త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

దేశ రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్‌'కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోగా 27 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది.

J

National | Published On May 23, 2026, 11.30 pm IST

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
Advertisement
  • ఢిల్లీలోని ప్రముఖ 'జింఖానా క్లబ్'కు కేంద్ర ప్రభుత్వం ఎవిక్షన్ (eviction) నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.
  • రక్షణ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఇతర పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రాజెక్టుల కోసం ఈ 27 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది.
  • నిధుల దుర్వినియోగం, స్పోర్ట్స్ కంటే విలాసాలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలతో చాలాకాలంగా ప్రభుత్వం, క్లబ్ యాజమాన్యం మధ్య వివాదం నడుస్తోంది.
  • 1913లో ఏర్పాటైన ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్ పొందడం అనేది దేశంలోని అత్యంత సంపన్నులు, ఉన్నతాధికారులకు ఓ స్టేటస్ సింబల్ (Status symbol).

Delhi Gymkhana Club Eviction | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోని బడాబాబులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ఢిల్లీ జింఖానా క్లబ్' (Delhi Gymkhana Club) చరిత్ర ముగింపు దశకు చేరుకుంది. ల్యుటెన్స్ ఢిల్లీలోని 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ ప్రాంగణాన్ని జూన్ 5వ తేదీలోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎవిక్షన్ నోటీసులు (Eviction notice) జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా ఈ క్లబ్ చుట్టూ కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు, వివాదాలకు ఒక్కసారిగా తెరపడినట్లయింది.

రక్షణ రంగానికి (Defence) సంబంధించిన అవసరాలు, ఇతర ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం ఈ స్థలం అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ఈ నోటీసుల్లో పేర్కొంది. ప్రధాని అధికారిక నివాసానికి (7 లోక్ కల్యాణ్ మార్గ్) ఆనుకుని ఉన్న ఈ లీజు స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

క్రీడలు దూరం.. విలాసాలకే ప్రాధాన్యం

1913లో బ్రిటిష్ కాలంలో 'ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్' గా ఈ సంస్థ ఏర్పాటైంది. స్వాతంత్య్రం తర్వాత ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించారు. క్రీడలు, వినోదం (Sports and recreation) కోసం నామమాత్రపు అద్దెతో (ఏడాదికి రూ.1000) ప్రభుత్వం ఈ స్థలాన్ని అప్పట్లో లీజుకు ఇచ్చింది. కానీ, క్లబ్ కేవలం 2 శాతం నిధులను మాత్రమే క్రీడల కోసం వెచ్చిస్తోందని, సుమారు 30 శాతం నిధులను ఖరీదైన వైన్, సిగరెట్లు తదితర విలాసాల కోసం ఖర్చు చేస్తోందని ప్రభుత్వ తనిఖీల్లో (2019-2020) తేలింది.

Delhi Gymkhana Club Gets Eviction Notice from Central Government

మెంబర్‌షిప్ అంటే ఓ స్టేటస్ సింబల్

ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్ దొరకడం అంత ఈజీ కాదు. కోట్లు పెట్టినా సభ్యత్వం రాదు.. మంచి 'నెట్‌వర్క్' (Network) ఉండాలి. మెంబర్‌షిప్ కోసం అప్లై చేస్తే.. అది రావడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఉన్నతాధికారులు, మిలిటరీ చీఫ్‌లు, డిప్లొమాట్లు, జడ్జిలు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉంటారు.

దీనికోసం దశాబ్దాలుగా 40-40-20 రూల్ పాటిస్తున్నారు. 40% సివిల్ సర్వెంట్లకు, 40% డిఫెన్స్ వారికి, మిగిలిన 20% ఇతరులకు కేటాయిస్తారు. పైగా పాత మెంబర్ల పిల్లలకే ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే బయటి వ్యక్తులకు (Outsiders) ఇక్కడ నో ఎంట్రీ.

అడ్మినిస్ట్రేటర్ పాలన.. చివరకు

నిధుల దుర్వినియోగం, బంధుప్రీతి (Nepotism) పై ఆరోపణలు రావడంతో 2020లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. వలసవాద (Colonial) మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని క్లబ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఆ తర్వాత 2021లో ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్యానెల్ చేతుల్లోకి క్లబ్ నిర్వహణ వెళ్లింది. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు.

ఎన్నో ఏళ్లుగా సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరిగిన ఈ వివాదానికి కేంద్రం తాజా నోటీసులతో ఎండ్ కార్డ్ వేసినట్లు అయింది. ఈ జూన్ 5 నాటికి వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న 'ఢిల్లీ జింఖానా క్లబ్' ప్రయాణం ముగియనుందని, అందులో సభ్యత్వం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి కలలు కూడా గల్లంతయినట్లేనని స్పష్టమవుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement