త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!

Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గాలిలో కలిసిపోయే అతి సూక్ష్మమైన పీఎం2.5 కణాలు శ్వాసకోశ వ్యవస్థతో పాటు గుండె, మెదడు సహా కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

P

National | Published On Nov 13, 2026, 9.45 pm IST

Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!
Advertisement

Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గాలిలో కలిసిపోయే అతి సూక్ష్మమైన పీఎం2.5 కణాలు శ్వాసకోశ వ్యవస్థతో పాటు గుండె, మెదడు సహా కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు AQI.in వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో పీఎం2.5 స్థాయి ప్రతి ఘనపు మీటరు గాలిలో 296 మైక్రోగ్రాములుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన 24 గంటల మార్గదర్శక పరిమితి 15 మైక్రోగ్రాములతో పోలిస్తే ఇది దాదాపు 20 రెట్లు అధికం. మరోవైపు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 దాటింది. పలు ప్రాంతాల్లో 500కు చేరువైంది. ఈ స్థాయి కాలుష్యంలో ఆరోగ్యవంతులు సైతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆస్తమా, గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ముప్పు మరింత ఎక్కువ.

ఇంత ప్రమాదకరంగా ఎందుకు?

గాలిలో ఉండే కాలుష్య కారకాలన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. వాటిలో పీఎం2.5 అత్యంత ప్రమాదకరమైనది. పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5గా పిలిచే ఈ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. మనిషి వెంట్రుక మందంతో పోలిస్తే ఇవి దాదాపు 30వ వంతు చిన్నవి. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, దుమ్ము, మంటల నుంచి వచ్చే పొగ, పంట వ్యర్థాల దహనం వంటి వాటి ద్వారా ఇవి గాలిలోకి చేరుతాయి. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉండే ధూళి కణాలు ముక్కు, గొంతు వద్దే కొంతవరకు నిలిచిపోతాయి. కానీ పీఎం2.5 కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల లోతైన భాగాలకు చేరుకోగలవు. వాటిలో కొన్ని ఊపిరితిత్తుల రక్షణ పొరను దాటి రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశముంది. తద్వారా శరీరంలోని ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతుంది. దీర్ఘకాలం ఈ కాలుష్యానికి గురైతే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది.

దేశంలో ఏక్యూఐ ఎలా లెక్కిస్తారు?

భారత్‌లో గాలి నాణ్యతను అంచనా వేసేందుకు సీపీసీబీ జాతీయ వాయు నాణ్యత సూచీ (నేషనల్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌)ను ఉపయోగిస్తోంది. గాలిలోని కాలుష్య స్థాయిని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సంఖ్యలు, రంగుల రూపంలో తెలియజేయడం దీని ఉద్దేశం. పీఎం2.5, పీఎం10, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (ఎన్‌ఓ2), సల్ఫర్‌ డయాక్సైడ్‌ (ఎస్‌ఓ2), కార్బన్‌ మోనాక్సైడ్‌ (సీఓ), ఓజోన్‌ (ఓ3), అమ్మోనియా (ఎన్‌హెచ్‌3), లెడ్‌ వంటి ఎనిమిది కాలుష్య కారకాల ఆధారంగా ఏక్యూఐని లెక్కిస్తారు. సీపీసీబీ ప్రమాణాల ప్రకారం ఏక్యూఐని ఆరు కేటగిరీలుగా విభజించారు. 0-50 గాలి నాణ్య‌త బాగుంద‌ని అర్థం. ఆరోగ్యంపై ప్రభావం చాలా తక్కువ. 51-100 మ‌ధ్య ఉంటే సాధారణంగా స్వల్ప ప్రభావాలే ఉంటాయి. 101-200 మ‌ధ్య ఊపిరితిత్తులు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయి. 201-300 గాలి నాణ్య‌త పేలవమ‌ని అర్థం. ఎక్కువసేపు కాలుష్య గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు వ‌స్తాయి. 301-400 పేలవంగా ఉంద‌ని.. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురైతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 401-500 చాలా డేంజ‌రెస్ ఆరోగ్యవంతులకూ శ్వాస సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇప్పటికే అనారోగ్య సమస్యలున్నవారికి తీవ్ర ముప్పు ఉంటుంది. గాలి కాలుష్యానికి పూర్తిగా ప్రమాదరహితమైన స్థాయి లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోంది. కాలుష్యం ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

భారత్‌.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల్లో తేడా ఇదే!

వాయు కాలుష్య నియంత్రణకు భారత్‌ జాతీయ పరిసర గాలి నాణ్యత ప్రమాణాలను (ఎన్‌ఏఏక్యూఎస్‌) అమలు చేస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం మరింత కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. ముఖ్యంగా పీఎం2.5 విషయంలో ఈ రెండు ప్రమాణాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. పీఎం2.5 వార్షిక సగటు పరిమితి 40 మైక్రోగ్రాములు కాగా, 24 గంటల పరిమితి 60 మైక్రోగ్రాములు. వార్షిక సగటు పరిమితి 5 మైక్రోగ్రాములు కాగా, 24 గంటల పరిమితి 15 మైక్రోగ్రాములు.

