంగా పారిన ఆ నది నీరు పూర్తిగా నల్లగా (Pitch black) మారిపోయింది.

కోర్టు కొరడా: నదీ కాలుష్యంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు, తక్షణమే 700 డైయింగ్ యూనిట్లను మూసివేయాలని ఆదేశించింది.

భారీ నష్టం: ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీలు మూతపడి సుమారు 50,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రతిరోజూ రూ. 50 కోట్ల భారీ నష్టాన్ని నగరం చవిచూడాల్సి వచ్చింది.

పుంజుకున్న తీరు: 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' (ZLD) విధానం

సంక్షోభంలో కూరుకుపోయిన తిరుపూర్ వెనక్కి తగ్గలేదు. కాలుష్యాన్ని అరికట్టేందుకు సరికొత్త టెక్నాలజీని ఆశ్రయించింది. అందులో భాగంగా 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' (Zero Liquid Discharge) అనే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

నీటి శుద్ధి ఇలా: ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురుగునీరు అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు చేరుతుంది. అక్కడ నీటిలోని ఘన వ్యర్థాలను, ఆర్గానిక్ వేస్ట్‌ను వేరు చేస్తారు. రసాయనాల ద్వారా నీటిలోని రంగును, ఉప్పును తొలగిస్తారు. చివరగా రివర్స్ ఆస్మాసిస్ (RO) విధానం ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఏకంగా 92 శాతం స్వచ్ఛమైన నీటిని తిరిగి పొందుతున్నారు. ఆ నీటినే మళ్లీ ఫ్యాక్టరీల్లో వస్త్రాల తయారీకి ఉపయోగిస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడుతూ.. రూ.40,000 కోట్ల ఎగుమతులు

ప్రస్తుతం తిరుపూర్ నగరం ప్రతిరోజూ 130 మిలియన్ లీటర్ల (13 కోట్ల లీటర్లు) నీటిని రీసైకిల్ చేస్తోంది. ఒక్క చుక్క నీరు కూడా వృథా కావడం లేదు. ప్లాస్టిక్, కార్టన్ అట్టలను సైతం ఇక్కడ రీసైకిల్ చేస్తున్నారు.

ఈ అద్భుతమైన మార్పుతో తిరుపూర్ ఎగుమతులు అమాంతం పెరిగాయి. ఒకప్పుడు రూ. 12,000 కోట్లుగా ఉన్న ఎగుమతులు.. ఇప్పుడు ఏకంగా రూ. 40,000 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బట్టలకు రంగులు వేయడానికి ప్రతి ఏటా 5 ట్రిలియన్ లీటర్ల నీటిని ఉపయోగిస్తుండగా, రీసైకిల్ చేసిన నీటితో వస్త్రాలను తయారు చేస్తూ తిరుపూర్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది.

"ఫ్యాషన్ కోసం భూమిని నాశనం చేయాల్సిన అవసరం లేదు" అని నిరూపించిన ఈ తమిళనాడు నగరం ఇప్పుడు యావత్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.

Advertisement
Advertisement