శరీరంలోని ఏ అవయవాలపై ప్రభావం?

వాయు కాలుష్యం అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఊపిరితిత్తుల సమస్యలే. కానీ విషపూరిత గాలిలోని సూక్ష్మ కణాలు రక్తంలోకి చేరడం ద్వారా ఇతర అవయవాలనూ ప్రభావితం చేయగలవు.

ఊపిరితిత్తులు: పీఎం2.5, పీఎం10 కణాలు శ్వాసనాళాల్లోకి చేరి వాపు, చికాకు కలిగిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్‌ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురైతే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో పాటు సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది.

గుండె, రక్తనాళాలు: కాలుష్య కణాలు రక్తప్రవాహంలోకి చేరడం వల్ల వాపు ప్రక్రియలు పెరిగి రక్తనాళాల పనితీరుపై ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరగడం, రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికమవుతుంది. దీర్ఘకాలికంగా గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుంది.

మెదడు: రక్తనాళాల పనితీరులో మార్పులు, శరీరంలో పెరిగే వాపు ప్రక్రియలు మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం వల్ల పక్షవాతం (స్ట్రోక్‌) ముప్పు పెరిగే అవకాశముంది.

చర్మం: కాలుష్యంలోని దుమ్ము, పొగ, ఇతర హానికారక పదార్థాలు చర్మం సహజ రక్షణ పొరను దెబ్బతీస్తాయి. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కారణంగా కొల్లాజెన్‌ దెబ్బతిని చిన్న వయసులోనే ముడతలు రావచ్చు. కొందరిలో దురద, ఎర్రబడటం, మంట, ఎగ్జిమా వంటి సమస్యలు కనిపిస్తాయి.

కళ్లు: దుమ్ము, పొగ, ఓజోన్‌ వంటి కాలుష్య కారకాల వల్ల కళ్లలో మంట, దురద, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే కంటి సమస్యలున్నవారిలో ఇబ్బందులు మరింత పెరగవచ్చు.

జుట్టు, తల చర్మం: గాలిలోని కాలుష్య కారకాలు తల చర్మంపై పేరుకుపోవడంతో దురద, చికాకు కలుగుతాయి. దీనివల్ల జుట్టు, తల చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.

రోగనిరోధక శక్తి, గర్భధారణ: దీర్ఘకాలిక కాలుష్య ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. గర్భిణులు, పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపైనా ప్రమాదం పొంచి ఉంటుంది.

ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణాలివే..

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి ఒక్క కారణమే లేదు. పలు అంశాలు కలిసికట్టుగా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ పనుల వల్ల ఎగసిపడే దుమ్ము, పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటికి వాతావరణ పరిస్థితులు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం, వర్షాలు లేకపోవడం వల్ల కాలుష్య కారకాలు గాలిలోనే పేరుకుపోతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడంతో విషపూరిత కణాలు భూమికి దగ్గరగా ఎక్కువసేపు నిలిచిపోతాయి.

రోజువారీ జీవితంపైనా ప్రభావం

వాయు కాలుష్యం ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నవారికే పరిమితం కాదు. ఆరోగ్యవంతులపైనా దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏక్యూఐ పెరిగే కొద్దీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల మంట, చర్మ సమస్యలు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిద్ర, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యంపైనా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, పుట్టబోయే శిశువులు కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

విషగాలుల నుంచి రక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కాలుష్య స్థాయులు పెరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే ఎన్‌95 వంటి రక్షణ మాస్క్‌ను ఉపయోగించడం మంచిది. సిగరెట్‌, కట్టెలు, బొగ్గు పొగకు దూరంగా ఉండాలి. వంట సమయంలో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. అవసరం, బడ్జెట్‌ను బట్టి మంచి ఫిల్టర్‌ ఉన్న ఎయిర్‌ ప్యూరిఫయర్‌ను ఉప‌యోగించాలి. ఏక్యూఐ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలను ఎక్కువసేపు బయట ఆడనివ్వకూడదు. వృద్ధులు కూడా అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూడాలి. కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు రన్నింగ్‌, సైక్లింగ్‌, వేగంగా నడవడం వంటి వ్యాయామాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే ఇంట్లోనే వ్యాయామం చేయాలి. దగ్గు ఎక్కువ రోజులు కొనసాగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి లేదా తీవ్రమైన శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం ఒక్కరి చేతిలో లేకపోయినా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏక్యూఐ తీవ్ర స్థాయికి చేరినప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం.

Advertisement

తాజావార్తలు

Advertisement